logo

కీచక ఏపీఎంపై చర్యలు తీసుకోండి

ఆర్థికపరమైన అవకతవకలకు పాల్పడటమే కాకుండా మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్న వెలుగు ఏపీఎంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు జిల్లా గ్రామీణాభివృద్ధి కార్యాలయం వద్ద శుక్రవారం నిరసన తెలిపారు.

Published : 04 Feb 2023 03:27 IST

డీఆర్డీఏ పీడీ కార్యాలయం వద్ద బాధితుల నిరసన

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: ఆర్థికపరమైన అవకతవకలకు పాల్పడటమే కాకుండా మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్న వెలుగు ఏపీఎంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు జిల్లా గ్రామీణాభివృద్ధి కార్యాలయం వద్ద శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాధితురాలైన మొవ్వ మండల సమాఖ్యలో ఎంఎస్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న సునీత మాట్లాడుతూ మండల ఏపీఎంగా పనిచేస్తున్న కె.సుబ్బారావు కొన్ని రోజులుగా తన పట్ల అసభ్యకరంగా ప్రవరిస్తూ తన మాట వినకుంటే ఉద్యోగం పోయేలా చేస్తానంటూ బెదిరిస్తున్నారంటూ విలపించారు. గత నెల 23న ఎంఎస్‌ పుస్తకాలు తనిఖీ చేయాలంటూ గదిలోకి రమ్మని పిలిచి అసభ్యకరంగా ప్రవర్తించగా తాను భయపడి బయటకు వచ్చేశానన్నారు. ఆరోజు నుంచి సమావేశాల పేరుతో పిలుస్తూ ప్రత్యేకించి తనకు నరకం చూపిస్తున్నారని, తన చరవాణీకి పదేపదే ఫోన్‌లు చేస్తూ సహకరించకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారని ఆరోపించారు. ఇదే తరహాలో మరికొందరు మహిళలను వేధిస్తున్నారని, వారు భయపడి చెప్పడంలేదన్నారు. గతంలో అభయహస్తం నగదు రూ.3.00 లక్షలకు పైబడి తన సమీప వ్యక్తుల ఖాతాలకు బదిలీ చేశారని, ఈ విషయాన్ని గుర్తించి ఉన్నతాధికారులకు నివేదించామన్నారు.2022-23 సంవత్సరానికి సంబంధించి వసూలు చేసిన అభయహస్తం నగదు పూర్తిగా నేటికీ సంబంధిత ఖాతాకు జమచేయలేదన్నారు. ఉన్నతాధికారులు విచారణ నిర్వహించి తగు చర్యలు చేపట్టకుటే తనకు ఆత్మహత్యే శరణ్యమన్నారు.ఆర్థిక అక్రమాలపై దర్యాప్తు చేయించాలని కోరారు. విషయం తెలుసుకుని బాధితుల వద్దకు వచ్చిన డీఆర్డీఏ పీడీ వరప్రసాద్‌ ఏపీఎంపై వచ్చిన ఆరోపణలపై విచారణ నిర్వహించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిరసన కార్యక్రమంలో బాధితురాలితో పాటు పలువురు బుక్‌కీపర్లు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని