logo

పొదుపు సొమ్ము పక్కదారి

మండలంలోని చోడవరం పోస్టాఫీసులో అవకతవకలు వెలుగు చూశాయి. పేద, మధ్య తరగతి ఖాతాదారులు కష్టపడి పొదుపు చేసిన రూ.లక్షలు మాయమయ్యాయి.

Published : 31 Jan 2023 04:15 IST

పాసు పుస్తకాల్లో నమోదైన వివరాలను పరిశీలిస్తున్న అధికారులు

చోడవరం(పెనమలూరు), న్యూస్‌టుడే: మండలంలోని చోడవరం పోస్టాఫీసులో అవకతవకలు వెలుగు చూశాయి. పేద, మధ్య తరగతి ఖాతాదారులు కష్టపడి పొదుపు చేసిన రూ.లక్షలు మాయమయ్యాయి. ఈ వ్యవహారంలో తపాలా మాస్టరు సన్యాసిరావు చేతివాటం చూపారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఖాతాదారులు చెల్లించిన మొత్తాలు పాసు పుస్తకాల్లో నమోదైనా ఆన్‌లైన్‌ ఖాతాలో నమోదు కాకపోవడం, గడువుతీరిన డిపాజిట్లకు చెల్లింపులు చేయకపోవడంతో పలువురు బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో తపాలా శాఖ సహాయ సూపరింటెండెంట్‌ ఎల్‌.దేవానంద్‌తోపాటు ఇతర అధికారులు సోమవారం చోడవరం వచ్చి విచారణ చేపట్టారు.

అన్ని ఖాతాలకూ విస్తరణ:  సేవింగ్స్‌ ఖాతా, రికరింగ్‌ డిపాజిట్లు, సుకన్య, బీమా తదితర ఖాతాలకు ఖాతాదారులు చెల్లించిన డబ్బులు తపాలా శాఖకు జమ చేయలేదని సమాచారం. పాసు పుస్తకాల్లో శాఖ ముద్ర వేసి ఆ మొత్తాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదు. దీంతో గల్లంతయిన పొదుపు సొమ్ము ఎంతనేది ఉన్నతాధికారులు శోధిస్తున్నారు. పోస్టుమాస్టరు సన్యాసిరావును విధుల నుంచి తప్పించి వీరు విచారణ ఆరంభించారు.

ఆయన రూటే వేరు..: పోస్టుమాస్టరు సన్యాసిరావు  ఉద్యోగం చోడవరంలో అయితే.. నిబంధనలకు విరుద్ధంగా ప్రసాదంపాడులో నివసిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తీరిక సమయాల్లోనే ఆయన కార్యాలయానికి వచ్చి కాలక్షేపం చేసేవారని పలువురు ఖాతాదారులు విచారణాధికారులకు ఫిర్యాదు చేశారు. తన పేరు సన్యాసిరావు కాగా.. ఖాతాదారులకు, గ్రామస్థులకు శీనయ్యగా ప్రచారం చేసుకొనేవారని వారు అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు.

తామంతా పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారమని, భవిష్యత్తు  అవసరాలకు పొదుపు చేసుకున్నామని, ఇక్కడ కూడా తమ సొమ్ముకు భద్రత లేకుంటే ఎలాగని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


రూ.25 లక్షలు మాయం..?  

ఈ కార్యాలయంలో దాదాపు వెయ్యి ఖాతాలుండగా సోమవారం నాటికి 200 మంది పాసు పుస్తకాల్లో నమోదైన మొత్తాలను విచారణాధికారులు ఆన్‌లైన్‌ ఖాతాలతో సరిపోల్చారు. దీంతో రూ.5 లక్షల వరకూ అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. ఈ మొత్తం రూ.25 లక్షలకు ఎగబాకే అవకాశం ఉంటుందని అనుమానిస్తున్నారు.


అవకతవకలు వాస్తవమే

దేవానంద్‌, విచారణాధికారి

చోడవరం తపాలా కార్యాలయంలో ఖాతాదారుల పొదుపు సొమ్ములో అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించాం. ఇప్పటి వరకు దాదాపు రూ.4.50 లక్షలు సొమ్ము ఆన్‌లైన్‌ ఖాతాల్లో జమ కాలేదు. ఈ మొత్తం పెరిగే అవకాశం ఉంది. ఈ విచారణ మరో వారం జరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు