logo

Andhra News: అయ్యో పాపం ఏమైందో.. లండన్‌ విమానం ఎక్కకుండానే విగతజీవిగా..

మరికొన్ని గంటల్లో ఉన్నత చదువుల కోసం విమానం ఎక్కి లండన్‌ వెళ్లాల్సిన కుమారుడు అంతలోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Updated : 12 Jan 2023 07:28 IST

బలవన్మరణానికి పాల్పడిన శివకృష్ణ

మృతుడి పాతచిత్రం

నందిగామ, న్యూస్‌టుడే: మరికొన్ని గంటల్లో ఉన్నత చదువుల కోసం విమానం ఎక్కి లండన్‌ వెళ్లాల్సిన కుమారుడు అంతలోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిల్చాడు. నందిగామ మండలం హనుమంతుపాలెం గ్రామానికి చెందిన గాడిపర్తి వెంకటనారాయణ, రాణి దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు గోపీకృష్ణ లండన్‌లో ఎంఎస్‌ చదువుతున్నాడు. చిన్న కుమారుడు శివకృష్ణ(24) కూడా ఉన్నత చదువుల కోసం బుధవారం వేకువజామున 2.15 గంటలకు శంషాబాద్‌లో విమానం ఎక్కి లండన్‌ వెళ్లాలి. అందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు.

తల్లిదండ్రులు కుమారుడిని ఎయిర్‌పోర్టుకు పంపించడానికి సిద్ధమయ్యారు. ఇక హైదరాబాద్‌కు కారులో బయలుదేరడమే ఉంది. ఈ పరిస్థితుల్లో మంగళవారం మధ్యాహ్నం 3.45 గంటలకు స్నేహితులను కలిసి వస్తానని చెప్పి శివకృష్ణ ఇంటి నుంచి వెళ్లి రాలేదు. సమయం అవుతోందని, ఇంటికి రావాలని ఆరు గంటల సమయంలో తండ్రి కుమారుడితో సెల్‌ఫోన్‌లో మాట్లాడారు. ఇంకా సమయం ఉందని, వస్తున్నానని చెప్పాడు. అదే ఆఖరి మాట. తర్వాత సెల్‌ఫోన్‌ స్విచ్ఛాప్‌ వచ్చింది. కుమారుడి ఇంటికి రాకపోవడంతో వెతకడం ప్రారంభించారు. ఆచూకీ తెలియలేదు. బుధవారం ఉదయం పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట సమీపంలోని ఎన్‌ఎస్పీ కాల్వ కట్ట పక్కన చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తండ్రి, బంధువులు ఘటన స్థలానికి చేరుకొని బోరున విలపించారు. పెనుగంచిప్రోలు ఎస్సై హరిప్రసాద్‌ మృతదేహాన్ని నందిగామ శవాగారానికి తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లండన్‌ వెళ్లేందుకు ఇష్టం లేకే బలవన్మరణానికి పాల్పడినట్లు భావిస్తున్నామని ఎస్సై తెలిపారు. మృతదేహానికి ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నివాళులర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని