logo

ఇల్లు ఎలాగూ లేదు... కట్టిన డబ్బులూ ఇవ్వరా!

విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో ఉండే పేద ప్రజలకు పట్టణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(టిడ్కో)కు చెందిన ఇళ్లను ఇస్తామంటూ రూ.38.33 కోట్లను కట్టించుకున్నారు.

Published : 27 Jan 2023 03:54 IST

నగరపాలక సంస్థ చుట్టూ తిరుగుతున్న టిడ్కో బాధిత లబ్ధిదారులు
ఈనాడు, అమరావతి

విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో ఉండే పేద ప్రజలకు పట్టణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(టిడ్కో)కు చెందిన ఇళ్లను ఇస్తామంటూ రూ.38.33 కోట్లను కట్టించుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో పాటు లబ్ధిదారులు కూడా కొంత చెల్లించాలని చెప్పి.. 11,917మంది నుంచి దఫదఫాలుగా ఈ డబ్బులు కట్టించుకున్నారు. నగరంలో అద్దె ఇళ్లలో ఉంటూ ఒక్కో రూపాయి కూడబెడుతూ.. 2018 నుంచి దశల వారీగా ఈ డబ్బులను పేదలు చెల్లించారు. డబ్బులు కట్టించుకున్న వారిలో కొందరికే ఇళ్లను ఇచ్చారు. చాలామందికి ఇప్పటికీ ఇవ్వలేదు. ఇళ్లను ఇస్తారనే నమ్మకమూ ప్రస్తుతం లేదు. కనీసం తాము కట్టిన డబ్బులనైనా తిరిగి ఇచ్చేయాలంటూ లబ్ధిదారులు నగరపాలక సంస్థ చుట్టూ గత రెండేళ్లుగా తిరుగుతున్నారు. కానీ.. వారు కట్టిన డబ్బులను ఇచ్చేందుకు కూడా ప్రాధాన్యతా క్రమం అని చెబుతూ.. కొందరికి మాత్రమే తిరిగిచ్చారు. ఇప్పటికే చాలాసార్లు తమ డబ్బుల కోసం బాధితులు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఆందోళనలు సైతం చేశారు. అయినా.. వారి డబ్బులను ఇవ్వకుండా తిప్పుతూనే ఉన్నారు. ఇప్పటికీ మరో రూ.7 కోట్లకు పైగా బాధిత లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉంది.

విజయవాడ నగరంలోని తూర్పు, పశ్చిమ, మధ్య మూడు నియోజకవర్గాల్లో ఉన్న పేద వారికి సొంతింటి కల సాకారం చేసేందుకు గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లను మంజూరు చేశారు. లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. 300, 365, 430 చదరపు అడుగుల చొప్పున మూడు రకాల ఇళ్లను మంజూరు చేశారు. వీరిలో 300చ.అ ఇళ్లు వచ్చిన వారు రూ.500 చొప్పున కడితే సరిపోతుంది. 365చ.అ. ఇళ్ల కోసం రూ.50 వేలు చెల్లించాలి. 430చ.అ. ఇళ్లు మంజూరైన వాళ్లు మాత్రం రూ.లక్ష చెల్లించాలని చెప్పారు. ఇళ్ల కోసం అయ్యే ఖర్చులో కేంద్ర ప్రభుత్వం వాటా రూ.1.50లక్షలు, రాష్ట్రం రూ.2.40లక్షలు ఇస్తాయి. మిగతాది లబ్ధిదారులు చెల్లించాలి. బ్యాంకు రుణం కూడా కొంత తీసుకుని తర్వాత లబ్ధిదారులు దానిని కూడా చెల్లించుకోవాలని చెప్పారు. దీంతో నగరంలో తమ సొంతింటి కల సాకారం అవుతోందనే ఆనందం పేదల్లో కలిగింది. డబ్బులు అప్పులు చేసి తెచ్చి మరీ తమ వాటా కింద దఫదఫాలుగా చెల్లించారు. ఇలా డబ్బులు చెల్లించిన వారిలో కొందరికి ఇళ్లను మంజూరు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ఇక అక్కడి నుంచి లబ్ధిదారులకు కష్టాలు మొదలయ్యాయి. అటు ఇళ్లు కేటాయించకుండా.. ఇటు డబ్బులూ తిరిగి ఇవ్వకుండా వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు.


నగరంలో 15,112 మందిని ఎంపిక చేసి..    

విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో కలిపి 15,112 మందిని టిడ్కో ఇళ్ల కోసం ఎంపిక చేశారు. వీరిలో 11,917మంది రూ.38.33 కోట్లను తమ వాటా కింద చెల్లించారు. ఎక్కువగా 430చ.అ. ఇళ్ల కోసం డబ్బులు కట్టిన వాళ్లే ఉన్నారు. వీళ్లే 3790 మంది ఉన్నారు. ఒక్కొక్కరు రూ.50వేల నుంచి రూ.75 వేల వరకూ చెల్లించారు. అప్పులు చేసి, బంగారం తాకట్టు పెట్టి మరీ తెచ్చి ఈ డబ్బులను చాలామంది కట్టారు. కానీ.. వీరిలో ఇప్పటివరకూ కేవలం 6,576మందికి మాత్రమే ఇళ్లు కేటాయించారు. మరో 5,341మందికి ఇళ్లను ఇవ్వలేదు. ఇళ్లు రాని వారు కట్టిన డబ్బులు రూ.17.18కోట్లు. ఇళ్లు ఎలాగూ ఇవ్వలేదు.. కనీసం తమ డబ్బులైనా వెనక్కి ఇచ్చేయమంటూ పలుమార్లు ఆందోళనలకు దిగారు. కానీ.. ఆ డబ్బులు నగరపాలక సంస్థ దగ్గర లేవు. వీళ్లు డబ్బులను వసూలు చేసి వాటిని టిడ్కోకు చెల్లించారు. బాధితుల ఒత్తిడి పెరగడంతో రూ.10 కోట్ల వరకూ టిడ్కో నుంచి మూడు దశల్లో తీసుకొచ్చి బాధితులకు ఇచ్చారు. మొదట చెల్లించిన వారి ప్రాధాన్యతా క్రమం ప్రకారం వీటిని వెనక్కి ఇచ్చారు. మిగతా.. రూ.7.18కోట్లను మాత్రం ఇప్పటికీ ఇవ్వలేదు. కార్పొరేషన్‌ చుట్టూ వాటికోసం చక్కర్లు కొడుతున్నారు. టిడ్కో నుంచి తీసుకొచ్చి ఇస్తామంటూ అధికారులు చెబుతూ వస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని