logo

జగనన్న కాలనీ ఇళ్లకు బీటలు!

విజయవాడ నగర పాలక సంస్థ పరిధి గుబ్బలగుట్ట కొండ ప్రాంతంలో జరుగుతున్న బాంబు పేలుళ్ల ప్రభావం జగనన్న కాలనీలో నిర్మాణ దశలో ఉన్న ఇళ్లపై పడింది.

Updated : 07 Dec 2022 05:18 IST

గుబ్బలగుట్ట ప్రాంతంలో బాంబు పేలుళ్లు

పాతపాడు(విజయవాడ గ్రామీణం), న్యూస్‌టుడే : విజయవాడ నగర పాలక సంస్థ పరిధి గుబ్బలగుట్ట కొండ ప్రాంతంలో జరుగుతున్న బాంబు పేలుళ్ల ప్రభావం జగనన్న కాలనీలో నిర్మాణ దశలో ఉన్న ఇళ్లపై పడింది. కొండ శిథిలాలను భారీ వాహనాల్లో లేఔట్‌లోని ఇళ్ల మధ్యగానే తరలిస్తుండటంతో వాహనాల రాకపోకల ధాటికి ఇళ్ల గోడలు దెబ్బతింటున్నాయని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇప్పటికే పలు ఇళ్ల గోడలకు బీటలు పడటంతో వారంతా ఏం చేయాలో తెలియక అధికారులకు తమ గోడు తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. గ్రామంలోని జగనన్న కాలనీలో పేదల ఇళ్లు బీటలు వారుతున్నాయని గ్రామానికి చెందిన వైకాపా నాయకులు ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మంగళవారం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ విషయమై వాస్తవ పరిస్థితిని తనకు తెలియజేయాలని ఎమ్మెల్యే వంశీ.. తహసీల్దార్‌ సాయి శ్రీనివాస్‌ని ఆదేశించినట్లు సమాచారం.

ఈ లేఔట్‌లో నివేశన స్థలాలు కేటాయించిన ఏడాదిన్నర తర్వాత లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను మొదలు పెట్టారు. పది ఇళ్లు శ్ల్లాబు దశలో ఉండగా.. మిగిలిన ఇళ్లు పిల్లర్లు, గోడలు, పునాదుల దశలో ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న ఇళ్లు సైతం గుబ్బలగుట్టలో ఇష్టారీతిన జరుగుతున్న బాంబు పేలుళ్ల ధాటికి, కొండరాళ్లు, మట్టి తరలించే భారీ వాహనాల దెబ్బకు బీటలు వారుతుండటంతో ఇంకా ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టాల్సిన లబ్ధిదారులు ఇళ్లను నిర్మించుకునేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణానికి అడ్డంకులు లేకుండా చూడాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని