logo

ఆధార్‌ నవీకరణ పర్యవేక్షణకు కమిటీ

జిల్లాలో పౌరుల ఆధార్‌ కార్డుల నవీకరణ (అప్‌డేట్‌)కు జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసినట్టు కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు తెలిపారు.

Published : 31 Jan 2023 04:15 IST

జిల్లా పేరు మార్చుకునే అవకాశం

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : జిల్లాలో పౌరుల ఆధార్‌ కార్డుల నవీకరణ (అప్‌డేట్‌)కు జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసినట్టు కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. ఈ కమిటీ సమావేశాన్ని నగరంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించారు. కలెక్టర్‌ అధ్యక్షుడిగా ఉండే ఈ కమిటీలో.. జిల్లా పోలీసు కమిషనర్‌, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌, డీఆర్వో, డీఈవో, డీపీవో, డీఎంహెచ్‌వో, ఐసీడీఎస్‌, డ్వామా, డీఆర్డీఏ పీడీలు, ఇతర జిల్లా అధికారులు సభ్యులుగా ఉంటారు. సదరు కమిటీ ఆధార్‌ అప్‌డేట్‌పై ప్రతి మూడు నెలలకోసారి సమీక్షించాల్సిన అవసరం ఉందని కలెక్టర్‌ సూచించారు. 5 నుంచి 7, 15 నుంచి 17 సంవత్సరాల వయసు లోపు వారికి అప్‌డేట్‌ ఉచితమన్నారు. కృష్ణా జిల్లాను పునర్విభజన చేసిన క్రమంలో.. కృష్ణా జిల్లా పేరుకు బదులు ఎన్టీఆర్‌ జిల్లాగా మార్చుకోవచ్చని చెప్పారు. ప్రభుత్వ పథకాలు, ఇతర సౌకర్యాలు పొందడానికి ఆధార్‌ అవసరమన్నారు. తపాలా కార్యాలయాలు, బ్యాంకులు, సచివాలయాలు, విద్య, వైద్య ఆరోగ్య శాఖల్లో ప్రత్యేక ఆధార్‌ కేంద్రాల ద్వారా అప్‌డేట్‌ చేసుకునే సౌకర్యం కల్పించినట్టు తెలిపారు. ఇతర వివరాలకు టోల్‌ ఫ్రీ నంబరు 1947కు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చని సూచించారు. సమావేశంలో గ్రామ/వార్డు సచివాలయాల జిల్లా అధికారిణి కొడాలి అనూరాధ, డీపీవో జె.సునీత, డీఈవో సి.వి.రేణుక, ఐసీడీఎస్‌, డీఆర్డీఏ పీడీలు జి.ఉమాదేవి, కె.శ్రీనివాస్‌, ఎల్డీఎం కోటేశ్వరరావు, డీఎంహెచ్‌వో ఎం.సుహాసిని, ఆధార్‌ ప్రాంతీయ కార్యాలయ సహాయ మేనేజర్‌ వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని