logo

అమ్మను తిట్టాడని తమ్ముడి హత్య

వారిద్దరూ అన్నదమ్ములు. కలిసి మద్యం తాగారు. ఇంటికొచ్చి తల్లితో చీవాట్లు తిన్నారు. పాడు వ్యసనం మానండంటూ అమ్మ గట్టిగా అనడంతో చిన్న కొడుకు తల్లిని దుర్భాషలాడసాగాడు.

Published : 04 Feb 2023 03:27 IST

మద్యం మత్తులో దుర్ఘటన

మృతుడు కరుణకుమార్‌

మైలవరం, న్యూస్‌టుడే: వారిద్దరూ అన్నదమ్ములు. కలిసి మద్యం తాగారు. ఇంటికొచ్చి తల్లితో చీవాట్లు తిన్నారు. పాడు వ్యసనం మానండంటూ అమ్మ గట్టిగా అనడంతో చిన్న కొడుకు తల్లిని దుర్భాషలాడసాగాడు. అమ్మను తిట్టవద్దని అన్న చెబుతున్నా వినలేదు. అసలే మద్యం మత్తులో ఉన్న అన్న కోపంతో లోపలికి వెళ్లి కత్తి తీసుకొచ్చి తమ్ముడిని పొడవడంతో మృతి చెందిన ఘటన పట్టణంలోని పొందుగల రోడ్డులో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రిలో సందర్శించిన ఏసీపీ ఎం.రమేష్‌ హత్య వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన మేరకు.. అన్నదమ్ములైన కృష్ణవరపు ప్రసన్నకుమార్‌, కరుణకుమార్‌ (24) తాపీ పనులు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులతో కలిసి పొందుగల రోడ్డులోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. అన్నకు పెళ్లి కాగా, తమ్ముడు అవివాహితుడు. గురువారం రాత్రి ఇద్దరూ కలిసి సత్యనారాయణ అనే వ్యక్తితో కలిసి గ్రామ సమీప మామిడి తోటలో మద్యం తాగారు. అర్ధరాత్రి ఇద్దరూ ఇంటికి వచ్చారు. వారిని చూసి తల్లి మందలిస్తుండగా, చిన్న కుమారుడు కోపంతో ఆమెనే తిట్టడం మొదలుపెట్టాడు. వద్దని వారిస్తున్న అన్ననూ దుర్భాషలాడాడు. అసలే మద్యం మత్తులో ఉన్న ప్రసన్నకుమార్‌ కోపంతో లోపలికి వెళ్లి కూరగాయలు తరిగే కత్తి తీసుకొచ్చి తమ్ముడు కరుణకుమార్‌ ఛాతిపై, కింద డొక్కలో పొడిచాడు. తీవ్ర గాయాలతో కిందపడిన కరుణకుమార్‌ బాధతో కేకలు వేస్తుండగా, అటుగా వెళుతున్న గస్తీ పోలీసులు అక్కడికి చేరుకొని వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై రాంబాబు నిందితుడిని అదుపులో తీసుకొని ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. తీవ్ర రక్తస్రావమవడంతో కరుణకుమార్‌ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. క్షణికావేశంలో హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నా, శరీరంపై ఉన్న కత్తిపోట్ల ఆధారంగా పూర్తిస్థాయిలో విచారణ చేయాలని సీఐ ఎల్‌.రమేష్‌కు ఏసీపీ సూచించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని