logo

స్థలాన్ని స్వాధీనం చేసుకున్న సిద్ధార్థ అకాడమీ

 విజయవాడ నగర శివారు ప్రాంతాల్లో కబ్జాల పర్వం పతాక స్థాయికి చేరింది. భూముల విలువ రూ.కోట్లకు చేరడంతో నకిలీ డాక్యుమెంట్లు, తప్పుడు ధ్రువపత్రాలతో కబ్జారాయుళ్లు దందాలకు పాల్పడుతున్నారు.

Published : 01 Feb 2023 05:10 IST

పెనమలూరు, కానూరు, న్యూస్‌టుడే:  విజయవాడ నగర శివారు ప్రాంతాల్లో కబ్జాల పర్వం పతాక స్థాయికి చేరింది. భూముల విలువ రూ.కోట్లకు చేరడంతో నకిలీ డాక్యుమెంట్లు, తప్పుడు ధ్రువపత్రాలతో కబ్జారాయుళ్లు దందాలకు పాల్పడుతున్నారు. ఇందుకు తాడిగడప వందడుగుల రహదారిలో తాజాగా వెలుగు చూసిన ఈ వ్యవహారమే తార్కాణం. కానూరు వీఆర్‌ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాల చెంతనే సిద్ధార్థ అకాడమీకి చెందిన రూ.కోట్ల విలువైన స్థలం పరులపరం కాగా.. దానిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఆ సంస్థవారు నానా తంటాలు పడాల్సి వచ్చింది.

తాడిగడప 100 అడుగుల రోడ్డులోని కానూరు పరిధి సిద్ధార్థ అకాడమీకి రెండు వేల గజాల స్థలం ఉంది. ఇది బందరు రోడ్డుకు దగ్గరగా, వందడుగుల రహదారికి పక్కనే ఉండడంతో దీని విలువ రూ.కోట్లకు చేరింది. సంస్థ భవిష్యత్తు అవసరాలకు ఈ స్థలాన్ని కొనుగోలు చేసింది. కొన్నేళ్ల నుంచి ఇక్కడ పిచ్చిచెట్లు, కంపలు పెరిగిపోవడంతో ఈ స్థలంపై కబ్జాదారుల కన్ను పడింది. ఈ క్రమంలో ఆ స్థలం తమదేనంటూ కబ్జాదారులు ఏకంగా బోర్డు కూడా ఏర్పాటు చేయడంతో అకాడమీ ప్రతినిధులు అప్రమత్తమయ్యారు. తమ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసి రక్షణగోడ నిర్మించుకోవడానికి సహకరించాలని కోరారు. దీని స్థల యాజమాన్యానికి సంబంధించిన దస్తావేజులు, లింక్‌ డాక్యుమెంట్లను పోలీసులకు చూపించారు. అనంతరం ఆక్రమణపాలైన స్థలాన్ని సిద్ధార్థ అకాడమీ ప్రతినిధులు వారం క్రితం తిరిగి స్వాధీనం చేసుకున్నారు. స్థలాన్ని శుభ్రపరిచి మెరక చేయించారు. ఈ స్థలాన్ని విద్యార్థులకు ఆటస్థలంగా తీర్చిదిద్దనున్నట్లు అకాడమీ ప్రతినిధులు మంగళవారం తెలిపారు. ఆక్రమణదారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.


రెవెన్యూ అధికారులకు పంపుతున్నాం

సిద్ధార్థ అకాడమీ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు సంబంధిత వివరాలను, ఇరువర్గాలకు చెందిన డాక్యుమెంట్లను పరిశీలనకు రెవెన్యూ అధికారులకు పంపుతున్నాం. వారి నుంచి తగిన నిర్ణయం వచ్చిన అనంతరం తప్పు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
గోవిందరాజు, సీఐ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని