logo

ఇంటింటికీ కుళాయి.. ఎప్పుడు?

గ్రామాల్లో ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2019లో జలజీవన్‌ మిషన్‌ (జేజేఎం) పథకానికి శ్రీకారం చుట్టింది.

Published : 22 Jan 2023 02:26 IST

బిల్లులపై ఆందోళన
కంచికచర్ల, న్యూస్‌టుడే

గ్రామాల్లో ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2019లో జలజీవన్‌ మిషన్‌ (జేజేఎం) పథకానికి శ్రీకారం చుట్టింది. పథకం ప్రారంభించి మూడేళ్లు దాటినా సగం పనులు కూడా పూర్తి కాలేదు. మందకొడిగా సాగుతున్నాయి. ఫలితంగా పల్లెవాసులు దాహార్తితో అలమటిస్తున్నారు. గంటల తరబడి పబ్లిక్‌ కుళాయిల వద్ద నీళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ట్యాంకర్లు ఎప్పుడు వస్తాయో తెలియక సతమతమవుతున్నామని గ్రామీణ ప్రాంత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వీరులపాడు మండలం జుజ్జూరులో తాగునీటి కోసం కుళాయి వద్ద ఉంచిన డబ్బాలు, బిందెలు

జేజేఎం పనులు దక్కించుకున్న గత్తేదారులు సచివాలయాలు, ఆర్‌బీకేలు, డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణ కాంట్రాక్టులను సైతం కొన్ని చోట్ల తీసుకున్నారు. రూ.5 లక్షలోపు, ఆపైన చేసే పనులకు విడివిడిగా టెండర్లు పిలిచారు. చేసిన పనులకు బిల్లులు సకాలంలో రాకపోవడంతో జేజేఎం పనులు చేపట్టేందుకు గత్తేదారులు వెనుకాడుతున్నారని తెలుస్తోంది. నాలుగైదు సార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారులు ఆసక్తిచూపలేదు. అందుకే పనుల్లో జాప్యం చోటుచేసుకుంటోంది. నిధులు కేటాయించినా బిల్లులు అవుతాయో లేదో అన్న ఆందోళనతో గుత్తేదారులు ముందుకు రావడం లేదు. పనుల కేటాయింపు విధానాల్లో మార్పులు చేసినా ఫలితం లేకుండా పోయింది. 2024 మార్చి నాటికి అన్ని ఇళ్లకూ కుళాయి కనెక్షన్‌ ఇవ్వాలని లక్ష్యం పెట్టుకున్నా.. ఆశించిన రీతిలో పనులు సాగడం లేదు.

115 పనులు పూర్తి

జల జీవన్‌ మిషన్‌ కింద ఎన్టీఆర్‌ జిల్లాకు రూ.295.82 కోట్లు మంజూరయ్యాయి. మొత్తం 695 పనులకు గాను కేవలం 115 మాత్రమే ఇప్పటివరకు పూర్తయ్యాయి. రూ.12 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. పలు ప్రాంతాల్లో పైపులైన్ల పనులు పూర్తయినా కుళాయిల ఏర్పాటు మధ్యలోనే నిలిచిపోయింది. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పీహెచ్‌సీలకు కూడా ఈ పథకం ద్వారానే తాగునీరు అందించాల్సి ఉంది. 

వేగవంతం చేసేందుకు చర్యలు: - డి.వెంకటరమణ, ఎస్‌ఈ, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఎన్టీఆర్‌ జిల్లా

జలజీవన్‌ మిషన్‌ పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గ్రామాల్లో తాగునీటి కొరత లేకుండా చూస్తున్నాం. తాగునీటి సరఫరాలో సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఇటీవల కేటాయించిన పనుల టెండర్ల ప్రక్రియ వెంటనే ప్రారంభిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని