logo

దీక్ష భగ్నం

సీపీఎస్‌ రద్దుపై తమ పోరాటం ఆగదని యూటీఎఫ్‌ నేతలు హెచ్చరించారు. పాతపెన్షన్‌ విధానం సాధనే లక్ష్యంగా గన్నవరం శివారు సుందరయ్యనగర్‌ ధర్మస్థలి ఆవరణలో ఆంధ్రప్రదేశ్‌ ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్‌(యూటీఎఫ్‌) ‘సంకల్పదీక్ష’ను శుక్రవారం చేపట్టారు.

Updated : 04 Feb 2023 04:13 IST

సీపీఎస్‌ రద్దుపై భగ్గుమన్న ఉపాధ్యాయులు

సభాస్థలి పరిసరాల్లో మోహరించిన పోలీసులు

హనుమాన్‌జంక్షన్‌, గన్నవరం గ్రామీణం: సీపీఎస్‌ రద్దుపై తమ పోరాటం ఆగదని యూటీఎఫ్‌ నేతలు హెచ్చరించారు. పాతపెన్షన్‌ విధానం సాధనే లక్ష్యంగా గన్నవరం శివారు సుందరయ్యనగర్‌ ధర్మస్థలి ఆవరణలో ఆంధ్రప్రదేశ్‌ ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్‌(యూటీఎఫ్‌) ‘సంకల్పదీక్ష’ను శుక్రవారం చేపట్టారు. దీన్ని పోలీసులు భగ్నం చేశారు. సభకు అనుమతి లేకపోవడంతో అప్రమత్తమైన పోలీసులు ముందస్తుగా ఉద్యోగులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీని హనుమాన్‌జంక్షన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని మీడియాతో మాట్లాడేందుకు సైతం అనుమతించకుండా, వారి వద్ద ఉన్న చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. వీరవల్లి పోలీస్‌స్టేషన్‌లో ఉన్న యూటీఎఫ్‌ రాష్ట్ర నాయకుల్ని మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు పరామర్శించారు. పిన్నమనేని కూడలి, పొట్టిపాడు టోల్‌ప్లాజా, శ్రీనివాస హేచరీస్‌ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆయా చెక్‌పోస్టుల వద్ద అదుపులోకి తీసుకున్న 418మంది ఉద్యోగులను వీరవల్లి-130, హనుమాన్‌జంక్షన్‌-08, ఉయ్యూరు టౌన్‌-13, రూరల్‌-35, కంకిపాడు-54, ఉంగుటూరు-34, గన్నవరం-99, ఆత్కూరు-03 స్టేషన్లకు తరలించారు. వారిపై సెక్షన్‌ 151, సీఆర్‌పీసీ కేసులు నమోదు చేసిన పోలీసులు.. సొంత పూచీకత్తుపై సాయంత్రం విడుదల చేశారు.

పోలీసుల అరెస్టులు దుర్మార్గం.. పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చమని డిమాండ్‌ చేస్తే పోలీసులతో అక్రమ అరెస్టులు చేయించడం సిగ్గుచేటని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కనకారావు అన్నారు. ఉద్యోగుల పాలిట శాపంగా సీఎం నిర్ణయాలు మారాయన్నారు. ఉంగుటూరు పోలీస్‌ స్టేషన్లో మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావుతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. తొలుత ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పెదఆవుటపల్లి వద్ద ఎమ్మెల్సీ సాబ్జీ

ఉపాధ్యాయుడి ఆక్రందన

ఉంగుటూరు స్టేషన్లో ఉద్యోగులతో మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు

శిబిరానికి సమీపంలో టీచర్లను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని