logo

కళ్లు మూసుకుంటాం.. మార్కులేసుకోండి

బీఈడీ ప్రాక్టికల్‌ పరీక్షలను అత్యంత పక్కాగా నిర్వహించాల్సి ఉంటుంది. గురువులను తయారుచేసే ప్రక్రియలో ఇవి కీలకం.

Published : 23 Jan 2023 05:26 IST

ఇంటర్నల్‌ ఎగ్జామినర్లు, విద్యార్థులు లేకున్నా బీఈడీ ప్రాక్టికల్స్‌
ఈనాడు, అమరావతి

బీఈడీ ప్రాక్టికల్‌ పరీక్షలను అత్యంత పక్కాగా నిర్వహించాల్సి ఉంటుంది. గురువులను తయారుచేసే ప్రక్రియలో ఇవి కీలకం. కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ కళాశాలల్లో ప్రస్తుతం జరుగుతున్న ఫైనల్‌ ప్రాక్టికల్‌ పరీక్షల తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ‘ప్రాక్టికల్‌ పరీక్షలను తూతూమంత్రంగా నిర్వహించుకోండి, ఇంటర్నల్‌ ఎగ్జామినర్లు లేకపోయినా, విద్యార్థులు రాకపోయినా.. మేం అస్సలు పట్టించుకోం, నచ్చినట్టుగా మార్కులు వేసేసుకోండి’ అనేలా విశ్వవిద్యాలయ అధికారులు వ్యవహరిస్తున్నారు.

కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలో 22 బీఈడీ కళాశాలలుండగా.. వీటిలో ఒక్కో దానిలో చివరి ఏడాదిలో 50 మంది వరకూ విద్యార్థులున్నారు. ప్రస్తుతం ఆఖరి ఏడాది వారికి ప్రాక్టికల్‌ పరీక్షలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించి విశ్వవిద్యాలయం కనీస ప్రణాళిక లేకుండా వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనవరి 21 నుంచి 25 వరకూ ఐదు రోజుల్లోనే పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ను ఖరారు చేశామంటూ.. కేవలం ఒక్క రోజు ముందు  20న కళాశాలలకు సమాచారం ఇచ్చారు. ఈ ఐదు రోజుల్లో ఆదివారం కూడా ఉంది. అంటే కేవలం నాలుగు రోజుల్లోనే గణితం, తెలుగు, ఆంగ్లం, భౌతికశాస్త్రం, సాంఘికశాస్త్రం, జీవశాస్త్రం.. ఈ ఆరు సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు పూర్తిచేయాలి. బీఈడీ కళాశాలల ప్రాక్టికల్‌ పరీక్షల నిర్వహణ అనేది.. అనుబంధంగా ఉండే పాఠశాలలపై ఆధారపడి ఉంటుంది. అలాంటిది.. కేవలం ఒక్క రోజులోనే షెడ్యూల్‌ను నిర్ణయించుకుని విశ్వవిద్యాలయానికి చెప్పడం, ఆ వెంటనే పరీక్షలను నిర్వహించడం అనేది చాలా కష్టం. పైగా ఒక్కో కళాశాలలో 40 నుంచి 50 మంది విద్యార్థులున్నారు. ఒక రోజుకు పది మందికి మించి ప్రాక్టికల్స్‌ పూర్తిచేయకూడదనే నిబంధన ఉన్నా పట్టించుకోలేదు. చాలా కళాశాలల్లో ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించకుండానే మార్కులు వేసేస్తుంటారు. వారికి మరింత ఊతం ఇచ్చేలా విశ్వవిద్యాలయం తీరు ఉంది. కనీసం ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను కూడా నియమించలేదు.

ఒకరికొకరు సహకరించుకునేలా..

గతంలో ప్రాక్టికల్‌ పరీక్షలను రెండు దశల్లో తేదీలు ఇచ్చి నిర్వహించేవాళ్లు. మొదటి దశలో కొన్ని కళాశాలల్లో పరీక్షలు నిర్వహించి.. వాటికి ఎక్స్‌టర్నల్‌ ఎగ్జామినర్లుగా మిగతా వాటికి సంబంధించిన అధ్యాపకులను వేసేవారు. తర్వాత మిగతా వాటికి నిర్వహించి.. మొదటి దశలో పూర్తయిన కళాశాలల అధ్యాపకులను ఎక్స్‌టర్నల్‌ ఎగ్జామినర్లుగా వేసేవారు. కానీ.. ఈసారి అందరికీ ఒకేసారి.. కేవలం నాలుగు రోజుల్లో నిర్వహించుకోమంటూ షెడ్యూల్‌ను ఇచ్చారు. దీనివల్ల ఒక కళాశాల నుంచి మరో దానికి అధ్యాపకులు కుండమార్పిడి పద్ధతిలో ఎగ్జామినర్లుగా వెళుతున్నారు. మా వాళ్లకు మీరు మార్కులేయండి, మీ వాళ్లకు మేం వేస్తాం.. అని ఒప్పందం చేసుకునేలా ఈసారి విశ్వవిద్యాలయమే అవకాశమిచ్చింది. పైగా.. ఒక కళాశాలలో ప్రాక్టికల్‌ పరీక్షలు జరిగితే.. కచ్చితంగా  బయట నుంచి వచ్చిన అధ్యాపకుడు ఒకరు, కళాశాలకు చెందిన వారు మరొకరు ఎగ్జామినర్లుగా ఉండాలి. ప్రస్తుతం అన్ని కళాశాలలకు ఒకేసారి నిర్వహిస్తే.. ఇంటర్నల్‌ ఎగ్జామినర్లుగా ఆ విద్యా సంస్థకు చెందిన వాళ్లు ఉండేందుకు అవకాశం లేదు. దీంతో పరీక్షలు అస్తవ్యస్తంగా మారిపోయాయి.

దర్జాగా మార్కులు..

కృష్ణా వర్సిటీ పరిధిలోని బీఈడీ కళాశాలల్లో చాలా వాటిలో ఇతర రాష్ట్రాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరారు. వారు తరగతులకు రారు. కేవలం హాజరు వేసి.. పరీక్షల సమయంలో వచ్చి వెళ్లిపోయేలా నిర్వాహకులు ఒప్పందం చేసుకుంటారు. ఒకరోజు ముందు మాత్రమే షెడ్యూల్‌ ఇవ్వడంతో వారిని రప్పించడం జరగని పని. ఇలాంటి విద్యార్థులందరి నుంచి అదనంగా వసూలు చేస్తున్నట్టు సమాచారం. వసూలు చేసిన దానిలో ఎగ్జామినర్లకు కొంత ఇచ్చి, విశ్వవిద్యాలయానికి కొంత చెల్లించి నచ్చినట్టుగా మార్కులు వేయించుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కువ కళాశాలల్లో పేపర్‌ మీదే చాలామంది అధ్యాపకులుంటారు. వాళ్లు నిత్యం కళాశాలకు రారు.  ప్రాక్టికల్‌ పరీక్షల సమయంలో మాత్రం రావాల్సి ఉంటుంది. ఈ సారి ఒక్క రోజు వ్యవధే ఇవ్వడంతో వాళ్లు రారనే విషయం విశ్వవిద్యాలయానికీ తెలుసు. ఇలా కీలకమైన తుది ప్రాక్టికల్‌ పరీక్షలను తూతూమంత్రంగా కొనసాగిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని