logo

బీసీలను అణగదొక్కిన వైకాపాకు మూల్యం తప్పదు

వైకాపా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బీసీ వర్గాల సాధికారతను అణగదొక్కుతోందని.. అందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదని తెదేపా నాయకులు హెచ్చరించారు.

Published : 08 Dec 2022 05:07 IST

కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బీసీ వర్గాల సాధికారతను అణగదొక్కుతోందని.. అందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదని తెదేపా నాయకులు హెచ్చరించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న బీసీ వ్యతిరేక, అణచివేత వైఖరిని ఖండిస్తూ తెదేపా ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ రూ.34వేల కోట్ల బీసీ నిధులను దారిమళ్లించిన బీసీ ద్రోహి జగన్‌మోహన్‌రెడ్డి అని విమర్శించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో అమలు చేసిన దాదాపు 100 సంక్షేమ పథకాలను రద్దు చేశారన్నారు. స్థానిక సంస్థలో రిజర్వేషన్లలో 10 శాతం కోత వేసి 16వేలకు పైగా రాజ్యాంగబద్ధ పదవులకు బీసీలను దూరం చేశారని, జీవో నెం.217 ద్వారా మత్స్యకారుల జీవనోపాధిని తీవ్రంగా దెబ్బతీశారని ఆరోపించారు. తెదేపాకు బీసీలు అండగా ఉండటాన్ని జీర్ణించుకోలేని వైకాపా నాయకులు వారిపై కక్షపూరిత చర్యలు తెగబడుతున్నారని మండిపడ్డారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మోసపూరిత వైకాపా ప్రభుత్వానికి తగురీతిన బుద్ధిచెప్పేందుకు బీసీలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ బీసీ వర్గాల కళ్లు కప్పేందుకు నిధులు, విధులు లేని 50కు పైగా కార్పొరేషన్లు పెట్టడం సిగ్గుచేటన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి పులి చర్మం కప్పుకున్న పిల్లి అంటూ ఎద్దేవా చేశారు. పెనమలూరు, గుడివాడ, పెడన, పామర్రు నియోజకవర్గాల తెదేపా ఇన్‌ఛార్జులు బోడే ప్రసాద్‌, రావి వెంకటేశ్వరరావు, కాగిత కృష్ణప్రసాద్‌, వర్ల కుమార్‌రాజా మాట్లాడుతూ  జగన్‌ అసత్యహామీలు, మోసపూరిత చర్యలతో అన్ని వర్గాలు అణగారిపోతున్నాయన్నారు. తెదేపా బీసీ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి, బీసీ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ బొడ్డు వేణుగోపాలరావు, బీసీ సెల్‌ కార్యనిర్వాహక కార్యదర్శి శివయ్య, పార్టీ సీనియర్‌ నాయకులు ఆళ్ల వెంకటగోపాలకృష్ణారావు, గొర్రెపాటి గోపిచంద్‌, గోపు సత్యనారాయణ, కుర్రా నరేంద్ర, మండలి వెంకట్రామ్‌, బత్తిన దాస్‌, తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం పార్టీ నాయకులు తమ డిమాండ్‌లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌ రంజిత్‌బాషాకు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని