logo

స్మార్ట్‌టౌన్‌ పథకం ఏమైంది?

మధ్యతరగతి వర్గాల వారికి సొంత ఇంటి కలను సాకారం చేస్తామని అందుబాటులోకి తెచ్చిన జగనన్న స్మార్ట్‌టౌన్‌ పథకం ఆదిలోనే ఆగిపోయింది.

Updated : 30 Jan 2023 05:15 IST

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

బందరు విహంగ వీక్షణం

ధ్యతరగతి వర్గాల వారికి సొంత ఇంటి కలను సాకారం చేస్తామని అందుబాటులోకి తెచ్చిన జగనన్న స్మార్ట్‌టౌన్‌ పథకం ఆదిలోనే ఆగిపోయింది. ఈ పథకంలో ఎన్ని మార్పులు చేసినా ఏదీ ఫలితం ఇవ్వకపోవడంతో చివరిసారిగా రియల్‌ ఎస్టేట్‌ ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించే ప్రయత్నం చేసినా అదీ బెడిసి కొట్టింది. ప్రభుత్వం ఇచ్చే ధరకు రైతులు భూములు ఇవ్వకపోవడం వాళ్లు చెప్పిన ధరకు కొని ప్లాట్లు విక్రయించలేమని భావించడంతో ప్రస్తుతం ఆ ఊసే ఎత్తడం లేదు.క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు చూస్తే ఈ పథకం ఆగిపోయినట్లే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఫలితమివ్వని ప్రయత్నాలు

ప్రతి నియోజకవర్గానికి ఒక టౌన్‌షిప్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. దీనిలో భాగంగానే  మచిలీపట్నం, పెడన, గుడివాడ, ఉయ్యూరు, వైఎస్సార్‌ తాడిగడపను తొలివిడతగా ఎంపిక చేశారు. బందరు మండల పరిధిలోని తపశిపూడి గ్రామ పరిధిలో 87.14 ఎకరాలు, పెడన మండల పరిధిలోని శింగరాయపాలెం ప్రాంతంలో 27.36 ఎకరాలను అధికారులు గుర్తించారు తపశిపూడిలో ఎకరం రూ.7.50లక్షలు, శింగరాయపాలెంలో ఎకరం రూ.8.50లక్షలు చొప్పున రిజిస్ట్రేషన్‌ విలువ ఉండగా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎకరాకు రూ.25లక్షల వరకు ఇవ్వడానికి అధికారులు సుముఖత వ్యక్తం చేసినా రైతులు ఎవరూ ముందుకురాలేదు. మిగిలిన ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొనడంతో రైతులు చెప్పిన ధరకు భూమి కొనుగోలుచేసి విక్రయించలేమని ఉన్నతాధికారులు భావించారు. అన్ని చోట్లా ఈ సమస్య ఉండడంతో ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ ఏజెన్సీలకు బాధ్యతలు కేటాయిస్తే ఫలితం ఉంటుందని ఆదేశించడంతో ముడ ఆధ్వర్యంలో ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. అభివృద్ధి చేసిన తరువాత 40 శాతం స్థలాలు ముడ ఆధ్వర్యంలో విక్రయించి, వచ్చిన మొత్తంలో 96శాతం ఏజెన్సీలకు ఇస్తామని, మిగిలిన 4శాతంలో 3 శాతం ముడ, ఒకశాతం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు ఇవ్వాలని చెప్పారు. 40శాతం ప్లాట్లు ముడ విక్రయించలేకపోతే తిరిగి సంబంధిత ఏజెన్సీలకే అప్పగిస్తామని చెప్పడంతోపాటు వివిధ రకాల నిబంధనలు విధించడంతో ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఏమీ చేయలేమని అధికారులు చేతులెత్తేశారు.

అటకెక్కినట్లేనా?

ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూసి ఈ పథకం అటకెక్కినట్లేనా అంటే అధికారవర్గాల నుంచి అవుననే సమాధానం వస్తుంది. ఏడాదికి రూ.3లక్షల నుంచి రూ.18లక్షల లోపు ఆదాయం కలిగిన వారు ఈ పథకంలో స్థలం కొనుగోలు చేసేందుకు అర్హులని ప్రకటించారు ఎంఐజీ-1లో 150 చదరపు గజాల స్థలం కొనుగోలు చేసేవారికి రూ.3లక్షల నుంచి రూ.6లక్షల వార్షిక ఆదాయం,  ఎంఐజీ-2లో 200 కు రూ.6లక్షల నుంచి రూ.12లక్షలు, ఎంఐజి-3లో 240 చదరపు గజాలకు రూ.12లక్షల నుంచి రూ.18లక్షల ఆదాయం కలిగి ఉండాలి. ఇలా మూడు కేటగిరీలకు దరఖాస్తులు ఆహ్వానించగా మొత్తం 9,700కుపైగా వచ్చాయి. వీరందరికీ అన్ని వసతులతో స్థలాలు కేటాయించాలంటే 808 ఎకరాలు భూమి అవసరం అవుతుందని అధికారులు లెక్కగట్టారు. ఇప్పటివరకు ఎక్కడా భూమి సేకరించని పరిస్థితి. మచిలీపట్న, పెడన, గుడివాడ పట్టణాల్లో భూమి గుర్తించినా ప్రతిపాదనల దశలోనే ఆగిపోయింది.


ప్రభుత్వానికి నివేదించాం

బి.శివనారాయణరెడ్డి, ముడ వీసీ

స్మార్ట్‌టౌన్‌ పథకంలో భాగంగా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పలు చోట్ల భూములు గుర్తించినా ధరలు ఎక్కువగా ఉండటంతో స్థల సేకరణ ప్రక్రియ ఆగిపోయింది. తరువాత డెవలప్పర్లు కూడా ముందుకు రాలేదు. కోడూరు మండలంలో టౌన్‌షిప్‌ ఏర్పాటుకు ఒకరు వచ్చారు. అక్కడ 23 ఎకరాలు భూమి ఉంది కానీ అది 22ఏలో ఉండటంతో సమస్య ఏర్పడింది. ముడ పరిధిలో మచిలీపట్నం, పెడన మాత్రమే ఉన్నాయి. గుడివాడ, ఉయ్యూరు, వైఎస్సార్‌ తాడిగడప సీఆర్‌డీఏ పరిధిలో ఉన్నాయి. ఈ పథకానికి సంబంధించి అన్ని అంశాలను ప్రభుత్వానికి నివేదించాం.దీనిపై విడుదల చేసే ఉత్తర్వుల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం.


 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు