logo

పింఛన్ల రద్దు.. నీటి మీటర్లపై పోరాటం

విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సర్వసభ్య సమావేశం మంగళవారం ఉదయం నుంచి జరగనుంది. దాదాపు 128 అంశాలను సభ ముందు చర్చకు తెస్తున్నారు.

Published : 31 Jan 2023 04:15 IST

సిద్ధమవుతున్న విపక్షాలు
నేడు కౌన్సిల్‌ సమావేశం
విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే

విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సర్వసభ్య సమావేశం మంగళవారం ఉదయం నుంచి జరగనుంది. దాదాపు 128 అంశాలను సభ ముందు చర్చకు తెస్తున్నారు. పలు సమస్యలు, ప్రజలపై భారాలు,  పన్నులు, తదితర అంశాలపై ప్రశ్నించేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ప్రధానంగా నగరంలోని అత్యధిక డివిజన్లలో ఇటీవల తొలగించిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు సంబంధించి వేలాది సామాజిక పింఛన్లపై తేదేపా, సీపీఎం పక్షాలు అభ్యంతరాలు, నిరసనలు వ్యక్తం చేయనున్నాయి. దీనిపై ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు. మరోవైపు నగరంలో ఏర్పాటు చేస్తున్న నీటిమీటర్ల ద్వారా అధికంగా నీటిపన్ను వసూళ్లు, చెత్తపన్ను, లబ్ధిదార్లకు టిడ్కో ఇళ్ల అప్పగింత, నిలిచిపోయిన అభివృద్ధి పనులు, పరిష్కారానికి చోచుకోని ప్రజా సమస్యలపై గళమెత్తతున్నాయి. పాలక పక్షం సైతం విపక్షాలను కౌన్సిల్లో నిలువరించేందుకు, అడ్డుకునేందుకు యత్నిస్తోంది.

అజెండాలో 128 అంశాలు

నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సర్వసభ్య సమావేశంలో ప్రధాన ఎజెండా కింద 112 అంశాలు, అదనపు అజెండా కింద మరో 16 అంశాలు ప్రవేశపెడుతున్నాయి. మరిన్ని అంశాలు 88 జె, 88కె కింద కమిషనర్‌, స్థాయీ సంఘం సభ్యుల ద్వారా కౌన్సిల్‌ ముందుకు తెచ్చే వీలుంది.  అధికార, విపక్షాల సభ్యులు, ప్రత్యేక కమిటీలు ఆమోదించిన ప్రతిపాదనలనూ ప్రవేశపెట్టనున్నారు.

ఇవీ ప్రతిపాదనలు

నగరంలోని రెండు ప్రాంతాల్లో బీవోటి పద్దతిన 20 ఏళ్ల కిందట నిర్మించిన మరుగుదొడ్లను సులభ్‌ ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌కు మరో 20 ఏళ్లపాటు నామినేషన్‌ పద్ధతిన అప్పగించడం.

నగరపాలక సంస్థ పరిధిలో నీటిసరఫరా నిర్వహణ విధానాన్ని పర్యవేక్షిస్తున్న ప్రయివేటు సంస్థకు స్కాడా విధానాన్ని మరో ఏడాదిపాటు పునరుద్ధరించే ప్రతిపాదన.

సీవీఆర్‌ పైవంతెన నుంచి చిట్టినగర్‌ జంక్షన్‌ వరకు  15వ ఆర్థిక సంఘం నిధులు రూ.3 కోట్లతో చేపట్టాల్సిన ఫుట్‌పాత్‌లు, ఫేవర్‌ బ్లాక్సు నిర్మాణాలకు  గుత్తేదార్లు ఎవరూ రాకపోవడంతో ఆ పనులను రద్దుచేసి, ప్రత్యామ్నాయంగా అదే వ్యయంతో గొల్లపూడి బైపాస్‌ రహదారికి రెండువైపులా పుట్‌పాత్‌, ఫేవర్‌ బ్లాక్సు పనులు చేపట్టేందుకు ముందస్తు అనుమతి పొందడం.

బుడమేరు కెనాల్‌ అభివృద్ధికి మంజూరు చేసిన నిధుల నుంచి చేపట్టాల్సిన వివిధ పనులకు బదులుగా మధ్యనియోజకవర్గంలో ప్రత్యామ్నాయంగా ఆర్‌సిసి డ్రెయిన్ల నిర్మాణం.

నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో 9 అంతస్తుల భవన నిర్మాణం మధ్యలో నిలిచిపోగా, ఇప్పటి వరకు పూర్తిచేసిన రెండు అంతస్తుల్లోకి వివిధ విభాగాలను తరలించేందుకు వీలుగా అవసరమైన పనులు రూ.1.99 కోట్లతో చేపట్టడం.

మున్సిపల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌ ఎం.మనోహర్‌రెడ్డి పదవీకాలాన్ని తిరిగి పొడిగించేలా ప్రభుత్వం తాజాగా జారీచేసిన జీవోను కౌన్సిల్లో రికార్డు చేయడం.

పార్కింగ్‌ స్థలాల కేటాయింపు, ఎర్రకట్ట బ్రిడ్జి మరమ్మతులు, వాహనడిపోలో మరుగుదొడ్ల నిర్మాణం, పుడ్‌కోర్టులో నిజమైన లబ్ధిదార్లకు దుకాణాల కేటాయింపు, బీపీఎస్‌ పథకం పునరుద్ధరణకు ప్రభుత్వం ద్వారా చర్యలు, కార్మికులకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ విధానంలో మస్తరు నిలుపుదల తదితర ప్రతిపాదనలు ప్రవేశపెట్టనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని