logo

ఆదమరిస్తే.. ఆయువు తీస్తుంది..

2022, జులై 12న సత్యనారాయణపురం, భానునగర్‌లో విద్యుదాఘాతంతో వృద్ధ దంపతులు మృతి చెందారు. మోటార్‌ స్విచ్ఛ్‌ ఆన్‌ చేసిన వెంటనే ఒక్కసారిగా షాక్‌ కొట్టి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Published : 04 Feb 2023 03:27 IST

విద్యుత్తు వినియోగంలో జాగ్రత్తలు తప్పనిసరి
సూర్యారావుపేట, న్యూస్‌టుడే

ఒకే ప్లగ్‌ సాకెట్‌కు ఎక్కువ ఉపకరణాలు పెట్టడం ప్రమాదకరం

2022, జులై 12న సత్యనారాయణపురం, భానునగర్‌లో విద్యుదాఘాతంతో వృద్ధ దంపతులు మృతి చెందారు. మోటార్‌ స్విచ్ఛ్‌ ఆన్‌ చేసిన వెంటనే ఒక్కసారిగా షాక్‌ కొట్టి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

2023, ఫిబ్రవరి 2న సత్యనారాయణపురంలో.. ప్లాస్టిక్‌ బకెట్‌లో వాటర్‌ హీటర్‌ పెట్టి, దాన్ని తీసే క్రమంలో తండ్రీ కూతుళ్లు విద్యుదాఘాతానికి గురై దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలు తీవ్ర విషాదం నింపాయి.

ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. విద్యుత్తు ప్రాణాలు తీసేస్తుందనడానికి ఈ రెండు ఉదాహరణలే నిదర్శనం. పరికరాల వాడకంలో సరైన అవగాహన లేకపోయినా, భద్రతా ప్రమాణాలు పాటించకపోయినా విద్యుత్తు షాక్‌ కొడుతుందని ఎస్‌ఈ ఎ.మురళీమోహన్‌ చెబుతున్నారు. గృహ, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలకు సంబంధించిన వినియోగదారులు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ఇళ్లల్లో భద్రతా ప్రమాణాలు..

* ఇంటికి ఎర్తింగ్‌ ఇచ్చినపుడు కనీసం రెండు ఎర్త్‌ ఎలక్ట్రోడులు బిగించుకోవాలి.

*  గ్రైండర్‌, ఏసీ, రిఫ్రిజిరేటర్లలో అసాధారణ శబ్దాలు వస్తుంటే వెంటనే నిపుణులతో పరీక్ష చేయించుకోవాలి.

*  ఒకే ప్లగ్‌ పాయింట్‌ నుంచి లూజు వైర్లు, తాత్కాలికంగా అనేక పరికరాలను కలపకూడదు.

*  ప్లగ్‌ తీసేటపుడు వైరును పట్టుకుని లాగరాదు.

*  గృహ విద్యుత్తు ఉపకరణాలు వాడేటపుడు తయారీదారుడు నిర్ధేశించిన సామర్థ్యం ఉన్న మూడు పిన్నుల ప్లగ్‌ సాకెట్లనే వాడాలి. చాలా మంది సాధారణ మూడు పిన్నుల ప్లగ్‌కు ఏసీ లేదా గీజర్‌ను బిగిస్తారు. మూడు పిన్నుల ప్లగ్‌ కరిగిపోయి ప్రమాదాలు జరుగుతాయి.

*  గృహ వినియోగదారులు విద్యుత్తు షాక్‌ తగలకుండా.. ఇళ్లల్లో 30 మిల్లీ యాంప్స్‌ సామర్థ్యం గల అత్యాధునిక ఆర్‌సీసీబీ (రెసిడ్యుయల్‌ కరెంట్‌ సర్క్యూట్‌ బ్రేకర్‌) లేదా ఈఎల్‌సీబీ (ఎర్త్‌ లీకేజీ సర్క్యూట్‌ బ్రేకర్‌)లను విద్యుత్తు సరఫరా వలయంలో చట్టప్రకారం విధిగా వినియోగించాలి. ఇవి ఉంటే.. ఎవరికైనా విద్యుదాఘాతం జరిగితే వెంటనే సరఫరా నిలిచిపోతుంది. ప్రాణాపాయం తప్పుతుంది.

*  ఏదైనా విద్యుత్తు పరికరం పనిచేయకపోతే.. దాన్ని సొంతంగా మరమ్మతులు చేయకుండా సరైన నిపుణులతో మరమ్మతులు చేయించాలి.

*  ఎవరికైనా కళ్ల ముందు విద్యుదాఘాతానికి గురై ఉంటే.. అతనికి సాయం అందించే ప్రయత్నంలో బాధితుడిని చేతితో పట్టుకోవద్దు. ఇది చాలా ప్రమాదకరం. ఎండు కర్రతో విద్యుత్తు తీగల నుంచి బాధితుడిని తప్పించాలి.

*  ప్రయాణించే వాహనాలపై ప్రమాదవశాత్తు విద్యుత్తు తీగలు జారిపడితే.. వాటి నుంచి జాగ్రత్తగా దూరంగా వెళ్లాలి. రెండు కాళ్లు పక్క పక్కన పెట్టుకుని ఒకేసారి గెంతుతూ దూరంగా వెళ్లాలి.


వాణిజ్య సముదాయాలు, పరిశ్రమల్లో ఇలా చేయాలి..

ఇలా స్విచ్‌లు విరిగిపోతే వెంటనే మార్చుకోవడం మంచిది

*  కరెంట్‌కు సంబంధించిన ఏ పని చేసినా.. విధిగా చెప్పులు, చేతి తొడుగులు ధరించాలి.

 కాటన్‌ మిల్లుల్లో విద్యుత్తు ప్యానల్‌ బోర్డు, మోటార్లపై కాటన్‌ డస్ట్‌ పార్టికల్స్‌ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

*  లూజు ఎర్త్‌ కనెక్షన్లు, లూజ్‌ వైరింగ్‌ లేకుండా పర్మినెంట్‌గా ఉండేలా చూసుకోవాలి.

*  ట్రాన్స్‌ఫార్మర్‌ చుట్టూ 1.8 మీటర్ల ఎత్తులో కంచె ఏర్పాటు చేసి, దానికి తప్పనిసరిగా ఎర్తింగ్‌ ఇవ్వాలి. బయటి మనుషులు లోనికి వెళ్లకుండా గేటు ఏర్పాటు చేయాలి.

*  అన్ని స్విచ్‌ బోర్డులు, ప్యానల్‌ బోర్డుల ముందు రబ్బరు మ్యాట్లు విధిగా ఏర్పాటు చేయాలి.

*  స్విచ్‌ బోర్డులు చెక్కబోర్డుపై బిగించకూడదు. దానికి బదులుగా ఇండస్ట్రియల్‌ ప్యానెల్‌ బోర్డు ఉపయోగించాలి.

*  ఎర్త్‌ గుంటల్లో బాగా తడి ఉండేలా చూసుకోవాలి.

*  లైటింగ్‌, పవర్‌ సాకెట్లు, ఎర్త్‌కు ఐ.ఎస్‌.ఐ. గుర్తు ఉన్నవి లేదా ఎల్‌ఆప్‌ఎల్‌ఎస్‌ వైర్లు ఉపయోగించాలి.

*  మోటార్లకు విడిగా రెండు ఎర్తింగ్‌ కనెక్షన్లు ఇవ్వాలి.

*  3 పిన్ల సాకెట్‌లో 3వ పిన్‌కు తప్పనిసరిగా ఎర్తింగ్‌ ఉండాలి.

*  ఇండస్ట్రీ పరిసరాల్లో తాత్కాలిక వైరింగ్‌ తొలగించి, శాశ్వతమైన పీవీసీ పైపుల ద్వారా ఏర్పాటు చేయాలి.

*  లైటింగ్‌ డిస్ట్రిబ్యూషన్‌ బోర్డులో 30 మిల్లీ యాంప్స్‌ ఆర్‌సీసీబీ, పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ బోర్డులో 100 మిల్లీ యాంప్స్‌ ఆర్‌సీసీబీ, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లకు 300 మిల్లీ యాంప్స్‌ ఆర్‌సీసీసీ విధిగా వినియోగించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని