logo

త్వరగా వెళ్లాలని.. తిరిగిరాని లోకాలకు..

దగ్గర దారని.. త్వరగా ఇళ్లకు చేరుకోవాలనే ఆత్రుత.. ముగ్గురిని మృత్యువుకు చేరువ చేసింది. రైలు పట్టాలపై నడక.. తిరిగిరాని లోకాల బాట పట్టించింది.

Published : 23 Jan 2023 05:26 IST

నెల్లూరులో రైలు ఢీకొని ముగ్గురి దర్మరణం

మృతుల్లో విజయవాడ కార్పొరేషన్‌ ఉద్యోగి

న్యూస్‌టుడే, నెల్లూరు (నేర విభాగం)

సరస్వతీరావు (పాత చిత్రం)

దగ్గర దారని.. త్వరగా ఇళ్లకు చేరుకోవాలనే ఆత్రుత.. ముగ్గురిని మృత్యువుకు చేరువ చేసింది. రైలు పట్టాలపై నడక.. తిరిగిరాని లోకాల బాట పట్టించింది. మరో పది నిమిషాల్లో ఇంటికి చేరుకునేవారు. అంతలోనే అనుకోని ఘోరం జరిగింది. రైలు ఢీకొని వారు ప్రాణాలు కోల్పోయారు. ఆ కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది. ఈ ఘటన నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండు వద్ద శనివారం రాత్రి జరిగింది. వీరిలో ఇద్దరు వృద్ధ దంపతులు కాగా మరో యువ ఉద్యోగి ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం మూడు మృతదేహాలకు మరణానంతర పరీక్షలు చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతిచెందిన వారు ఆ కుటుంబాలకు పెద్ద దిక్కు కావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

మలుపులో రైలు కనిపించక: వృద్ధ దంపతులు శేషాద్రి రైలులో నెల్లూరుకు చేరుకున్నారు. అదే సమయంలో విజయవాడ నుంచి విక్రమ సింహపురి రైలు నుంచి సరస్వతీరావు నెల్లూరుకు చేరుకున్నారు. ఈ రెండు రైళ్లకు అయిదు నిమిషాలే తేడా. ముగ్గురు ఆటో ఎక్కి తమ ఇళ్లకు చేరుకోవాల్సి ఉంది. రైలు దిగగానే పోలయ్య, సుగుణమ్మ కాలి నడకన సీసీఎస్‌ పోలీసుస్టేషన్‌ వద్ద ఆటో ఎక్కేందుకు పట్టాలపై బయలుదేరారు. ఇలాగే వస్తున్న సరస్వతీరావు వీరికి తోడయ్యారు. ముగ్గురూ కలిసి పట్టాలపై వస్తుండగా ఎదురు వస్తున్న నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొంది. ఈ క్రమంలో సుగుణమ్మ పైనుంచి కింద పడటంతో తలకు గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. నక్కలోళ్ల సెంటరు వద్ద ఉండే మలుపు ప్రమాదకరంగా ఉంటుంది. ఇక్కడ రైలు వచ్చేది కనిపించదు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిందని రైల్వే పోలీసులు భావిస్తున్నారు.

పది నిమిషాల్లో ఇంటికి వస్తున్నానని చెప్పి..

విజయవాడ- గూడూరు ఇంటర్‌ సిటీ రైలు పడుగుపాడు వద్ద ఉండగా, పది నిమిషాల్లో ఇంటికి వస్తున్నానని తెన్నేటి సరస్వతీరావు ఇంటకి ఫోన్‌ చేసి చెప్పారు. 10.10 గంటలకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. నెల్లూరు రిత్విక్‌ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్న ఆయన విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో వార్డు ఎడ్యుకేషన్‌ సెక్రటరీగా పనిచేస్తున్నారు. గుంటూరులో తెలిసిన వారి వద్ద రూం అద్దెకు తీసుకుని ఉంటున్నారు. వారాంతపు, సెలవు దినాలు, పండుగ వేళల్లో ఇంటికి వస్తుంటారు. ప్రతి శనివారం ఇదే రైలులో నెల్లూరుకు వస్తుంటారు. ఆయన భార్య జిల్లా ప్రభుత్వాస్పత్రిలో స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తున్నారు. వీరికి పిల్లలు లేరు.

Read latest Amaravati krishna News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని