logo

మహా అవస్థలు

విజయవాడ నడిబొడ్డున వైకాపా నిర్వహించిన జయహో బీసీ సభ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Published : 08 Dec 2022 05:07 IST

ట్రాఫిక్‌ చక్రబంధంలో ప్రజలు

సీఎం ప్రసంగించే సమయంలో బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్న

మరికొందరిని నిలువరిస్తున్న పోలీసులు

ఈనాడు, అమరావతి: విజయవాడ నడిబొడ్డున వైకాపా నిర్వహించిన జయహో బీసీ సభ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ కార్యక్రమానికి శివార్లలో కాకుండా రద్దీగా ఉండే బందరురోడ్డులోని ఇందిరాగాంధీ స్టేడియాన్ని వేదికగా ఎంచుకోవడంతోనే జనాల కష్టాలు మొదలయ్యాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వేల సంఖ్యలో జనాలను ఇక్కడికి తరలించారు. దీనికోసం స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. పోలీసులు అత్యుత్సాహానికి పోయి పలురోడ్లను మూసేయడంతో పాటు ప్రజారవాణాను అనుమతించలేదు. దీనివల్ల నగరవాసులు నిత్యం ఉండే ట్రాఫిక్‌ జామ్‌ల కంటే రెట్టింపు కష్టాలు చవిచూశారు.

విజయవాడలో సీఎం సభాస్థలి వెనుకభాగంలో భోజనాల కోసం తోపులాట

దూరం పెరిగి కష్టాలు.. సభ కోసం జాతీయరహదారిని స్తంభింపజేయడంతో అవస్థలు అన్నీ ఇన్నీ కావు. బుధవారం తెల్లవారుజాము నుంచే అన్నివైపులా మళ్లించారు. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. చెన్నై-కోల్‌కతా జాతీయరహదారిపై హనుమాన్‌ జంక్షన్‌ నుంచి గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, రేపల్లె, చీరాల, ఒంగోలు మార్గంలో మళ్లించారు. హైదరాబాద్‌-విశాఖపట్నం మార్గంలోనూ ఇలాగే మళ్లింపులతో ఇబ్బందులు పడ్డారు. గుంటూరు నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలను చుట్టుతిప్పి పంపించారు.

సీఎం సభ జరుగుతుండగానే వెళ్లిపోతున్న కార్యకర్తలు

నగరంలోనూ ఇంతే.. నగంలో ట్రాఫిక్‌ కష్టాలు ఉదయం 7.30 నుంచే కనిపించాయి. సభ పూర్తయిన రెండుగంటల వరకూ ఇక్కట్లు తప్పలేదు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు 2వేలకు పైగా వచ్చాయి. వీటితోపాటు నాయకులు, కార్యకర్తలు 2వేల వ్యక్తిగత వాహనాల్లో తరలివచ్చారు. దీంతో పార్కింగ్‌ ప్రదేశాలు నిండిపోయాయి. దీంతో బస్సుడ్రైవర్లు చేసేది లేక బస్‌స్టేషన్‌లోకి తీసుకెళ్లి నిలిపారు. ఉదయం 8 గంటల సమయంలో మహానాడు కూడలి, బెంజిసర్కిల్‌, రమేష్‌ ఆస్పత్రి కూడలి, రామవరప్పాడు రింగ్‌లో విపరీతమైన రద్దీ కనిపించింది. ట్రాఫిక్‌ నిషేధాజ్ఞల కారణంగా వాహనాలను అనుమతించకపోవడంతో చాలామంది విద్యాసంస్థలు, కార్యాలయాలకు కాలినడకన వెళ్లాల్సి వచ్చింది.

బిషప్‌ అజరయ్య పాఠశాల వద్ద దారిలేక ఆగిపోయిన అంబులెన్స్‌

ప్రజారవాణా లేక.. బందరు రోడ్డు, ఐదో నెంబరు మార్గంలో సిటీబస్సుల రాకపోకలను నిషేధించారు. దాంతో ప్రయాణికులు చాలా దూరం నడిచి వెళ్లి, ఇతర పాయింట్లలో ఎక్కారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు రోడ్లపైకి వచ్చినవారు నరకయాతన పడ్డారు. సభకు వచ్చే వాహనాల కోసం చాలా అంతర్గత రోడ్లను మూసేశారు. చుట్టుగుంట, సీతారాంపురం రోడ్లపై ప్రజలు రాకుండా బ్యారికేడ్లను అడ్డుపెట్టారు. మొగల్రాజపురం వైపు వెళ్లేవారూ కష్టాలు పడ్డారు. నక్కలరోడ్డులోని ఆసుపత్రులకు వెళ్లేవారు చాలా అవస్థలు పడ్డారు.

పూర్తయిన తర్వాతా.. సభ పూర్తి అయి తిరిగి వెళ్లే సమయంలోనూ ఒకేసారి బస్సులు, వాహనాలు బయలుదేరడంతో నగరంలో మళ్లీ ట్రాఫిక్‌ కష్టాలు తప్పలేదు. బెంజి సర్కిల్‌, మహానాడు, రామవరప్పాడు, ఎనికేపాడు మొదలు నిడమానూరు జంక్షన్ల వరకు వాహనాలు పెద్దసంఖ్యలో నిలిచిపోయాయి. సాయంత్రం నగరంలోకి భారీ వాహనాలను అనుమతించే సమయంలో గన్నవరం వద్ద దాదాపు మూడు కి.మీ. మేర బండ్లు ఆగాయి. సర్వీసురోడ్లపై ఉన్న వాహనాలు అన్నీ ఒకేసారి జాతీయరహదారిపైకి రావడంతో ఈ పరిస్థితి నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు