logo

గృహప్రవేశ మేళాలు.. ఇళ్లకు తాళాలు!

కృష్ణా జిల్లా బందరు నియోజకవర్గానికి చెందిన 16 వేలమందికి కరగ్రహారంలో నివేశన స్థలాలు ఇచ్చారు. ఇంతవరకు మెరక పనులు పూర్తి కాలేదు.

Updated : 09 Dec 2022 06:38 IST

 జగనన్న కాలనీల్లో మౌలిక వసతులేవీ?

లక్ష్యాలు సాధించాలని ఒత్తిడి

ఈనాడు, అమరావతి

కరగ్రహారంలో నిర్మాణమే జరగలేదు

కృష్ణా జిల్లా బందరు నియోజకవర్గానికి చెందిన 16 వేలమందికి కరగ్రహారంలో నివేశన స్థలాలు ఇచ్చారు. ఇంతవరకు మెరక పనులు పూర్తి కాలేదు. కానీ ఉన్నతాధికారులకు పంపిన కృష్ణా జిల్లాలో ఇళ్ల నిర్మాణ పురోగతిలో నివేదికలో ప్రారంభం కానివి 4,230 అని పేర్కొన్నారు. డిసెంబరు 21న సామూహిక గృహ ప్రవేశాలు చేయాలని ప్రభుత్వం జిల్లాలకు లక్ష్యాలను నిర్దేశించింది. ఇప్పటివరకు జిల్లాలో కేవలం 6,967 పూర్తి అయినట్లు నివేదించారు. ఎన్టీఆర్‌ జిల్లాలో 21 నాటికి 12వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి. ఇప్పటికి 5,026 ఇళ్లే పూర్తి చేసుకున్నాయి. లక్ష్యం సాధించడానికి అధికారులు హైరానా పడుతున్నారు.

గత రెండన్నరేళ్లుగా పూర్తికాని గృహాలను మరో 20 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. సామూహిక గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని, ప్రజాప్రతినిధులతో గృహ ప్రవేశాలను ఆడంబరంగా చేయించాలని ఆదేశాలు అందాయి. ప్రవేశాలు చేసినా.. నివాసం ఉండే పరిస్థితి లేదు. కాలనీల్లో కనీస వసతులు లేవు. విద్యుత్తు, మంచినీరు, డ్రైనేజీ, కనీస రహదారులు లేవు. నిర్మాణం పూర్తి చేసి ఇంటికి తాళం వేసినవారే చాలా మంది ఉన్నారు.  కొన్ని సొంతంగా లబ్ధిదారులు నిర్మాణం చేసుకున్నారు. కొన్ని గుత్తేదారులతో నిర్మాణం చేయిస్తున్నారు. చాలా వరకు తుది దశకు చేరుకున్నాయి. కొంతమంది ప్రభుత్వం ఇచ్చే రాయితీకి అదనంగా సొమ్ములు వేసి నిర్మాణం చేసుకున్నారు. వీటికి ఇప్పటికే తాళాలు వేశారు. రవాణా సౌకర్యం లేదు. విద్యుత్తు సౌకర్యం కల్పించలేదు. అక్కడ ఒక సబ్‌స్టేషన్‌ నిర్మాణం చేయాల్సి ఉంది. బోర్లు వేసినా ట్యాంకులు, కుళాయిలు ఏర్పాటు చేయలేదు. కొండపల్లి లేఔట్‌లోనూ దాదాపు 1200 గృహాలను నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడ విద్యుత్తు లేదు. అదనంగా ట్రాన్స్‌ఫారాలు కావాలని చెబుతున్నారు. ఇబ్రహీంపట్నం లేఔట్‌లోనూ అదే పరిస్థితి. అర్బన్‌ లేఔట్లలో మౌలిక వసతుల కల్పనకు నిధులు అందుబాటులో లేవు. కొన్ని లేఔట్లలో ఆర్‌డబ్ల్యూఎస్‌కు తాగునీటి బోర్లు వేసేందుకు లక్ష్యాలను నిర్దేశించారు. అంతర్గత రహదారులు నరేగా కింద నిర్మాణం చేయాలని సూచించారు. విద్యుత్తు సౌకర్యంపై అధికారులు ఒత్తిడి చేస్తున్నా అసంస్థ ఉలుకూపలుకు లేదు. నగరపాలక సంస్థ నిధులు వెచ్చించాలని సూచించారు. కొన్నింటికి టెండర్లను పిలిచినా గుత్తేదారులు స్పందించడం లేదు. బిల్లులు రావనే ఉద్దేశంతో అసలు టెండర్లనే దాఖలు చేయడం లేదు. దీంతో జగనన్న లేఔట్‌లో నివాసం ఎప్పుడనేది అయోమయంగా ఉంది.

అడ్డంకులు ఎన్నో..!

కేవలం మౌలిక వసతులే కాదు.. ముందుగా నిర్మాణం పూర్తి కావాలంటే లబ్ధిదారులు అదనంగా ఖర్చు భరించాల్సి వస్తోంది. ప్రభుత్వం మంజూరు చేస్తున్న రూ.1.8లక్షలు, డ్వాక్రా రుణం రూ.35వేలు కలిపి రూ.2.15లక్షలు అవుతోంది. ఈ మొత్తంతో ఇంటి నిర్మాణం పూర్తి కావడం లేదు. కొంత మంది గుత్తేదారులు ఈ మొత్తానికి ఫినిషింగ్‌ (ప్లాస్టరింగ్‌, మరుగుదొడ్డి, కిచెన్‌లో సౌకర్యాలు) లేకుండా నిర్మాణం చేస్తున్నారు. ప్లాస్టరింగ్‌ కావాలంటే రూ.2.75లక్షలకు నిర్మాణం చేస్తున్నారు. అదనంగా రూ.60వేల వరకు చేతి నుంచి పడుతున్నాయి. అదనపు వసతులు, మెట్లు ఇతర సౌకర్యాలు కావాలంటే.. రూ.9లక్షల వరకు అడుగుతున్నారు. ఇది ఒక సమస్య అయితే ఇసుక లభ్యం కావడం లేదు. జగనన్న కాలనీలకు గుత్తేదారులు బుసక సరఫరా చేస్తున్నారు. దీంతో కట్టుబడి సాధ్యం కావడం లేదు. మేస్త్రీల కొరత ఉంది. నిర్మాణ కార్మికులు లభించడం లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ లక్ష్యం మేరకు గృహప్రవేశాలు కష్టమేనని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని