logo

లక్ష్య సాధనలో వెనుకపడితే చర్యలు: కలెక్టర్‌

ప్రభుత్వ ప్రాధాన్య అంశాల లక్ష్య సాధనలో వెనుకపడితే చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ రంజిత్‌బాషా హెచ్చరించారు.

Published : 07 Dec 2022 03:36 IST

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: ప్రభుత్వ ప్రాధాన్య అంశాల లక్ష్య సాధనలో వెనుకపడితే చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ రంజిత్‌బాషా హెచ్చరించారు. కలెక్టరేట్‌ నుంచి మంగళవారం ఆయన ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఇంజినీరింగ్‌ అధికారులతో వీసీ నిర్వహించారు. భవన నిర్మాణాలు, గృహ నిర్మాణాలపై సమీక్షించారు. ఈనెల 25వ తేదీ నాటికి అన్ని లేఔట్లలో అంతర్గత, అప్రోచ్‌, లెవెలింగ్‌ పనులు పూర్తి చేయాలన్నారు. పురపాలక సంఘాలు, పంచాయతీ అధికారుల సహకారంతో తాగునీరు, విద్యుత్తు తదితర వసతులు కల్పించాలని సూచించారు. జిల్లాలో మొత్తం 94 వేల గృహాలు నిర్మించాల్సి ఉండగా... కేవలం 7 వేలు మాత్రమే పూర్తి కావడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. లబ్ధిదారులకు రుణ మంజూరు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. అప్రోచ్‌ రహదారుల పరంగా ఆరు నెలల నుంచి పురోగతి చూపని బంటుమిల్లి, పెదపారుపూడి ఇంజినీరింగ్‌ అధికారులను సస్పెండ్‌ చేయాలని ఆదేశించారు. ఇంజినీరింగ్‌ అధికారుల పనితీరుపై పర్యవేక్షణ లోపించిందని హెచ్చరిస్తూ చర్యలు తీసుకోవాలని పీఆర్‌ ఎస్‌ఈ, ఈఈలకు సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్య భవనాల నిర్మాణాల విషయంలో వెనుకపడిన గన్నవరం, పామర్రు ఎంపీడీవోలకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన పనుల్లో ఒక్కటీ ప్రారంభించని పమిడిముక్కల మండల అధికారుల వివరణ కోరారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, హౌసింగ్‌ ఇన్‌ఛార్జి పీడీ జీవీ సూర్యనారాయణ, పీఆర్‌ ఎస్‌ఈ ఈరాస్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని