logo

ఆసరా అందరికీ అందేనా?

ఆసరా పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మూడో విడత సాయాన్ని వచ్చే నెల జనవరిలో ఇవ్వనుంది. ఇందులో భాగంగా.. జిల్లా అధికారులు కార్యాచరణ చేపట్టారు.

Updated : 08 Dec 2022 05:30 IST

సాంకేతిక సమస్యలతో సతమతం

బయోమెట్రిక్‌ కోసం అవస్థలు

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

ఆసరా పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మూడో విడత సాయాన్ని వచ్చే నెల జనవరిలో ఇవ్వనుంది. ఇందులో భాగంగా.. జిల్లా అధికారులు కార్యాచరణ చేపట్టారు. సాయం అందించే క్రమంలో సభ్యుల నుంచి తీసుకునే బయోమెట్రిక్‌ ప్రక్రియలో సాంకేతిక సమస్యలతో స్వయం సహాయక సంఘాల మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకు ఖాతా సమస్యలు, గతంలో చాలా సంఘాలకు ఆసరా మంజూరు కాకపోవడం.. వంటి వివిధ రకాల సమస్యలతో మహిళలు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. పరిష్కారం కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

26,332 సంఘాలు..  2,61,383 సభ్యులు

వైఎస్సార్‌ ఆసరా పథకంలో భాగంగా 2019, ఏప్రిల్‌ 11 నాటికి డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలను నాలుగు విడతల్లో మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పటి వరకు రెండు విడతలు జమ చేసింది. నిర్ధేశించిన సమయం నాటికి ఉమ్మడి జిల్లాలో డీఆర్‌డీఏ, మెప్మా ఆధ్వర్యంలోని 73వేలకు పైగా సంఘాల పరిధిలో వివిధ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న సభ్యులందరికీ ఈ పథకం ద్వారా రుణమాఫీ సాయం అందించాల్సి ఉంది. అలా గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలో మొత్తం  రూ.2,067కోట్ల రుణాలకు గానూ రెండు విడతలుగా ఒక్కో విడతకు దాదాపు రూ.516 కోట్లు, మెప్మా ఆధ్వర్యంలో రూ.583.17కోట్లకు గానూ రూ.145.86 కోట్లు ఖాతాల్లో జమ చేశారు. ఈ ఏడాది అందించే మూడో విడత అంతే మొత్తం జమకావాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లాల విభజన నేపథ్యంలో కృష్ణా జిల్లాలో 26,332 సంఘాల పరిధిలోని 2,61,383మంది సభ్యులకు ఆసరా విడుదల కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అందించే పింఛను దగ్గర నుంచి  ఆయా పథకాల ద్వారా లబ్ధిపొందే ప్రతి ఒక్కరి నుంచీ వేలిముద్రలు సేకరిస్తున్న విషయం తెలిసిందే. ఆసరా పథకంలోనూ ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేశారు. సంఘాల్లోని సభ్యుల వారీగా వివరాలు సేకరిస్తున్నారు.

సమస్యలతో  ఆందోళన

ప్రస్తుతం గ్రామాల వారీగా సభ్యుల బయోమెట్రిక్‌ తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియ 15వ తేదీతో ముగియనుంది. ఈ లోపే లక్ష్యాన్ని పూర్తి చేయాల్సి ఉంది. బయోమెట్రిక్‌ తీసుకునే క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక సమస్యలతోపాటు సిగ్నల్స్‌ అందక సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ఆటోలు, ఇతర వాహనాల ద్వారా పక్క గ్రామాలకు వెళ్లి వేలిముద్రల వేయాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 77శాతం పూర్తయినట్లు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. పెనమలూరు, బందరు, పమిడిముక్కల, అవనిగడ్డ మండలాల్లో ఇంకా 70శాతంలోపే బయోమెట్రిక్‌ పూర్తయ్యింది. మిగిలిన మండలాలు 70 నుంచి 80శాతంలో నమోదైంది. సభ్యుల ఆధార్‌ సంఖ్యలు, బ్యాంకుఖాతాల ఐఎఫ్‌ఎస్‌సీ సంఖ్యలు మారడం లాంటి సమస్యలు ఉన్నాయి. ఇప్పటికే వీటిని సంఘాల ద్వారా అధికారులకు నివేదించారు. కానీ పరిష్కారం కాలేదని మహిళలు వాపోతున్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కొన్ని సంఘాలకు వివిధ కారణాలతో రెండ విడతలూ ఆసరా సాయం జమ కాలేదు. ఈసారైనా అందుతుందో లేదొనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

త్వరితగతిన ప్రక్రియ పూర్తి

ఆసరా పథకం రెండో విడత అమల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారుల వివరాల సేకరణతోపాటు బయోమెట్రిక్‌ తీసుకుంటున్నాం. బయోమెట్రిక్‌ నమోదులో తలెత్తే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. వివిధ కారణాలతో ఇప్పటివరకు ఆసరా సాయం జమకాని సంఘాలు జిల్లాలో 8వరకు ఉన్నట్లు గుర్తించాం. వాటి వివరాలు సేకరించి 15వ తేదీలోపే ప్రభుత్వానికి నివేదిస్తాం. బ్యాంకుఖాతాలు, ఆధార్‌ సంఖ్యలో దొర్లిన తప్పులను లబ్ధిదారుల నుంచి వివరాల సేకరించి, మార్గదర్శకాలకు అనుగుణంగా మార్పు చేస్తున్నాం. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాం.- ప్రసాదు, డీఆర్‌డీఏ పీడీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని