logo

అధికారులు అవమానించారంటూ

నందిగామ నగర పంచాయతీ కౌన్సిల్‌ బడ్జెట్‌ సమావేశంలో ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు సమక్షంలోనే అధికార వైకాపాకు చెందిన ఛైర్‌పర్సన్‌ మండవ వరలక్ష్మి విలపించారు.

Published : 31 Jan 2023 04:15 IST

వైకాపా ఛైర్‌పర్సన్‌ కన్నీరు

విలపిస్తున్న వరలక్ష్మి

నందిగామ నగర పంచాయతీ కౌన్సిల్‌ బడ్జెట్‌ సమావేశంలో ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు సమక్షంలోనే అధికార వైకాపాకు చెందిన ఛైర్‌పర్సన్‌ మండవ వరలక్ష్మి విలపించారు. తనను అధికారులు ప్రతిసారీ అవమానిస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. తానంటే లెక్కలేని తనంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు అజెండా కాపీ కూడా ఇవ్వలేదంటూ బడ్జెట్‌ సమావేశాన్ని వాయిదా వేశారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె ఇటీవల కొద్దిగా కోలుకున్నారు. వీల్‌ఛైర్‌లోనే సమావేశాలకు వస్తున్నారు. అజెండా అందకపోవడంతో తొలుత సమావేశానికి గైర్హాజరు కావాలనుకున్నారు. అనంతరం ఆలస్యంగా వచ్చిన ఆమె అధికారుల తీరుపై మండిపడ్డారు. సోమవారం ఛైర్‌పర్సన్‌ వరలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి అధ్యక్షతన వహించి కొనసాగించాలని కమిషనర్‌ జయరాం ఆమెను కోరారు. తనకు అజెండా కాపీ ఇవ్వనందున సమావేశం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో తెదేపా కౌన్సిలర్లు బయటికి వెళ్లిపోయారు. కమిషనర్‌ మాట్లాడుతూ ఛైర్‌పర్సన్‌ అనుమతితోనే సమావేశం ఏర్పాటు చేశామని, అజెండా పంపించామని తెలిపారు. తనకు ఇవ్వకుండా ఇచ్చినట్లు చెప్పవద్దని ఆమె అసహనం వ్యక్తం చేశారు. కమిషనర్‌ సంబంధిత ఉద్యోగులను వివరణ అడిగారు. ఛైర్‌పర్సన్‌ తల్లికి ఇవ్వబోతే తీసుకోలేదని, ఆమె భర్తకు ఫోన్‌ చేస్తే తీయలేదని ఉద్యోగులు తెలిపారు. వెంటనే ఎమ్మెల్యే స్పందించి కమిషనర్‌, ఉద్యోగులతో మాట్లాడారు. బాధ్యులైన ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తామని ప్రకటించారు. వైకాపా కౌన్సిలర్లు పాకాలపాటి కిరణ్‌, కో ఆప్షన్‌ సభ్యుడు ఎమ్‌వై దాస్‌, యాకూబ్‌అలీ మాట్లాడుతూ అజెండా ఇవ్వకపోవడం తప్పేనని, బడ్జెట్‌ సమావేశం కాబట్టి నిర్వహించాలని కోరారు. సమావేశం ఏర్పాటుకు ఛైర్‌పర్సన్‌ అంగీకరించినా తెదేపా కౌన్సిలర్లు వెళ్లిపోయినందున చట్టప్రకారం నిర్వహించలేమని కమిషనర్‌ వెల్లడించారు. దాంతో సమావేశాన్ని వాయిదా వేశారు.

నందిగామ, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని