logo

గ్యాస్‌ పొంగళ్ల షెడ్‌ మూసివేత

పేద వర్గాలకు కూడా గ్యాస్‌ సిలెండర్లు, పొయ్యిలను ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంటే.. దుర్గగుడిలో మాత్రం గ్యాస్‌ వినియోగించే పొంగళ్ల షెడ్డును మూసి వేసి భక్తులను ఇబ్బంది పెట్టేలా కట్టెల పొయ్యిలపైన పొంగళ్లు వండేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Published : 21 Jan 2023 02:38 IST

కట్టెల పొయ్యిల ఏర్పాటు
అధికారుల తీరుపై భక్తుల అసంతృప్తి
ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే

భక్తుల విశ్రాంతి షెడ్డులో కట్టెల పొయ్యిలు ఏర్పాటు చేసిన అధికారులు

పేద వర్గాలకు కూడా గ్యాస్‌ సిలెండర్లు, పొయ్యిలను ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంటే.. దుర్గగుడిలో మాత్రం గ్యాస్‌ వినియోగించే పొంగళ్ల షెడ్డును మూసి వేసి భక్తులను ఇబ్బంది పెట్టేలా కట్టెల పొయ్యిలపైన పొంగళ్లు వండేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పొంగళ్లను పవిత్రంగా తయారు చేసి దుర్గమ్మకు సమర్పిస్తే తమ కష్టాలు తీరుతాయని భక్తుల విశ్వాసం. దేవస్థానం అధికారులు భక్తులకు సేవలు మెరుగు పరచాల్సింది పోయి కట్టెల పొయ్యిలపై పొంగళ్లు తయారు చేసుకోవాలని చెబుతున్నారు. అధికారుల తీరుపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని వంటి చిన్న దేవస్థానంలో సైతం దశాబ్ద కాలం కిందటే గ్యాస్‌ స్టౌవ్‌లపై భక్తులు పొంగళ్లు తయారు చేసుకొనే అవకాశాన్ని అధికారులు కల్పించారు. ఇక్కడ మాత్రం రివర్సులో గ్యాస్‌ స్టౌవ్‌ల పొంగళ్ల షెడ్డును మూసివేసి భక్తుల విశ్రాంతి తీసుకునే షెడ్‌లో పొయ్యిలు ఏర్పాటు చేశారు. షెడ్డులో 14 పొయ్యిలను అధికారులు ఏర్పాటు చేశారు. పొంగళ్లు వండే ప్రాంతానికి వెనుక మరుగుదొడ్లు ఉన్నాయి. ఆరేళ్లు గడుస్తున్నా పొంగళ్ల షెడ్డు ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని ఎంపిక చేయలేకపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధిక ధరలకు..

గతంలో దుర్గగుడి అధికారులు నామమాత్ర రుసుంతో గ్యాస్‌ స్టౌవ్‌పై పొంగలి వండుకునే అవకాశం భక్తులకు కల్పించారు. ప్రస్తుతం రూ.50 విలువ చేసే కట్టె పేళ్లను రూ.100కు ఇక్కడున్న దుకాణదారులు విక్రయిస్తున్నారు. అమ్మవారిపైన భక్తితో ఇప్పటికే కొబ్బరికాయ, పూజాద్రవ్యాలు అధిక ధరలు వెచ్చించి భక్తులు కొనాల్సి వస్తోంది. వాటికితోడు పొంగళ్లు వండేందుకు అవసరమైన కట్టె పేళ్లకు సైతం రెట్టింపు ధర వెచ్చించాల్సి వస్తోందని మహిళలు వాపోతున్నారు. అధికారులు స్పందించి పొంగళ్ల షెడ్డు నిర్మించి గ్యాస్‌ పొయ్యిలు ఏర్పాటు చేస్తే దేవస్థానానికి ఆదాయంతో పాటు మొక్కులు చెల్లించుకునే మహిళలకు అవస్థలు తప్పుతాయని భక్తులు అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని