logo

భవానీలొస్తారు.. బాగాచూడండి..

ఇంద్రకీలాద్రిపై మరో రెండు రోజుల్లో భవానీ విరమణ దీక్షలు ఆరంభం కానున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భవానీ భక్తులు అమ్మవారి గుడికి తరలిరానున్నారు.

Updated : 09 Dec 2022 06:34 IST

గిరి ప్రదక్షిణ మార్గం చాలా కీలకం
దసరా అనుభవాలను దృష్టిలో ఉంచుకోవాలి
ఈనాడు, అమరావతి

ఇంద్రకీలాద్రిపై మరో రెండు రోజుల్లో భవానీ విరమణ దీక్షలు ఆరంభం కానున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భవానీ భక్తులు అమ్మవారి గుడికి తరలిరానున్నారు. గత రెండేళ్లు కొవిడ్‌ నేపథ్యంలో భవానీ దీక్ష విరమణలపై ఆంక్షలు విధించారు. ఈసారి ఐదు రోజుల వేడుకల్లో భవానీలు భారీ సంఖ్యలో దుర్గగుడికి తరలిరానున్నారు. దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడంపై అధికారులు దృష్టిసారంచాలి. రెండు నెలల కిందట జరిగిన దసరా ఉత్సవాలలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలి.

దుర్గగుడిలో డిసెంబర్‌ 15 నుంచి 19వరకు భవానీ విరమణ దీక్షలు జరగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రోజుకు కనీసం లక్షన్నర మంది వరకూ భవానీలు తరలిరానున్నారు. ఏటా మొదటి రెండు రోజులు భవానీల సంఖ్య కొద్దిగా తక్కువ ఉంటుంది. చివరి మూడు రోజులు భారీగా తరలివస్తారు. దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలి. ఇటీవల జరిగిన దసరా ఉత్సవాల తర్వాతే వరుసగా ఐదు రోజులు భవానీ భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఈ నేపథ్యంలో భవానీదీక్షలకు మరింత భారీగా తరలిరానున్నారని అధికారులు సైతం అంచనా వేస్తున్నారు. ఉత్సవాలలో కీలకమైన హోమగుండం, ఇరుముడి పాయింట్లు, కొబ్బరికాయలు కొట్టే కేంద్రాల విషయంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఈ ఏడాది దసరా ఉత్సవాల తర్వాత వచ్చిన లక్షల మంది భవానీల కోసం కనీస ఏర్పాట్లు కూడా చేయకపోవడంతో వారంతా తీవ్ర అసహనంతో వెళ్లారు. ఇరుముడి బియ్యం కూడా రహదారుల పక్కనే పడేసి వెళ్లిపోయారు. ఇలాంటివి పునరావృతం కాకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాల్సి ఉంది.

ఆరు కిలోమీటర్లు చుట్టి వస్తారు..

భవానీ విరమణ దీక్షల్లో గిరి ప్రదక్షిణే కీలకం. గిరి ప్రదర్శన కోసం మధ్యలో ఎక్కడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇంద్రకీలాద్రి చుట్టూ ఆరు కిలోమీటర్ల ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. భక్తులు రాగానే తొలుత ఘాట్‌లో స్నానాలు చేసి గిరి ప్రదర్శన ఆరంభిస్తారు. ప్రకాశం బ్యారేజీ మీదుగా దుర్గగుడి ఘాట్‌రోడ్డు ముందు నుంచి గిరి ప్రదర్శన ఆరంభించి కుమ్మరిపాలెం చౌరస్తా మీదుగా పాలఫ్యాక్టరీ నుంచి తిరిగి బ్రాహ్మణ వీధి, వినాయక ఆలయం వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి క్యూలైన్లలోనికి ప్రవేశించి అమ్మవారి దర్శనానికి వెళతారు. గిరి ప్రదర్శన చేసే ఆరు కిలోమీటర్ల మార్గంలో ప్రస్తుతం చాలాచోట్ల ఆటంకాలున్నాయి. రహదారిపై గుంతలు లాంటివి లేకుండా నగరపాలక సంస్థతో కలిసి పక్కాగా ఏర్పాట్లు చేయాలి. అప్పుడే భవానీ భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా గిరి ప్రదక్షిణ చేసుకుని వచ్చేందుకు అవకాశం ఉంటుంది. భవానీ భక్తులు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక సుదూర ప్రాంతాల నుంచి దుర్గగుడికి చేరుకుంటారు. రోజుకు ఒక్కపూటే ఆహారం తీసుకుంటారు. వారికి తప్పనిసరిగా దుర్గగుడిలో అన్నదానం ఏర్పాటు చేయాలి. ఈ ఏడాది దసరా వేడుల్లో మాదిరిగా భక్తులకు ఉచిత ప్రసాదాలను పంపిణీ చేస్తే భవానీలు అర్థాకలితో వెళ్లే పరిస్థితి ఉంటుంది. గతంలో దసరా, భవానీదీక్ష విరమణ వేడుకల్లో అన్నప్రసాద పంపిణీ నిరంతరాయంగా జరిగేది.

క్యూలైన్లలో ఇబ్బందులు లేకుండా..

ఏటా మాదిరిగానే ఈసారి కూడా వినాయక ఆలయం నుంచి ఘాట్‌రోడ్డు మీదుగా క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. క్యూలైన్లలో భక్తులకు ఇబ్బంది లేకుండా.. చూడాలి. ఘాట్‌లలో షవర్ల ఏర్పాటు, ప్రసాదాల కౌంటర్లు, హోమగుండాలు, ఇరుముడి పాయింట్లు, తాత్కాలిక మరుగుదొడ్లు ఇలాంటివన్నీ పక్కాగా సిద్ధం చేయాలి. భవానీ భక్తులు ఎక్కువ మొత్తంలో ప్రసాదం కొనుగోలు చేసి తీసుకెళ్తారు. గతంలో భవానీదీక్షల సమయంలో ప్రసాదాల కోసం భక్తులు ఆందోళనకు దిగిన సంఘటనలు జరిగాయి. అందుకే ప్రసాదాల తయారీ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొవిడ్‌కు ముందు వరకూ జరిగే భవానీదీక్ష విరమణ వేడుకల్లో ప్రసాదాల డిమాండ్‌ను బట్టి ఎప్పటికప్పుడు సిద్ధం చేసేలా ఏర్పాట్లు చేసేవారు. కనీసం 15లక్షల లడ్డూ ప్రసాదం, పది వేల కిలోల పులిహోర తయారు చేసేవాళ్లు. నిత్యం వచ్చే భక్తుల కోసం రైల్వేస్టేషన్‌, బస్టేషన్‌ నుంచి ఉచిత దేవస్థానం బస్సులను అందుబాటులో ఉంచాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని