logo

యువ ఇంజినీరుకు ప్రాణభిక్ష

ప్రాణాపాయ స్థితిలో వచ్చిన యువ ఇంజినీరుకు గుంటూరు సర్వజనాసుపత్రి న్యూరాలజీ వైద్యులు ప్రాణభిక్ష పెట్టారు. దీనికి కృతజ్ఞతగా ఆ యువ ఇంజినీరు ఆ విభాగం అభివృద్ధికి రూ.50 వేలు విరాళం అందజేశారు.

Published : 08 Dec 2022 05:07 IST

న్యూరాలజీ విభాగాధిపతి ఆచార్య సుందరాచారికి నగదు అందజేస్తున్న యశ్వంత్‌

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: ప్రాణాపాయ స్థితిలో వచ్చిన యువ ఇంజినీరుకు గుంటూరు సర్వజనాసుపత్రి న్యూరాలజీ వైద్యులు ప్రాణభిక్ష పెట్టారు. దీనికి కృతజ్ఞతగా ఆ యువ ఇంజినీరు ఆ విభాగం అభివృద్ధికి రూ.50 వేలు విరాళం అందజేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన చెరుకూరి యువ ఇంజినీర్‌ యశ్వంత్‌ గత అక్టోబరు 10న రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే విజయవాడలోని కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ఐదు రోజులు గడిచినప్పటికీ కోమాలోనే ఉన్నాడు. దీంతో తల్లిదండ్రులు తమ బిడ్డ బతుకుతాడో? లేదో? అంటూ భయపడిపోయారు. అదే సమయంలో గుంటూరు న్యూరాలజీ విభాగంలో మెరుగైన చికిత్స అందుతుందని బంధువులు తెలియజేయడంతో హుటాహుటిన అదేనెల 15వ తేదీన జీజీహెచ్‌ న్యూరాలజీ విభాగానికి తరలించారు. వెంటిలేటర్‌ సాయంతో కృత్రిమ శ్వాస అందిస్తున్న అతన్ని ఐసీయూలో చేర్చుకుని వైద్య సేవలు ప్రారంభించారు. మెదడులో రక్తస్రావం జరిగినందున కీలక భాగాలు ప్రభావితమైనట్లు గుర్తించారు. వీటికి ఏపాటి నష్టం జరిగినా ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. సర్జరీ చేసేందుకు అవకాశం లేదు. దీంతో ఆధునిక వైద్యరంగంలో అందుబాటులో ఉన్న ఔషధాలను వినియోగించి చికిత్స అందించారు. నెల రోజులు ఆసుపత్రిలోనే చికిత్స పొందిన అనంతరం కోలుకున్నాడు.

నడుస్తానని ఊహించలేదు

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో ప్రాణాలతో బయటపడతానని ఎవరూ ఊహించలేదని యశ్వంత్‌ తెలిపారు. న్యూరాలజీ విభాగంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ తాను ఈ విధంగా నడిచి వచ్చానంటే న్యూరాలజీ విభాగం వైద్యులు పెట్టిన ప్రాణభిక్షగానే భావిస్తున్నానని తెలిపారు. నోటి మాట లేదు, శ్వాస తీసుకోవడమే కష్టంగా ఉండేది, ఆసుపత్రిలో ఆచేతనంగా పడక మీద పడి ఉన్న తనను గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించడంతో ప్రాణాలతో బయట పడ్డానన్నారు. ఆ విభాగం అధిపతి ఆచార్య సుందరాచారి నేతృత్వంలో అక్కడి వైద్యులు, విద్యార్థి వైద్యులు 24 గంటలూ కంటికి రెప్పలా కాపాడన్నారు. తమ కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ ఇస్తూ వారిలోనూ భరోసా కల్పించారన్నారు. కార్పొరేట్‌ రంగంలో లక్షల రూపాయల ఖర్చు చేసినా ఫలితం ఎలా ఉండేదో తనకు తెలియదన్నారు. జీజీహెచ్‌లో పైసా ఖర్చు లేకుండా అత్యాధునిక చికిత్స అందించారన్నారు. వారికి తన జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ఆ విభాగం అభివృద్ధికి రూ.50 వేలు తమ వంతు సాయంగా అందించానన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని