logo

నగరం పక్కనే మసాజ్‌ కేంద్రాలు

మళ్లీ స్పాల పేరుతో మసాజ్‌ కేంద్రాల తలుపులు తెరుస్తున్నారు. నగరం పరిధిలోనే కాదు.. గతంలో ఇక్కడ కేసులు ఎదుర్కొన్న నిందితులు మారు పేర్లతో పక్క జిల్లా పరిధిలో తలుపులు తెరిచారు.

Updated : 01 Feb 2023 07:02 IST

కొత్తగా ఏర్పాటుకు ఉన్నత స్థాయి పైరవీలు
ఈనాడు, అమరావతి

గతంలో ఓ సెంటర్‌లో పోలీసుల విచారణ

మళ్లీ స్పాల పేరుతో మసాజ్‌ కేంద్రాల తలుపులు తెరుస్తున్నారు. నగరం పరిధిలోనే కాదు.. గతంలో ఇక్కడ కేసులు ఎదుర్కొన్న నిందితులు మారు పేర్లతో పక్క జిల్లా పరిధిలో తలుపులు తెరిచారు. ఇటీవల కాలంలో పదుల సంఖ్యలో ఇవి ఏర్పాటయ్యాయి. విజయవాడ కమిషనరేట్‌ పరిధి నుంచి తప్పించుకునేందుకు పక్కనే ఉన్న కృష్ణా జిల్లాకు తరలిపోయాయి. ఇటీవల జరిగిన దాడుల నేపథ్యంలో స్పా యజమానులు అసోసియేషన్‌గా ఏర్పడి ఉన్నత స్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. జిల్లా పోలీసు కమిషనర్‌పై తీవ్రస్థాయిలోనే ఒత్తిడి వచ్చినట్లు తెలిసింది. అయినా అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించారు. కొన్ని తిరిగి ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.

విజయవాడ నగరంలో స్పాల పేరుతో విచ్చలవిడిగా హైటెక్‌ వ్యభిచారానికి తెరతీసిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌లోనే స్లాట్‌లు నమోదు చేసుకొని విటులను ఆకిర్షించేవారు. దీనిపై ఉన్నతాధికారులకు తరచూ ఫిర్యాదులు వెళ్లాయి. పటమట పోలీసుస్టేషన్‌ పరిధిలో అమాయక యువతలను మాయమాటలతో మోసగించి వారిని ఈ రొంపిలోకి దించుతున్న విషయం వెలుగు చూసింది. దీంతో గతేడాది వరుసగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు విజయవాడ నగరంలో దాడులు చేశారు. జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావుకు ప్రజా విజ్ఞప్తుల దినం రోజున ఫిర్యాదులు అందేవి. ఆయన కూడా స్పా సెంటర్లపై సమీక్ష జరిపి పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు. నగరంలో దాదాపు 90 స్పాసెంటర్లు ఉండేవి. కేవలం మసాజ్‌ పేరుతో ఇవి వెలిశాయి. బ్యూటీ సెలూన్ల రూపంలో, యూనిసెక్సు సెలూన్‌ రూపంలో మరో 100 వరకు అనధికారికంగా ఉండేవి. బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, పటమట ప్రాంతం, గుణదల ప్రాంతంలో మసాజ్‌ సెంటర్లు స్పాల పేరుతో ఏర్పాటయ్యాయి. ఈ మాటున విచ్చలవిడిగా వ్యభిచారం చేసేవారు. టాస్క్‌ఫోర్సు వరుసగా దాడులు చేసి ఆధారాలతో సైతం పట్టుకున్నారు. మొగల్రాజపురం ప్రాంతంలో ఖరీదైన మసాజ్‌ సెంటర్లు స్పాల పేరుతో నడిచాయి. టాస్క్‌ఫోర్సు పోలీసులు పలువురు యువతులను ఈ బంధీఖానాల నుంచి విడుదల చేశారు. కలెక్టర్‌ వీటికి అనుమతులను కఠినతరం చేశారు. తప్పనిసరిగా వీఎంసీ, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ, కార్మిక శాఖ, పోలీసుల అనుమతులు ఉండేలా షరతులు విధించారు. ప్రతి రోజూ విధిగా పోలీసులు తనిఖీలు చేయాలని నిర్ణయించారు. ఆయా ప్రాంతాల తహసీల్దార్లను బాధ్యులుగా చేశారు. దీంతో చాలా వరకు మూతపడ్డాయి.

టాస్క్‌ఫోరుపెద్దఎత్తున పెట్టుబడులు తనిఖీలు తగ్గాయ్‌..!

నగరంలో టాస్క్‌ఫోర్సు తనిఖీలు తగ్గాయి. గతంలో పెనమలూరు, గన్నవరం వరకు తనిఖీలు చేసేవారు. ప్రస్తుతం కృష్ణా జిల్లా పోలీసు శాఖ పరిధిలో ఉండడంతో టాస్క్‌ఫోర్స్‌ పట్టించుకోవడం లేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో మసాజ్‌ సెంటర్లు నడుస్తున్నాయి.
విజయవాడ నగరం కమిషనరేట్‌ పరిధి నుంచి తప్పించి ఇతర ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. పక్కనే కృష్ణా జిల్లా ఏర్పాటైంది. కానూరు ప్రాంతంలో నూతన సంవత్సరం రోజునే పదుల సంఖ్యలో స్పాలు ఏర్పాటు చేశారు. కొత్తగా మసాజ్‌ సెంటర్లు ప్రారంభించారు. పెనమలూరు పోలీసుస్టేషన్‌ పరధిలో ఉంటాయి. కానూరు, తాడిగడప, పోరంకి, పెనమలూరు ప్రాంతంలో ఇవి ఏర్పాటు అవుతున్నట్లు తెలిసింది. ఇక్కడ పోలీసులకు స్పా సెంటర్లుగా సమాచారం ఇచ్చి మసాజ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిపై నిఘా లోపించింది. దీంతో ఖాతాదారులు ఇటువైపు మళ్లారు. కానూరు, తాడిగడప సాంకేతికంగా కృష్ణా జిల్లాలోనే ఉన్నా విజయవాడ నగర వాతావరణం, నగరంలో కలిసి ఉన్నట్లు ఉంటుంది. దీంతో పెద్దగా వ్యాపారంలో తేడా లేదని తెలిసింది. విజయవాడ నగరంలోనూ కొంత మంది ప్రయత్నాలు చేస్తున్నారు. కొంత మంది అధికార పార్టీ నేతల అనుచరులుగా ఉన్న యువకులు వీటి ఏర్పాటుకు లాబీయింగ్‌ చేస్తున్నారు. పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టి ఆకర్షణీయంగా రూపుదిద్ది మంత్రులతో ప్రారంభోత్సవాలు చేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. దీని ద్వారా అధికారులకు తమ పలుకుబడి సందేశాన్ని ఇవ్వాలని భావిస్తున్నారని తెలిసింది.


నగరంలో స్పా కేంద్రాల పేరుతో జరిగే అరాచకాన్ని సహించేది లేదు. తిరిగి ప్రారంభించేందుకు మా వద్దకు ఎవరూ అనుమతి కోసం రాలేదు. అన్ని అనుమతులు ఉండాల్సిందే. స్పాలపై నిఘా కొనసాగుతోంది.
 కాంతిరాణాటాటా, పోలీస్‌ కమిషనర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని