logo

చేప పిల్లల మాటున బలప్రదర్శన

పట్టణ పరిధి ఫెర్రీలోని కృష్ణా నదిలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపల విడుదల కార్యక్రమం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ బలప్రదర్శనకు వేదికగా మారింది.

Published : 09 Dec 2022 05:57 IST

మంత్రి, ఎమ్మెల్యేల విభేదాలు బహిర్గతం

ఫెర్రీ వద్ద చేప పిల్లలను వదులుతున్న ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌ తదితరులు

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: పట్టణ పరిధి ఫెర్రీలోని కృష్ణా నదిలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపల విడుదల కార్యక్రమం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ బలప్రదర్శనకు వేదికగా మారింది. కొన్ని రోజులుగా మంత్రి జోగి రమేష్‌, ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌ మధ్య విభేదాలున్నట్లు పలు వేదికలు, సమావేశాల్లో వారి అనుచరులు చేసిన ప్రకటనలు తేటతెల్లం చేసిన విషయం తెలిసిందే. దీనికి ఊతమిచ్చేలా స్వయంగా ఎమ్మెల్యే ఇటీవల తనకు ఇబ్రహీంపట్నంలో కొన్ని ఇబ్బందులు ఉన్నట్లు మీడియా ఎదుట స్పష్టం చేశారు. మరోవైపు మూడు వారాలుగా ఇబ్రహీంపట్నంలో కొందరు అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాలు, మీడియా ఎదుట పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో గురువారం చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అట్టహాసంగా నిర్వహించడం నియోజకవర్గంలో తన బలాన్ని నిరూపించడానికేనని స్పష్టమైంది. ఇబ్రహీంపట్నం రింగు సెంటర్‌ నుంచి ఫెర్రీ వరకూ 15 కార్లు, వందలాది ద్విచక్ర వాహనాలతో నియోజకవర్గ నలుమూల నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలి వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ భారీ ప్రదర్శన చేపట్టడానికి మంత్రి జోగి రమేష్‌ నూతన గృహం ఫెర్రీకి వెళ్లే రహదారి పక్కన ఉండటమేనని వసంత అభిమానులు అంటున్నారు. అనంతరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌ మత్స్యకారులతో కలిసి 9 లక్షల చేప పిల్లలను ఫెర్రీ వద్ద కృష్ణా నదిలో వదిలారు. తదుపరి ఆయన మాట్లాడుతూ 50 సంవత్సరాలు నిండిన మత్స్యకారులు పింఛన్‌ పొందేలా తమ ప్రభుత్వం అవకాశం కల్పించి భరోసా ఇచ్చిందన్నారు. ఆయన వెంట ఎంపీపీ జోత్స్న, పురపాలిక కౌన్సిలర్లు, అధిక సంఖ్యలో వైకాపా నాయకులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని