logo

విరిగిన బూట్లు.. చిరిగిన బ్యాగ్‌లు!

జగనన్న విద్యా కానుకలు మూన్నాళ్ల ముచ్చటగా మారాయి. ఏడాదంతా విద్యార్థులకు ఉపయోగపడాల్సినవి ఐదు మాసాలకే అక్కరకు రాకుండా పోయాయి.

Updated : 27 Jan 2023 12:40 IST

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే

గనన్న విద్యా కానుకలు మూన్నాళ్ల ముచ్చటగా మారాయి. ఏడాదంతా విద్యార్థులకు ఉపయోగపడాల్సినవి ఐదు మాసాలకే అక్కరకు రాకుండా పోయాయి. విద్యార్థులు పాడైన బూట్లు, చిరిగిన బ్యాగులతో అవస్థలు పడుతున్నారు. ఏకరూప దుస్తులు విద్యార్థుల సైజుకు తగ్గట్టుగా లేకపోవడంతో వాటిని ధరించి వచ్చిన విద్యార్థులు తరగతి గదుల్లో ఇబ్బందిగా కూర్చుకుంటున్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలో ఈ విద్యా సంవత్సరం జగనన్న విద్యా కానుకలు (జేవీకే) 1,19,752 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. ఒక్కో విద్యార్థికి మూడు జతల దుస్తులు, బూట్లు, సాక్సులు, పుస్తకాల బ్యాగు, రాత పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఒకటి, ఆరు తరగతులకు నిఘంటువులు ఇచ్చారు. పుస్తకాల బ్యాగులు చిన్నవిగా ఉన్నాయి. అందులో పాఠ్య పుస్తకాలు, రాత పుస్తకాలు పెట్టుకునేందుకు వీలు పడటం లేదని విద్యార్థులు వాపోతున్నారు. బూట్లు కూడా నాసిరకంగా ఉండటంతో కాళ్ల వేళ్లు కనిపించేలా చిరిగాయి. కొంతమంది విద్యార్థులు గత ఏడాది ఇచ్చిన పాత బూట్లు, కొందరు చెప్పులు ధరించి పాఠశాలలకు హాజరవుతున్నారు. నాడు-నేడు నిధులతో పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్న ప్రభుత్వం జేవీకే కిట్ల పంపిణీలో నాణ్యతను విస్మరించడంతో విద్యార్థులకు అవి ఇచ్చారన్న సంతోషం లేకుండా పోయింది. నందిగామ జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఆరో తరగతి విద్యార్థినులు ప్రియంక, రిత్విక ఈ ఏడాది తమకు ఇచ్చిన బూట్లు విరిగి పోయాయని ఆందోళన చెందారు. విద్యాకానుకలో బూట్లు, పుస్తకాల బ్యాగులు నాణ్యమైనవి ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

జగనన్న విద్యాకానుకలు నాణ్యమైనవే ఇచ్చారు. బూట్లు నాణ్యతగా లేవు. ఈసారి మంచివి ఇచ్చేలా చూస్తామని సమగ్ర శిక్షా సీఎంవో ఎల్‌.వెంకటేశ్వరరావు వివరణ ఇచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు