logo

నాలుగేళ్లలో.. ఒక్కపునాది లేదు..!

సౌకర్యవంతంగా ఉన్న అన్నదాన భవనాన్ని.. కనీస ప్రణాళిక లేకుండా ఆరేళ్ల కిందట అప్పటి ఈవో కూలగొట్టేశారు. మళ్లీ అధునాతనంగా అన్నదాన భవనం కడతామని చెప్పారు.

Published : 26 Jan 2023 03:36 IST

దుర్గగుడి ఇంజినీరింగ్‌ విభాగం పనితీరుకు నిదర్శనం
ఈనాడు, అమరావతి

‘విజయవాడ దుర్గగుడిలో గత నాలుగేళ్లలో ఒక్క అభివృద్ధి పని చేపట్టిందీ లేదు. కేవలం కాగితాలపై నమూనాలంటూ హడావుడి చేసి.. ఆలయ ఆదాయాన్ని కరిగించడం తప్ప చేస్తున్నదేమీ లేదు. ప్రతిసారీ ఏదో ఒక సంస్థను ఎంపిక చేశామని చెప్పి తీసుకురావడం, నమూనాలు గీయిస్తున్నామంటూ హడావుడి చేయడం.. వారికి రుసుములు చెల్లించడం.. కొంత తమ జేబుల్లో వేసుకోవడం.. గత నాలుగేళ్లుగా ఇదే తంతు నడుస్తోంది.’

సౌకర్యవంతంగా ఉన్న అన్నదాన భవనాన్ని.. కనీస ప్రణాళిక లేకుండా ఆరేళ్ల కిందట అప్పటి ఈవో కూలగొట్టేశారు. మళ్లీ అధునాతనంగా అన్నదాన భవనం కడతామని చెప్పారు. పునాదులు కూడా ఇప్పటివరకూ కట్టింది లేదు. అన్నదాన స్థలాలను మారుస్తూ భక్తులను అవస్థలకు గురిచేశారు కొండపై ప్రసాదం పోటు భవనమూ నేలమట్టం చేశారు. ఆ తర్వాత కొండ దిగువన ఇళ్ల మధ్యలో ఉన్న వసంత మల్లికార్జున ఆలయం ప్రాంగణంలో రూ.కోటి ఖర్చుపెట్టి ఓ షెడ్డును తాత్కాలికంగా వేశారు. ఇప్పటికీ ప్రసాదం పోటు భవనానికి కూడా ఒక్క ఇటుకా పడలేదు. జమ్మిదొడ్డిలో ఉన్న ఇంద్రకీలాద్రి అతిథి గృహాన్ని కూడా తవ్వేశారు. గదులన్నింటినీ కొట్టేసి.. సూట్‌రూంలుగా మారుస్తున్నామని చెప్పారు. తీరా చూస్తే.. వాటిని ప్రస్తుతం ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల కార్యాలయాలుగా వాడుకుంటున్నారు. భక్తుల కోసం ఉన్న ఒకే ఒక్క కాటేజీని కూడా వారికి కాకుండా చేశారు. ఇవన్నీ ఆలయ ఇంజినీరింగ్‌ విభాగం, ఈవోల కార్యదక్షతకు ప్రత్యక్ష నిదర్శనాలే.

వేడుకల సమయంలో భారీగా వృథా ఖర్చు..

దసరా, భవానీదీక్షలు సహా దుర్గగుడిలో ఏటా నిర్వహించే వేడుకల సమయంలో మాత్రం ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు అంచనాలు భారీగా తయారు చేస్తుంటారు. దసరా ఉత్సవాల నిర్వహణ ఖర్చును ఏటేటా పెంచుకుంటూపోయి.. ప్రస్తుతం రూ.కోట్లలో బిల్లులు చెల్లిస్తున్నారు. దసరా, భవానీదీక్షల సమయంలో ఇంద్రకీలాద్రి దిగువున ఉన్న వినాయక ఆలయం వద్ద నుంచి రెండు కిలోమీటర్లకు పైగా తాత్కాలిక క్యూలైన్లు వేస్తున్నారు. ఈ టెండర్లకే ఏటా రూ.కోట్లలో చెల్లిస్తున్నారు. ఏటా రెండుసార్లు ఖచ్చితంగా నిర్వహించే వేడుకలకు.. ఆలయం ఆధ్వర్యంలోనే సొంతంగా షామియానా సామగ్రి కొనుగోలు చేసుకుని ఉంచుకుంటే.. భారీగా ఖర్చు తగ్గుతుంది. వాటినే ఎన్నేళ్లయినా తాత్కాలిక క్యూలైన్లకు వినియోగించుకోవచ్చు. ఆ సామగ్రిని భద్రంగా ఒకచోట ఉంచేందుకు ఓ గది కట్టి.. దాని పర్యవేక్షణ బాధ్యతను ఇంజినీరింగ్‌ విభాగం సిబ్బంది చూసుకోవచ్చు. కానీ.. ఏటా తాత్కాలిక పద్ధతిలో ఉత్సవాల ముందు క్యూలైన్లను వేసేందుకు టెండర్లు పిలుస్తున్నారు. ఈ టెండర్లు కూడా అధికారులు, ప్రజాప్రతినిధుల అనుయాయులకే ఇస్తున్నారనేది బహిరంగ రహస్యమే. కొంతమంది బినామీలను పెట్టి మరీ ఇలాంటివి దక్కించుకుంటున్నారు. ఆలయ ఆదాయాన్ని ఎలా కరిగించాలనే ప్రణాళికలే తప్ప.. ఆలయానికి మేలు చేసేవి ఒక్కటీ చేయడం లేదనే విమర్శలు తీవ్రస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి.

ఇంతమంది సిబ్బంది ఏం చేస్తున్నారో..

దుర్గగుడిలోని ఇంజినీరింగ్‌ విభాగంలో గత ఏడాది వరకూ ఒక ఈఈ పోస్టు మాత్రమే ఉండగా.. మరొకటి కొత్తగా సృష్టించారు. ప్రభుత్వం ఇస్తామన్న రూ.70 కోట్ల నిధులతో భారీగా భవనాల నిర్మాణం చేపట్టాలని చూపించి మరో పోస్టును మంజూరు చేయించారు. దీంతో ఆలయంలో ప్రస్తుతం ఇద్దరు ఈఈలున్నారు. డీఈలు ముగ్గురున్నారు. ఏఈలు తొమ్మిది మంది ఉన్నారు.  వీళ్లుకాకుండా డ్రాఫ్ట్స్‌మన్‌, డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, ఫ్లంబర్లు సహా ఇతర ఉద్యోగులున్నారు. గత నాలుగైదేళ్లుగా ఆలయంలో ఒక్క భవన నిర్మాణం కట్టింది లేదు. 2016 తర్వాత నుంచి అన్నీ కూల్చేవే తప్ప.. నిలబెట్టేవే ఒక్కటీ లేవు. కేవలం చిన్న చిన్న మరమ్మతులు, గేట్లు మార్చడం, గోడలు కట్టడం.. ఇలాంటి వాటికే ఇంతమంది సిబ్బంది ఎందుకనేది అధికారులకే తెలియాలి. అప్‌హిల్‌ ఒకరు, డౌన్‌హిల్‌ ఒకరు అంటూ పనిని సృష్టించుకుని మరీ చాలామంది కాలయాపన చేస్తున్నారు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని