logo

వైకాపా నాయకుల వేధింపులు... తెదేపా కార్యకర్త ఆత్మహత్యాయత్నం

వైకాపా నాయకుల వేధింపులు భరించలేక చనిపోతున్నానంటూ తెదేపా కార్యకర్త సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు.

Published : 31 Jan 2023 04:15 IST

 

పురుగుల మందు డబ్బాతో విజయ్‌

కంచికచర్ల, న్యూస్‌టుడే: వైకాపా నాయకుల వేధింపులు భరించలేక చనిపోతున్నానంటూ తెదేపా కార్యకర్త సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఆత్మహత్యాయత్నానికి ముందు అతను తన ఆవేదనను సెల్ఫీ వీడియోలో రికార్డు చేశారు. ప్రస్తుతం అతను ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుడి వివరాల మేరకు.. కీసర గ్రామానికి చెందిన యరగొర్ల విజయ్‌ తెదేపా కార్యకర్త. ఏడాది క్రితం గ్రామంలో జరిగిన ఓ గొడవలో అదే గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు పరిటాల రాము వర్గీయులు ఎస్సీ మహిళను దుర్భాషలాడారు. పోలీసులు రాము వర్గీయులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఆ కేసు వెనుక విజయ్‌ ఉన్నాడనే నెపంతో అతనిపై రాము కక్ష పెంచుకున్నారు. విజయ్‌తో పాటు అతని వర్గీయులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారు. దాన్ని రాజీ చేసుకోవాలని వైకాపా నాయకుడు పరిటాల రాము అతని సోదరుడు నూకార్జున కలిసి విజయ్‌ని కొన్ని నెలలుగా మానసికంగా వేధిస్తున్నారు. పలువురిని ఇంటిపైకి తీసుకొచ్చి దాడులు చేయిస్తున్నారు. మూడు రోజుల నుంచి తనకు ఫోన్‌ చేసి నీ మీద, మీ తమ్ముడి మీద రౌడీషీట్‌ తెరిచామని, పోలీసుస్టేషన్‌కు వచ్చి సంతకాలు చేయాలని కంచికచర్ల పోలీసులు వేధిస్తున్నారని విజయ్‌ తన సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. పరిటాల రాము అండతో పోలీసులు నేరం చేసిన వారిని వదిలేసి తన మీద అక్రమంగా కేసులు బనాయించి దౌర్జన్యానికి తెగపడుతున్నారని ఆవేదన వెల్లగక్కారు. స్టేషన్‌కు వెళ్లి తన మీద ఎందుకు రౌడీషీట్‌ పెట్టారని ప్రశ్నించగా.. మేము చేసేది ఏమీ లేదని, ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్నామని పోలీసులు బదులిచ్చారని వాపోయారు. సెల్ఫీ వీడియో తీసి స్నేహితులకు పంపి గ్రామ సమీపంలోని ఓ వెంచర్‌లో వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగారు. అప్రమత్తమైన స్నేహితులు వెంటనే అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని అంబులెన్సులో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎస్సై పి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విజయ్‌పై ఇప్పటికే రెండు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, రెండు వాల్టా కేసులు ఉన్నాయని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అతనిపై రౌడీషీట్‌ తెరిచామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని