logo

ప్లాస్టిక్‌ నిషేధాన్ని పటిష్ఠంగా అమలు చేయాలి

జిల్లాలో ప్లాస్టిక్‌ నిషేధాన్ని పటిష్ఠంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌ సమీర్‌శర్మ స్పష్టం చేశారు.

Published : 21 Jan 2023 02:38 IST

అధికారులతో సమీక్షిస్తున్న కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌ సమీర్‌ శర్మ

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: జిల్లాలో ప్లాస్టిక్‌ నిషేధాన్ని పటిష్ఠంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌ సమీర్‌శర్మ స్పష్టం చేశారు. జిల్లాలో ఒకరోజు పర్యటనలో భాగంగా శుక్రవారం మచిలీపట్నం వచ్చిన ఆయన కలెక్టరేట్‌లో నిర్వహించిన సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనపై సమీక్ష, కాలుష్య నియంత్రణ మండలి జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో అధికంగా కాలుష్యాన్ని విడుదల చేసే పరిశ్రమలకు నోటీసులు జారీ చేసి కాలుష్య నివారణ చర్యలు పక్కాగా అమలుచేయాలని అధికారులను ఆదేశించారు.  

ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించాలి.. సమావేశంలో పాల్గొన్న ఏపీ ఫ్లెక్సీ ప్రింటర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు తమ ఇబ్బందులు తెలియజేస్తూ సమీర్‌శర్మ, జిల్లా కలెక్టర్‌ రంజిత్‌బాషాకు వినతిపత్రాలు అందజేశారు. ఈనెల 26 నుంచి ఫ్లెక్సీల నిషేధానికి విధించిన గడువును మరికొంత కాలం పొడిగించాలని అభ్యర్థించారు.క్లాత్‌ బ్యానర్‌లపై ముద్రణ వేయాలంటే మిషనరీని అప్‌గ్రేడ్‌ చేసుకోవాలని అందుకు అవసరమైన మొత్తాన్ని సబ్సిడీతో కూడిన రుణంగా అందించాలని విజ్ఞప్తి చేశారు. జేసీ అపరాజితసింగ్‌, కాలుష్యనియంత్రణ మండలి జోనల్‌ అధికారి ఎన్‌వీ భాస్కరరావు, పరిశ్రమల శాఖ జీఎం వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో ఆరోగ్యవంతమైన సమాజం కోసం సూక్ష్మస్థాయి చర్యలు తీసుకోవాలని డా. సమీర్‌శర్మ అధికారులకు సూచించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి 8 ప్రధాన సూచికల్లో జిల్లా ప్రగతిని సమీక్షిస్తూ పలు సూచనలు చేశారు. కలెక్టర్‌ రంజిత్‌బాషా నూతనంగా ఏర్పాటైన జిల్లా సమాచారంతో పాటు సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. మచిలీపట్నం, పామర్రు, తోట్లవల్లూరు, ఉయ్యూరు మండలాల్లో రక్తహీనత కేసులు ఎక్కువగా ఉండటానికి కారణాలపై సంబంధిత అధికారులు, ఏఎన్‌ఎంలతో వీసీ ద్వారా ఆరా తీశారు.

అన్ని స్థాయిల్లో ఉద్యోగులు ప్రజాసేవలో భాగస్వాములు కావాలని సమీర్‌శర్మ సూచించారు. నగరంలోని 9వ డివిజన్‌ సచివాలయాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించారు. సచివాలయ పరిధిలో మాటలు రాని ఓ మహిళను గుర్తించి స్పీచ్‌థెరపీ ఇప్పించాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. కార్పొరేటర్‌ రాసంశెట్టి వాణిశ్రీ, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

కలెక్టర్‌కు ప్రశంసలు.. సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనకై కలెక్టర్‌ రంజిత్‌బాషా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందించి జిల్లాలో సమర్థంగా అమలు చేస్తున్న తీరును ప్రశంసించిన సమీర్‌శర్మ ఆయనకు అభినందనలు తెలిపారు. జిల్లాలో  వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.

Read latest Amaravati krishna News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు