logo

ఆలయాల పునరుద్ధరణ ఎప్పుడో?

కృష్ణా పుష్కరాలు, కనకదుర్గ పై వంతెన నిర్మాణం నేపథ్యంలో తొలగించిన తొమ్మిది ఆలయాల పునరుద్ధరణ పనులు రెండేళ్లు గడుస్తున్నా పూర్తి కాలేదు. రూ.1.79 కోట్లతో ఆలయాల నిర్మాణం చేపట్టారు.

Published : 24 Jan 2023 05:24 IST

గ్రౌండ్‌ ఫ్లోరుతో నిలిచిన శని ఆలయ నిర్మాణం

విద్యాధరపురం, న్యూస్‌టుడే: కృష్ణా పుష్కరాలు, కనకదుర్గ పై వంతెన నిర్మాణం నేపథ్యంలో తొలగించిన తొమ్మిది ఆలయాల పునరుద్ధరణ పనులు రెండేళ్లు గడుస్తున్నా పూర్తి కాలేదు. రూ.1.79 కోట్లతో ఆలయాల నిర్మాణం చేపట్టారు. అప్పటి దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఏడాదిలోపు తొమ్మిది ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. వీటిల్లో శని ఆలయం, కనకదుర్గానగర్‌లోని శ్రీకృష్ణుడి ఆలయ నిర్మాణ పనులు శంకుస్థాపన చేసిన తరువాత ప్రారంభం కాలేదు. మిగిలిన ఏడు దేవాలయాల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. వీటిల్లో రూ.49 లక్షలతో పూర్తి చేసిన దక్షిణ ముఖ ఆంజనేయస్వామి ఆలయం, సీతమ్మవారి పాదాలు, బొడ్డు బొమ్మ గత ఆరు నెలలుగా ప్రారంభానికి నోచుకోని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ఆయా ఆలయాల పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. చెత్త, దుమ్ము పేరుకుపోతోంది. మిగతావి ప్రారంభించారు.

దాతల సహకారంతో..

సీతమ్మవారి పాదాల సెంటరు వద్ద రూ.2 కోట్లతో నిర్మిస్తున్న శని ఆలయాన్ని దాత సహకారంతో పూర్తి చేయాలని నిర్ణయించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌ వరకు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఆలయ గోడల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. కనకదుర్గానగర్‌లోని దాసాంజనేయ స్వామి, శ్రీకృష్ణ మందిర పనులను ఇంత వరకు దేవాదాయ శాఖ ప్రారంభించలేదు. వీటి కోసం రూ.40లక్షలు కేటాయించారు. గోశాల నిర్వాహకులు మాత్రం దుర్గగుడితో సంబంధం లేకుండా రూ.15 లక్షలతో శ్రీకృష్ణుడి మందిరం, గో పూజకు అనుకూలంగా నిర్మాణం చేశారు.


ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రారంభిస్తాం
- అన్నపూర్ణ, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌

సీతమ్మ వారి పాదాలు, దక్షిణ ముఖ ఆంజనేయస్వామి ఆలయం, బొడ్డు బొమ్మ ప్రారంభోత్సవ తేదీలను దేవాదాయ శాఖ కమిషనరు దృష్టికి తీసుకువచ్చిన తరువాత నిర్ణయిస్తాం. ఉత్తరాయణంలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. శని ఆలయం దాతల సహకారంతో నిర్మిస్తున్నామన్నారు. రెండు నెలల్లో భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మిగిలిన ఆలయాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తరువాత నిర్ణయం తీసుకుంటాం.

దుమ్ము కొట్టుకుపోతున్న సీతమ్మవారి పాదాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని