logo

దేశభక్తి నింపిన ప్రదర్శనలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన అంశాలు ప్రతి ఒక్కరి మదిలో దేశభక్తిని నింపాయి.

Published : 27 Jan 2023 03:54 IST

భరతమాత, దేశ నాయకుల వేషధారణల్లో చిన్నారులు

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే : గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన అంశాలు ప్రతి ఒక్కరి మదిలో దేశభక్తిని నింపాయి. జిల్లా పోలీస్‌పరేడ్‌ గ్రౌండ్స్‌లో గురువారం నిర్వహించిన వేడుకల్లో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు పోటీపడుతూ చేసిన సాంస్కృతిక అంశాలు గణతంత్ర వేడుకల ప్రాధాన్యాన్ని తెలియజేశాయి. మోపిదేవి  రెసిడెన్షియల్‌ పాఠశాల విద్యార్థులు హిందీ దేశభక్తి గేయాలకు లయబద్ధంగా నృత్యం చేస్తూ ఆహుతుల మన్ననలు అందుకున్నారు. పెడన భట్ట జ్ఞాన కోటయ్య హైస్కూల్‌ విద్యార్థులు జగతి సిగలో జాబిలమ్మకు వందనం.. మాతరం.. ఐ లవ్‌ ఇండియా అంటూ దేశభక్తి గేయానికి నృత్యం చేశారు. మోపిదేవి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినులు కొండకోన నడుమ మల్లెలు అన్న జానపద గేయానికి ఏకరూప వస్త్రధారణతో చేసిన ప్రదర్శన అలరించింది. మచిలీపట్నంలోని బాలాజీ విద్యాలయం విద్యార్థులు వందేమాతరం, ఇకె బాలభాను విద్యాలయం వారు ఇండియావాలే గేయాలకు ప్రదర్శన ఇచ్చారు. ఇకె బాలభాను పాఠశాల, పెడన భట్టజ్ఞాన కోటయ్య హైస్కూల్‌, మోపిదేవి రెసిడెన్షియల్‌ పాఠశాల ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందుకున్నారు.

ఆకట్టుకున్న శకట ప్రదర్శనలు : గణతంత్ర దినోత్సవంలో భాగంగా మచిలీపట్నం జిల్లా పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ప్రకృతి విధానంలో సాగు చేసిన పంటలు, ఆర్బీకేలలో అందిస్తున్న సేవలతో శకటాన్ని తీర్చిదిద్దారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలు.. అందిస్తున్న సేవలను తెలియజేసేలా తీర్చిదిద్దిన శకటం ఆకట్టుకుంది. పాఠశాల విద్యాశాఖ, సమగ్రశిక్ష శకటంలో జగనన్న అమ్మఒడి, నాడు-నేడు పనులు, జగనన్న విద్యాకానుక ద్వారా ఒకగూరిన వసతులు, విద్యార్థులు చదువుకుంటున్న తీరు తెలియజేసేలా శకటం తీర్చిదిద్దారు. జిల్లా నీటియాజమాన్య సంస్థ శకటంలో డ్వామా ద్వారా అమలు చేస్తున్న పథకాలు తెలియజేసేలా తీర్చిదిద్దగా ఉపాధి పనుల్లో పాల్గొంటున్న వేతనదారులు కూడా శకటం వెనుక నడుస్తూ ప్రత్యేకతను చాటిచెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ, పాఠశాల విద్య శాఖ, సమగ్ర శిక్ష శకటం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) శకటాలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించాయి.
ఆకట్టుకున్న స్టాల్స్‌: వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ ఆకట్టుకున్నాయి. జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక, కలెక్టర్‌ రంజిత్‌బాషా, జేసీ అపరాజితాసింగ్‌, ఎస్పీ జాషువా తదితరులు స్టాల్స్‌ను సందర్శించారు. పశుసంవర్థకశాఖ స్టాల్‌ ప్రథమ, స్త్రీ శిశుసంక్షేమశాఖ స్టాల్‌ ద్వితీయ, జిల్లా గ్రామీణాభివృద్ధి స్టాల్‌ తృతియ బహుమతులు సాధించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని