logo

బీఈడీ ప్రవేశాలపై సందిగ్ధం

‘కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ కళాశాలల్లో ఈ ఏడాది ప్రవేశాలకు సంబంధించి ప్రతిష్ఠంభన నెలకొంది.

Published : 08 Dec 2022 05:07 IST

పునఃపరిశీలన విషయంలో తీవ్ర జాప్యం

కృష్ణా వర్సిటీ, విద్యా సంస్థల మధ్య కుదరని సయోధ్య

ఈనాడు, అమరావతి

‘కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ కళాశాలల్లో ఈ ఏడాది ప్రవేశాలకు సంబంధించి ప్రతిష్ఠంభన నెలకొంది. అన్ని బీఈడీ కళాశాలల్లోని వసతులు, విద్యార్థులు, సిబ్బంది పరిస్థితిని స్వయంగా పునఃపరిశీలించిన తర్వాతే ప్రవేశాలకు వెళ్లాలనే ధోరణిలో విశ్వవిద్యాలయం ఉంది. కానీ.. ఈ ప్రక్రియ వేగవంతంగా జరగడం లేదు. ఉన్నత విద్యామండలి తీరు కూడా ఇలాగే ఉండడంతో డిసెంబర్‌ 07 నుంచి ఆరంభమవ్వాల్సిన తరగతులు.. జనవరిలోనైనా అవుతాయో లేదో అనే అనుమానం ప్రస్తుతం నెలకొంది. దీనికితోడు బీఈడీ కళాశాలల యాజమాన్యాలు, కృష్ణా వర్సిటీ మధ్య పలు విషయాల్లో సయోధ్య కుదరడం లేదు. ప్రధానంగా కళాశాలల్లోని విద్యార్థుల సంఖ్య, స్టాఫ్‌ అప్రూవల్‌, డిసెంబర్‌ నుంచి అమలు చేయాల్సిన ఫేస్‌ రికగ్నేషన్‌ ఈ మూడు విషయాలపై సందిగ్ధం నెలకొంది. తాజాగా విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల యాజమాన్యాలన్నీ దీనిపై సమావేశమయ్యారు. ఉన్నత విద్యామండలి, కృష్ణా వర్శిటీ, కళాశాలల యాజమాన్యాల తీరుతో.. విద్యాసంవత్సరాన్ని కోల్పోయే ప్రమాదం కనిపిస్తోందని విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.’

కృష్ణా వర్సిటీ పరిధిలోని అన్ని బీఈడీ కళాశాలల్లో మూడు నెలల కిందటే ఇన్‌స్పెక్షన్‌ జరిగింది. కానీ.. ఇన్‌స్పెక్షన్‌ బృందాలు సక్రమంగా పరిశీలించకుండానే పచ్చజెండా ఊపేశారు. ఒక్కో కళాశాల నుంచి రూ.25 వేల వరకూ తీసుకుని.. వ్యవహారం కానిచ్చేశారనే ఆరోపణలున్నాయి.  విశ్వవిద్యాలయం నుంచి అన్ని కళాశాలలకు ఇప్పటికే మరోసారి పరిశీలనకు వస్తామనే సమాచారం కూడా ఇచ్చారు. కానీ.. అనుకున్నంత వేగంగా కళాశాలల్లో పరిశీలన జరగడం లేదు. కేవలం కొన్ని కళాశాలలకే బృందాలు వచ్చి వెళ్లాయని సమాచారం. దీనిపై విశ్వవిద్యాలయం ఎలాంటి సమాచారం బయటకు చెప్పడం లేదు. ఈసారి ఆకస్మికంగా పరిశీలనకు బృందాలను పంపుతున్నట్టు తెలుస్తోంది. విజయవాడ పరిధిలోని మూడు ప్రధాన బీఈడీ కళాశాలలకూ వర్సిటీ బృందాలు ఇంకా రాలేదు. దీంతో ఈ పునఃపరిశీలన ఎప్పటికి పూర్తి చేస్తారనేది విశ్వవిద్యాలయం అధికారులకే తెలియాలి.

ఒకరికే మూడేసి కళాశాలల్లో..

కృష్ణా వర్సిటీ పరిధిలో 22 బీఈడీ కళాశాలలుండగా.. ఏటా వెయ్యి మందికి పైగా కొత్తగా చేరుతుంటారు. వీరిలో చాలావరకూ విద్యార్థులు కళాశాల ముఖం చూడకుండానే కోర్సును పూర్తిచేస్తున్నారు. వీరికి ప్రవేశాలు కల్పించినప్పుడే కళాశాలల యాజమాన్యాలు ఈమేరకు హామీ ఇస్తున్నాయి. పైగా కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులు కూడా రిజిస్టర్లలోనే ఉంటారు. కొంతమంది అధ్యాపకుల పేర్లు రెండు మూడు కళాశాలల్లో కనిపిస్తుంటాయి. ఇలా.. ఒక్కో లెక్చరర్‌ కనీసం మూడు కళాశాలల్లో స్టాఫ్‌ అప్రూవల్‌ చేసుకుని ఉండడం విచిత్రం. ఇలా ఒకరినే మూడేసి కళాశాలలకు సంబంధించి స్టాఫ్‌ అప్రూవల్‌ ఎలా చేశారనేది విశ్వవిద్యాలయానికే తెలియాలి.


మేనేజ్‌మెంట్‌ కోటాలో హామీలతో ప్రవేశాలు..

కళాశాలల్లో ఫేస్‌ రికగ్నేషన్‌ను ఖచ్చితంగా అమలు చేయించాలని కృష్ణా వర్సిటీ భావిస్తోంది. దీనికి సంబంధించి కళాశాలల్లో ఇప్పటివరకూ ఎలాంటి ఏర్పాట్లు చేసుకోలేదు. దీనితో పాటు కళాశాలల్లో లేని సిబ్బందిని ఉన్నట్టు చూపించడంపైనా విశ్వవిద్యాలయం దృష్టిసారించింది. ఈ రెండు విషయాలపై స్పష్టత వచ్చాకే.. ప్రవేశాలు కల్పించడం, తరగతులు ఆరంభించడం చేయాలనే ఆలోచనలో ఉంది. కానీ.. ఈ విషయంలో వేగవంతమైన చర్యలు చేపట్టకపోవడంతో విద్యార్థులకు జాప్యం జరుగుతోంది. పక్కనే ఉన్న నాగార్జున విశ్వవిద్యాలయంలో రెండేళ్ల కోర్సు ఒకే ఏడాదిలో పూర్తయ్యేలా వేగంగా చేసున్నారు. అక్కడ 2022 జున్‌, జులైలో ఆరంభమైన ఎంఈడీ వాళ్లు వచ్చే ఏడాది జనవరికి మూడో సెమిస్టర్‌ పూర్తిచేసేందుకు నోటిఫికేషన్‌ ఇచ్చేశారు. ఒక ఏడాది పోవడంతో దానిని భర్తీ చేసేందుకు ఇలా చేస్తున్నారు. కానీ.. కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలో ఈ వేగం కనిపించడం లేదు. పైగా.. బీఈడీ కళాశాలలకు సంబంధించిన అకడమిక్‌ క్యాలెండర్‌ను సక్రమంగా నిర్వహించే పద్ధతి కూడా లేదు. దీంతో పరిస్థితి అస్తవ్యస్తంగా మారుతోంది. ఎన్నో ఏళ్లుగా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే కళాశాలల్లో ఈ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మేనేజ్‌మెంట్‌ కోటాకు సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని కళాశాలలు విద్యార్థులకు ముందస్తు హామీలను ఇచ్చేసి ప్రవేశాలు కల్పించుకుంటున్నట్టు తెలుస్తోంది. వీరు కళాశాలకు రావాల్సిన పనిలేదనే హామీతోనే చేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఫేస్‌ రికగ్నేషన్‌ను పెడితే.. వీరు ఖచ్చితంగా కళాశాలకు రావాలి. అది కుదరని పని. అందుకే.. మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు ఈ నూతన హాజరు విధానం వద్దనే వాదనను కొన్ని కళాశాలల యాజమాన్యాలు వినిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు