logo

Chalapathi Rao: చలపతిరావుకు ఊరంటే మమకారం

విలక్షణ సినీ నటుడు తమ్మారెడ్డి చలపతిరావు(78) హఠాన్మరణం చెందాడనే సమాచారం ఆయన జన్మస్థలమైన కృష్ణా జిల్లా పామర్రు మండలం బల్లిపర్రు, అత్తగారి గ్రామమైన జమీగొల్వేపల్లి వాసులను శోకసంద్రంలో ముంచేసింది.

Updated : 26 Dec 2022 09:51 IST

ఆయన మృతితో బల్లిపర్రులో విషాదం

బల్లిపర్రు (పామర్రు గ్రామీణం), న్యూస్‌టుడే: విలక్షణ సినీ నటుడు తమ్మారెడ్డి చలపతిరావు(78) హఠాన్మరణం చెందాడనే సమాచారం ఆయన జన్మస్థలమైన కృష్ణా జిల్లా పామర్రు మండలం బల్లిపర్రు, అత్తగారి గ్రామమైన జమీగొల్వేపల్లి వాసులను శోకసంద్రంలో ముంచేసింది. వెండి తెరపై గంభీరమైన గాత్రంతో విలక్షణీయ ప్రదర్శన ఇచ్చిన ఆయన మనసు వెన్నపూస అంటున్నారు గ్రామస్థులతోపాటు ఆయన సహచరులు, బంధువులు. వ్యవసాయ కుటుంబానికి చెందిన తమ్మారెడ్డి మణయ్య, వియ్యమ్మ దంపతుల రెండో సంతానమైన చలపతిరావు 1944 మే 8న జన్మించారు. 1946 నుంచి 1950 వరకు స్థానిక పాఠశాలలో 5వ తరగతి వరకు ప్రాథమిక విద్య, అనంతరం మొవ్వ మండలం బట్లపెనుమర్రులో ఎస్‌ఎల్‌సీ వరకు చదివారు. విజయవాడలో ఐటీఐ చదివి కొన్నాళ్లపాటు ఆర్టీసీలో పనిచేశారు. పామర్రు మండలం జమీగొల్వేపల్లికి చెంది సమీప బంధువు, స్వాతంత్య్ర సమరయోధురాలు అట్లూరి వెంకటరత్నమాంబ, వ్రజాంద్రనాథ్‌ చౌదరి దంపతుల కుమార్తె ఇందుమతిని పెళ్లి చేసుకున్నారు.

సొంతూరులోని ఇల్లు

మర్రిచెట్టు, చెరువు గట్టు అంటే ఇష్టం: బల్లిపర్రులో మర్రిచెట్టు, చెరువు గట్టుపై సేద తీరడం అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఎంతటి పని ఒత్తిడిలో ఉన్నా ఏటా మే నెలలో గ్రామానికి వచ్చి వెళ్తుండేవారు. ఎవరికైనా ఇబ్బంది ఎదురైతే తోచిన సాయం చేసి సమస్య పరిష్కరించే వారని బంధువర్గాలు చెబుతున్నారు. మంచినీటి ట్యాంకు నిర్మాణానికి రూ.1.5 లక్షలు, గంగానమ్మ ఆలయ నిర్మాణానికి రూ.లక్ష విరాళమిచ్చి గ్రామాభివృద్ధికి కూడా పాటుపడ్డారు. పక్క గ్రామమైన పెదమద్దాలి కూడలిలోని ఆంజనేయస్వామి ఆలయానికి గ్రిల్స్‌ ఏర్పాటు చేశారు.

సోదరుడు శోభనాద్రీశ్వరరావు, సోదరి బుజ్జమ్మతో చలపతిరావు (చిన్ననాటి చిత్రం)


బాబాయి మనసు వెన్న

మా బాబాయి చలపతిరావు మనసు వెన్న. ఎవరికి కష్టమొచ్చినా అండగా నిలిచేవారు. అందరితో కలివిడిగా ఉండేవారు. ఆయన లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నాం. పెరుగన్నం, మామిడికాయ పచ్చడితో భోజనం ఇష్టంగా ఆరగిస్తారు.

బొప్పన స్వర్ణలత, బంధువు


చాలా బాధగా ఉంది

నాకు చినమామగారు. ఆయన హఠాన్మరణం చాలా బాధనింపించింది. బంధువర్గాల్లో ఏ కార్యక్రమానికైనా హాజరయ్యేవారు. గ్రామంపై మక్కువతో వీలు కుదురినప్పుడల్లా ఇక్కడికి విచ్చేస్తారు.

తమ్మారెడ్డి సరోజిని


చురుకైన వ్యక్తి

చలపతిరావుతో కలిసి చదువుకున్నాను. చిన్నప్పటి నుంచి చురుకైన వ్యక్తే. చెరువు గట్టుపై, ఆలయం ఆవరణలో ఆడుకునేవారం. విద్యలో కూడా ముందుండేవాడు. మా స్నేహం మరువలేనిది. ఆయన లేరనే విషయం చాలా బాధగా ఉంది. మంచి వ్యక్తిత్వమున్న వ్యక్తి మా చలపతి.

వేదాంతం వెంకటశేష భట్టాచార్యులు,చిన్ననాటి స్నేహితుడు


చల్లపల్లితో విడదీయరాని అనుబంధం

చల్లపల్లి, న్యూస్‌టుడే : ప్రముఖ సినీ నటుడు తమ్మారెడ్డి చలపతిరావుకు చల్లపల్లి గ్రామంతో అనుబంధం ఉంది. అతని పెద్ద కుమార్తె జయశ్రీదేవి చల్లపల్లి కోడలే. చల్లపల్లి మునుసబ్‌ బజారుకు చెందిన శ్రీనివాస ట్యూటోరియల్స్‌ నిర్వాహకులు చాపలమడుగు సుభాష్‌ చంద్రబోసు పెద్దకుమారుడు ఉదయ్‌ కుమార్‌(ఎన్నారై)కు చలపతిరావు కుమార్తెను ఇచ్చి వివాహం చేశారు. కుమార్తె చల్లపల్లి కోడలు కావడంతో అప్పుడప్పుడు చల్లపల్లి వచ్చి వెళ్తుండేవారు. చివరి సారిగా చలపతిరావు 2016లో అల్లుడి సోదరుడు రవికుమార్‌ మృతి చెందడంతో చల్లపల్లి వచ్చారు.


ఆప్యాయంగా ఉండేవారు

మా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో చలపతిరావు ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. చాలా మంచి వ్యక్తి. చలపతిరావు మరణం మాకు బాధాకరం.

కళావతి, వియ్యపురాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని