logo

చిత్ర వార్తలు

విజయవాడలో 1997-98 మధ్యకాలంలో దాదాపు రూ.17 లక్షలు వెచ్చించి నాటి వామపక్ష పాలకులు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన 30 అడుగులకు పైగా ఎత్తైన మహాత్మాగాంధీ విగ్రహం నేడు నగర పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా ధ్వంసమవుతోంది.

Published : 31 Jan 2023 04:15 IST

మహాత్మా.. మన్నించుమా..!

విజయవాడలో 1997-98 మధ్యకాలంలో దాదాపు రూ.17 లక్షలు వెచ్చించి నాటి వామపక్ష పాలకులు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన 30 అడుగులకు పైగా ఎత్తైన మహాత్మాగాంధీ విగ్రహం నేడు నగర పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా ధ్వంసమవుతోంది. రాజీవ్‌గాంధీ పార్కులో పిచ్చిమొక్కలు, పొదల్లో ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ అత్యంత దయనీయ స్థితిలో ఉంది.  అన్నా హజారేతో పాలకులు ఆవిష్కరింపజేశారు.తర్వాత కనకదుర్గ పైవంతెన నిర్మాణానికి ఈ భారీ విగ్రహం అడ్డుగా ఉందని, తొలగించి రాజీవ్‌గాంధీ పార్కులో పడేశారు. దీనిని పునఃప్రతిష్ఠించాలని సీపీఎం పక్షం నుంచి కౌన్సిల్లో మూడు సార్లు ప్రతిపాదనలు పెట్టారు. ఫలితం లేకుండా పోయింది.

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే


పదవి ఆమెది.. పెత్తనం ఆయనది

ఎంపీపీ సీటులో కూర్చొని ఆదేశాలు జారీ చేస్తున్న ఆమె భర్త అచ్యుతరావు

హిళలు ప్రజాప్రతినిధులుగా ఉంటే పాలనలో భర్తలు లేదా కుటుంబ సభ్యుల జోక్యాన్ని అనుమతించబోమని రాష్ట్ర ప్రభుత్వం గతంలో పలుసార్లు స్పష్టం చేసినా క్షేత్రస్థాయిలో మాత్రం భిన్న పరిస్థితులు కన్పిస్తున్నాయి. వైకాపా నుంచి ఎన్నికైన ఎంపీపీ రాజులపాటి వాణి నెలలో రెండు మూడ్రోజులు మాత్రమే తమ సీట్లో కన్పిస్తారు. ఇక మిగిలిన రోజుల్లో ఆమె భర్త, మండల పరిషత్తు ప్రత్యేక ఆహ్వానితుడు(నామినేటెడ్‌ పదవి) రాజులపాటి అచ్యుతరావు ఎంపీపీ సీట్లో కూర్చొని అధికారులు, ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేస్తుంటారు. మహిళా ప్రజాప్రతినిధి స్థానంలో ఆమె భర్త పాలన సాగించటం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.

పెడన, న్యూస్‌టుడే


సీఎం కాన్వాయ్‌లో తుప్పు పట్టిన  వాహనం

సీఎం కాన్వాయ్‌ ముందు ఎస్కార్ట్‌గా వచ్చిన ట్రాఫిక్‌ సీఐ వాహనం

సీఎం కాన్వాయ్‌కి ముందు ఎస్కార్ట్‌గా ఉన్న ట్రాఫిక్‌ సి.ఐ. వాహనం పరిస్థితి చూడండి. పైకప్పు మొత్తం తుప్పు పట్టి చాలావరకు పట్టు వదిలేసింది. కొన్ని చోట్ల కన్నాలు పడ్డాయి. దానిని సీఎం ఎస్కార్ట్‌ వాహనంగా ట్రాఫిక్‌ పోలీసులు వాడుతున్నారు. సోమవారం తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్తున్న సీఎం కాన్వాయ్‌కి ఎస్కార్ట్‌గా వచ్చి కేసరపల్లి దగ్గర ఆగిన ఆ వాహనాన్ని చూసిన స్థానికులు అవాక్కయ్యారు. అదే బండి సామాన్యుడిదైతే పోలీసులు ఎలా వ్యవహరిస్తారో తెలిసిందే కదా అని గుసగుసలాడుకున్నారు.

ఈనాడు, అమరావతి


మరుగన్నారు... మూసేశారు

హిరంగ మలమూత్ర విసర్జన నిరోధంలో భాగంగా విజయవాడలో చాలాచోట్ల రహదారుల పక్కన ఇలా ప్రైవేటు సహకారంతో మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. చాలాచోట్ల ప్రారంభించకుండానే వదిలేశారు. మరికొన్ని నీటి సదుపాయం, నిర్వాహణ లేకపోవడంతో దిష్టిబొమ్మల్లా మిగిలిపోయాయి. వీటిలోపల సామగ్రి దొంగలపాలవ్వడం, వినియోగించడానికి వెళ్లిన ప్రజలకు నీటిసదుపాయం లేకపోవడంతో దుర్గందభరితంగా మారాయి. విచిత్రంగా అడ్డుగా ఇనుపగడ్డర్లు, ముళ్లకంపలు వేసి మూసేస్తున్నారు..!

ఈనాడు, అమరావతి


వాడుకున్నారు.. వదిలేశారు!

విజయవాడ ఐజీఎంసీ మైదానంలో జనవరి 26వ తేదీన గణతంత్ర వేడుకలు నిర్వహించారు. 5 రోజులైనా.. మైదానాన్ని శుభ్రం చేయక పోవడంతో క్రీడాకారులు ఆడుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. మైదానం లోపల, వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌ కోర్టుల వద్ద, వాకింగ్‌ ట్రాక్‌లో చెత్త గుట్టలుగా ఉంది. వాటి పక్కనే
ఆడుకోవాల్సి వస్తోంది. పైపులైన్‌ లీకేజీతో నడక దారిలో నీరంతా చేరి.. క్రీడాకారులు పరిగెత్తడానికి వీలు లేకుండా మారింది.

ఈనాడు, అమరావతి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు