logo

ధాన్యం కొనండి మహాప్రభో అంటూ రైతుల ఆందోళన

ధాన్యం కొనండి మహాప్రభో అంటూ కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో మంగళవారం రాత్రి అన్నదాతలు ఆందోళనకు దిగారు.

Published : 07 Dec 2022 03:36 IST

వెంకటాపురం ఆర్‌బీకే వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు

వెంకటాపురం(మోపిదేవి), న్యూస్‌టుడే: ధాన్యం కొనండి మహాప్రభో అంటూ కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో మంగళవారం రాత్రి అన్నదాతలు ఆందోళనకు దిగారు. 10 రోజులుగా ఆర్‌బీకే వద్దకు తిరుగుతున్నా నిబంధనలకు లోబడి తేమశాతం లేదని తిరస్కరిస్తూ తమ సహనాన్ని పరీక్షిస్తున్నారంటూ రైతులు మండిపడ్డారు. మోపిదేవి మండల పరిధిలోని వెంకటాపురం ఆర్‌బీకే వద్ద మంగళవారం రైతులు మూకుమ్మడిగా వచ్చి అధికారులను నిలదీశారు. వాతావరణ హెచ్చరికలతో గుండెల్లో రాయిపడుతోందని, చేతికొచ్చిన పంట అమ్ముకునే హక్కు మాకు లేదా అంటూ ప్రశ్నించారు. 10 రోజులుగా ఎండబెట్టిన ధాన్యంలో తేమశాతం ఇంకా ఉందంటూ కొనకుండా తిరస్కరించడంపై ఆగ్రహం వెలిబుచ్చారు. రోజుకో నిబంధనతో ధాన్యం కొనుగోళ్లలో తాత్సారం చేయడాన్ని దుయ్యబట్టారు. మూడేళ్లుగా ఆర్‌బీకేలంటూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను కష్టాల పాల్జేస్తోందన్నారు. తేమశాతం సడలించాలని కోరారు. రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతుల గుండెల్లో పిడుగు పడుతోందని, తక్షణం ధాన్యం కొనుగోళ్లకు ప్రజాప్రతినిధులు ఆదేశించకపోవటం సిగ్గుచేటన్నారు. మరోవైపు సంచుల కొరత వేధిస్తోందన్నారు. 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిల్లులకు ధాన్యం తరలించాల్సి వస్తుందంటూ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ నవీన్‌కుమార్‌ ఆర్‌బీకే వద్దకు వచ్చి రైతులు వ్యక్తం చేసిన సందేహాలను నివృత్తి చేశారు.

ఆర్‌బీకే వద్ద ఎండబెట్టిన ధాన్యం

క్రమ సంఖ్య ఆధారంగా ఖరీదు చేస్తాం

- నవీన్‌కుమార్‌, మోపిదేవి తహసీల్దారు

రైతులు నూర్పిడి చేసిన ధాన్యం శ్యాంపిల్స్‌ ఆర్‌బీకే వద్దకు తీసుకొచ్చి తేమశాతం నిర్ధారణ అయిన అనంతరం వారి క్రమ సంఖ్య ఆధారంగా ఖరీదు చేస్తాం. రైతులు అధైర్యపడొద్దు.


ఆర్బీకేల పనితీరు దారుణం : బుద్ధప్రసాద్‌

అవనిగడ్డ, న్యూస్‌టుడే: రైతుల సంక్షేమం అంటూ వైకాపా ప్రభుత్వం ఆర్బాటంగా ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాల పనితీరుతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి ఆయన స్థానిక కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా మోపిదేవి మండలంతోపాటు ఇటీవలి పామర్రు, పమిడిముక్కల మండలాల్లో రైతులు రోడ్డెక్కిన సంఘటనలు చూస్తుంటే రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయన్నారు. మోపిదేవి మండలం వెంకటాపురంలో రైతులు పండించిన ధాన్యం అమ్ముకోవడానికి ఆర్బీకేల చుట్టూ పది రోజులుగా తిరుగుతున్నా వారి గోడు పట్టించుకునే నాథుడే లేకపోవడం దారుణమన్నారు. రైతులు మంగళవారం ఆర్బీకే వద్ద ఆందోళన చేయాల్సరావడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఒకపక్క వాతావరణం బాగుండక ఆరబోసిన ధాన్యం తడిచిపోతున్నాయని ఆందోళన చెందుతున్న తరుణంలో ఆర్బీకే సిబ్బంది తేమ శాతం అంచనా కట్టలేకపోవడం బాధాకరమన్నారు. రైతులే మిల్లులకు ధాన్యం తోలుకోవాలని చెప్పడం వారిలోని బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా పేర్కొన్నారు. ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పారు. రైతులకు ఇబ్బంది కలిగితే వారి పక్షాన పోరాటం చేయాల్సి ఉంటుందన్నారు.

Read latest Amaravati krishna News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు