ఆకర్షించి.. అడ్డంగా దోపిడీ
‘విమానాశ్రయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఇటీవల విజయవాడకు చెందిన 40 మంది యువకుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేశారు.
విమానాశ్రయాల్లో ఉద్యోగాలంటూ మోసం
ఐదారేళ్లుగా మోసపోతున్న యువత
ఈనాడు, అమరావతి
‘విమానాశ్రయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఇటీవల విజయవాడకు చెందిన 40 మంది యువకుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేశారు. దీంతో వారంతా సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా తాజాగా కేసు నమోదు చేసి దీనికి బాధ్యుడైన వ్యక్తిని అరెస్టు చేశారు. విమానాశ్రయాల్లో కార్గో మేనేజర్లుగా ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి దగ్గర రూ.50వేల నుంచి రూ.లక్షన్నర వరకూ వసూలు చేశారు. విమానాశ్రయాల్లో అత్యధిక జీతాలు వచ్చే ఉద్యోగాలున్నాయంటూ గాలం వేసి గత ఐదారేళ్లుగా విజయవాడ సహా చుట్టుపక్కల యువత నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చింది లేదు. అయినా ఎప్పటికప్పుడు యువత కొత్తగా మోసపోతూనే ఉన్నారు.’
గతంలో ఆన్‌లైన్‌లో ప్రకటనలు ఇచ్చి మోసం చేసేవారు. ప్రస్తుతం నగరంలో కేంద్రాలను సైతం తెరిచి యువతకు గాలం వేస్తున్నారు. ఇలాగే కొంతకాలం క్రితం విజయవాడకు చెందిన ఓ నిరుద్యోగ యువకుడి నుంచి ఏకంగా రూ.6లక్షలకు పైగా దోచుకున్నారు. ఇంజినీరింగ్ పూర్తయిన యువకుడిని పక్కాగా నమ్మించి మోసం చేశారు. ఆన్‌లైన్‌లో ఉద్యోగ ప్రకనట చూసి యువకుడు దరఖాస్తు చేసుకున్నాడు. మొదట ఫోన్ ఇంటర్వ్యూ అంటూ నమ్మించారు. ఎలాంటి అనుమానం రాకుండా ఇంటర్వ్యూ చేశారు. ప్యాకేజీ ఎంత కావాలని అడిగారు. యువకుడు ప్యాకేజీ ఎంతనేది చెప్పగానే ఆరంభంలో అంత రాదని, తర్వాత పెరుగుతుందని ఒప్పించారు. చివరికి మీరు ఎంపికయ్యారు. అపాయింట్‌మెంట్ లెటర్ పంపిస్తామంటూ చెప్పారు. వారం తర్వాత నిజంగానే అపాయింట్‌మెంట్ లెటర్‌ను ఒక ఎయిర్‌లైన్స్ సంస్థ పేరుతో పంపించారు. ఆ తర్వాత ఫోన్ చేసి.. గన్నవరం విమానాశ్రయంలోని తమ కార్యాలయాన్ని పలానా తేదీ వెళ్లి ఉద్యోగంలో చేరమంటూ చెప్పారు. ఉద్యోగం వచ్చేసిందని పూర్తిగా నమ్మేసిన తర్వాత దోచుకోవడం ఆరంభిస్తారు.
పక్కా ప్రణాళికతో.. డబ్బులను ముందుగానే అడిగితే అనుమానం వచ్చి ఎవరూ ఇవ్వరని తెలిసి చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగం వచ్చేసిందంటూ నమ్మించేందుకు అపాయింట్‌మెంట్ లెటర్ పంపించే వరకూ ఎలాంటి డబ్బులు తీసుకోకుండా నటిస్తారు. ఉద్యోగం వచ్చేసింది, తమ కష్టాలు తీరిపోయాయనే ఆనందంలో నిరుద్యోగులు ఉండగా.. అసలు దోపిడీ మొదలు పెడతారు. మీరు పలానా తేదికి ఉద్యోగంలో చేరే సమయానికి కనీసం మూడు నాలుగు జతల యూనీఫాం ఉండాలి. మీరు కుట్టించుకుంటారు కదా, లేదంటే మమ్మల్నే ఎయిర్‌లైన్స్ సంస్థ నుంచి పంపించమంటారా అని అడుగుతారు. అత్యధిక మంది యువత మీరే పంపించేయండి అంటూ కోరతారు. అయితే మీ కొలతలు పంపించండి అని నమ్మిస్తారు. పంపించాక దుస్తుల కోసం డబ్బులు ఇవ్వాలని చెబుతారు.
అప్పటికే పూర్తిగా నమ్మేసి ఉన్న యువత.. వారు అడిగిన మొత్తం పంపిస్తున్నారు. దాని తర్వాత రెండు మూడు రోజులకు.. మీకు ఐడీకార్డు, ప్రత్యేక డ్యూటీ కిట్ ఇవ్వాలి. దాని కోసం మీరు ముందుగా డబ్బులు పంపించాలని చెబుతారు. యూనీఫాం సహా అన్నింటికి సంబంధించిన ఫొటోలను వాట్సాప్‌లో పంపిస్తారు. ముందుగా ఎందుకు డబ్బులు కట్టాలని ఎవరైనా అడిగితే.. సంస్థ నిబంధనలు అలాగే ఉన్నాయ్, మీకు నచ్చితేనే పంపించండి.. లేదంటే మీరు ఇప్పటివరకూ కట్టిన డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేస్తామని నమ్మకంగా చెబుతారు. దీంతో ఇక్కడే చాలా మంది నమ్మేస్తుంటారు. వారు అడిగిన మొత్తాలను దఫదఫాలుగా పంపిస్తారు. ఇలా వీలైనంత ఎక్కువ యువత నుంచి పిండుకుని చివరికి వారికి ఏ ఫోన్‌లో అందుబాటులోకి వచ్చారో ఆ నంబర్‌ను స్విచ్ ఆఫ్ చేసేస్తున్నారు.
99% నకిలీ ప్రకటనలే..
గన్నవరం సహా దేశంలోని పలు విమానాశ్రయాలలో ఉద్యోగాలున్నాయంటూ ప్రముఖ వెబ్‌సైట్లలో ఆకర్షించే ప్రకటనలు ఇటీవల పెరిగిపోయాయి. విమానాశ్రయాల్లో స్వీపర్ల నుంచి టికెట్ కౌంటర్, స్టోర్ రూం, కార్గో మేనేజర్లు.. అంటూ రకరకాల ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఇస్తున్నారు. వీటిలో 99శాతం అన్నీ నకిలీవే. ఏదో ఒక ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థ పేరుతోనే దర్జాగా ఈ ప్రకటనలు పెడుతున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేదు. మీ డిగ్రీ ఉత్తీర్ణత ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎలాంటి దరఖాస్తు రుసుము కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పుడే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. ఆ తర్వాత ఇంటర్వ్యూకు హాజరైతే సరిపోతుందంటూ చూడగానే ఆకర్షించేలా ఈ ప్రకటనలు రూపొందిస్తున్నారు. అన్ని రకాల ఉద్యోగ సమాచారం అందించే ప్రముఖ వెబ్‌సైట్‌లలో వీటిని పెడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Cyber Crimes: టాస్క్ పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర హోంశాఖ
-
Parineeti-Raghav : ఒక్కటైన ‘రాగ్నీతి’.. లీలా ప్యాలెస్‌లో వైభవంగా వివాహం
-
Economy: దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో భాజపా ప్రభుత్వం విఫలం: కాంగ్రెస్
-
Tagore Movie: పాటలు వద్దన్న మురగదాస్.. అలా ఛాన్స్ దక్కించుకున్న వినాయక్
-
Manipur : మయన్మార్ సరిహద్దులో కొత్తగా 70కి.మీ మేర కంచె నిర్మాణానికి ప్రణాళిక : మణిపుర్ సీఎం
-
RBI: యథాతథంగానే వడ్డీరేట్లు.. నిపుణుల అంచనా..