logo

దక్కన్‌ బండి.. చూద్దాం రండి

మొదటి తరం అల్బియాన్‌ బస్సును బుధవారం పండిట్‌నెహ్రూ బస్టేషన్‌ సిటీ పోర్ట్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఉద్యోగ విరమణ చేసిన ఆర్టీసీ డ్రైవర్లతో రిబ్బన్‌ కత్తిరించి బస్సును ఆవిష్కరించారు.

Published : 19 Jan 2023 06:06 IST

బస్సు ఆవిష్కరణలో పాల్గొన్న ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు,

రవాణా శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న

విజయవాడ బస్టేషన్‌, న్యూస్‌టుడే: మొదటి తరం అల్బియాన్‌ బస్సును బుధవారం పండిట్‌నెహ్రూ బస్టేషన్‌ సిటీ పోర్ట్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఉద్యోగ విరమణ చేసిన ఆర్టీసీ డ్రైవర్లతో రిబ్బన్‌ కత్తిరించి బస్సును ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ సిహెచ్‌ ద్వారకా తిరుమలరావు పాల్గొని మాట్లాడుతూ బస్టేషన్‌ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులందరికీ కనిపించేలా దీనిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రవాణా శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న మాట్లాడుతూ తొలితరం బస్సును ఇప్పటి వారందరికీ తెలియజేసేలా ప్రదర్శనకు ఉంచడం అభినందనీయమన్నారు.

బస్సు చరిత్ర.. అల్బియాన్‌ కంపెనీ రూపొందించి హైదరాబాద్‌ రాష్ట్రంలో నిజాం ప్రభుత్వం 1932వ సంవత్సరంలో ప్రారంభించిన తొలి బస్సుకు పెట్టిన పేరు డెక్కన్‌ క్వీన్‌. అప్పటి రవాణా వ్యవస్థకు సాక్ష్యంగా నిలిచిన ఏకైక బస్సు ఇదే. ఇది నిజాం రాష్ట్ర రైల్వే రోడ్డు రవాణా సంస్థ వారసత్వ ఆస్తి. ఆ సంస్థ 1932లో కేవలం 3 డిపోలు, 27 బస్సులు, 166 మంది కార్మికులతో ఏర్పడింది. దానిలో భాగంగా 27 అల్బియాన్‌ బస్సులను నిజాం రాష్ట్రంలో నడిపారు. లండన్‌ నుంచి దిగుమతి చేసుకున్న ఈ బస్సులను 1970 వరకు హైదరాబాద్‌ ప్రాంత పరిధిలో తిప్పారు.

కాలినడకన వెళ్తున్న వారిని చూసి చలించిన యువరాణి... నాంపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి నార్కట్‌పల్లి వరకు నడిచి వెళుతున్న ప్రజలను చూసి చలించిన యువరాణి జహీరా బేగం ఆలోచన మేరకు డెక్కన్‌ క్వీన్‌ బస్సులను ఏర్పాటు చేశారు. అప్పట్లోనే వీటికి రూ.3.71 లక్షలు వెచ్చించారు. అప్పటి హైదరాబాద్‌ రాష్ట్రానికి ప్రైమ్‌ మినిస్టర్‌గా ఉన్న అక్బర్‌ హైదరీ రాజు చొరవ తీసుకుని 27 బస్సులను లండన్‌లో కోనుగోలు చేసి అక్కడి నుంచి బొంబాయికి నౌకద్వారా, అనంతరం బొంబాయి నుంచి హైదరాబాద్‌కు రోడ్డు మార్గం ద్వారా 27 రోజుల్లో తీసుకు వచ్చి కాచిగూడ, నార్కట్‌పల్లి, కాజీపేట అనే 3 డిపోలను ఏర్పాటు చేసి అందజేశారు. మొదటి డెక్కన్‌ క్వీన్‌ బస్సును ఛార్మినార్‌ నుంచి రాణీగంజ్‌ మార్గంలో డిపారు. నిజాం యువరాణి సేవకు గుర్తుగా ఆమె పేరులోని మొదటి అక్షరం జడ్‌ను బస్సుల రిజిస్ట్రేన్‌లో చేర్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని