logo

జిల్లాను అగ్రగామిగా తీర్చిదిద్దుదాం

రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను పరిరక్షించుకుంటూ జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుదామని కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా అన్నారు. జిల్లా పోలీస్‌ పరేడ్‌ మైదానంలో గురువారం గణతంత్ర దినోత్సవం నిర్వహించారు.

Published : 27 Jan 2023 03:54 IST

గణతంత్ర దినోత్సవ సందేశంలో కలెక్టర్‌ రంజిత్‌ బాషా
కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే

జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్న కలెక్టర్‌, వందనం చేస్తున్న ఎస్పీ జాషువా

రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను పరిరక్షించుకుంటూ జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుదామని కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా అన్నారు. జిల్లా పోలీస్‌ పరేడ్‌ మైదానంలో గురువారం గణతంత్ర దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్‌ గౌరవ వందనాన్ని స్వీకరించిన కలెక్టర్‌ జాతీయ జెండాను ఎగరవేశారు. జిల్లాకు చెందిన ముఖ్య అధికారులు, జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక తదితరులు హాజరైన కార్యక్రమంలో ఆయన గణతంత్ర దినోత్సవ సందేశమిచ్చారు. జిల్లాకు చెందిన ఎందరో మహానుభావులు స్వాతంత్రోద్యమంలో అలుపెరగని పోరాటం చేశారని పేరుపేరునా కీర్తించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా వారిని స్మరించుకుంటున్నామన్నారు.

అలరించిన నృత్య ప్రదర్శన

రైతు సంక్షేమం కోసం చర్యలు

జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాల సంక్షేమం కోసం వివిధ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రైతు భరోసా, పీఎం కిసాన్‌ పథకం ద్వారా నాలుగు విడతలుగా జిల్లాలోని రైతులకు రూ.553 కోట్లు అందజేశామన్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన 16,572 మంది రైతులకు రూ.121 కోట్ల బీమా చెల్లించామన్నారు. జిల్లాలో 22-ఎ నుంచి దాదాపు 24 వేల ఎకరాలు తొలగించి రమారమి 12,000 మంది రైతులకు వారి భూములపై సర్వహక్కులు కల్పించామన్నారు. శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం ద్వారా చేపట్టిన సమగ్ర రీసర్వేను 100 గ్రామాల్లో పూర్తి చేశామన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా 54 లక్షల పనిదినాలు కల్పించి రూ.131 కోట్లు వేతనాలుగా చెల్లించామన్నారు. జలకళ పథకం ద్వారా 248 బోర్‌వెల్స్‌ తవ్వించి రైతుల జీవనోపాధికి ఊతమిచ్చామన్నారు. ఉపాధి హామీ అనుసంధానంతో రూ.250 కోట్ల అంచనాలతో చేపట్టిన సచివాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.

పేద వర్గాలకు ఉచితంగా మెరుగైన విద్య, వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో నాడు-నేడు కార్యక్రమం ద్వారా విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రూ.20.44 కోట్లతో ఆరు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఆధునిక వైద్య వసతులు అభివృద్ధి చేస్తున్నామని, రెండో విడతగా రూ.181 కోట్లతో 490 పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా గత నాలుగేళ్లలో 90 వేల మందికి రూ.202 కోట్లు ఖర్చు చేశామన్నారు. 84,614 పక్కా గృహాలు మంజూరు చేశామన్నారు.

గడప గడపకూ మన ప్రభుత్వం ద్వారా గుర్తించి ప్రతిపాదించిన ప్రాధాన్య పనులు కొనసాగుతున్నాయన్నారు. జిల్లా మొత్తం మీద 591 పనులు మంజూరు చేయగా 543 పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. మచిలీపట్నంలో రూ.550 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వైద్య కళాశాల, 670 పడకల సామర్ధ్యం ఉండే ఆసుపత్రి, రూ.421 కోట్లతో చేపట్టిన ఫిషింగ్‌ హార్బర్‌ ఆధునికీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో మచిలీపట్నం వైద్య కళాశాలలో 150 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి దోహదపడే పోర్టు నిర్మాణానికి అన్ని అనుమతులు లభించాయన్నారు. పోర్టు పనులు త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు