logo

ఆదాయానికి అడ్డుపడుతున్నారు

దుగురి ప్రయోజనం కోసం అక్కరకు రావాల్సిన ఆదాయానికి స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు మోకాలడ్డుతున్న తీరు విమర్శలకు తావిస్తోంది.

Published : 05 Feb 2023 05:33 IST

నాలుగు దశాబ్దాలుగా అనామతు అద్దెలతో సరి
కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే

మండల పరిషత్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌

దుగురి ప్రయోజనం కోసం అక్కరకు రావాల్సిన ఆదాయానికి స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు మోకాలడ్డుతున్న తీరు విమర్శలకు తావిస్తోంది. నెలకు రూ.లక్షల్లో ఆదాయాన్ని సమకూర్చాల్సిన మండల పరిషత్‌ కాంప్లెక్స్‌ అధికారిక పైరవీల మాటున కునారిల్లుతోంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా దీర్ఘ కాలంగా నామమాత్రపు అద్దెతో పాత గుత్తేదారులు కొనసాగుతున్నా పట్టించుకోవాల్సిన పాలనా యంత్రాంగం వారి పట్ల చూపిస్తున్న ఉదారత చర్చనీయాంశం అవుతోంది.

జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌లకు చెందిన రూ.కోట్లలో విలువైన ఆస్తులు కొన్ని ప్రాంతాల్లో అన్యాక్రాంతం అయ్యాయన్న ఆరోపణలు ఏనాటి నుంచో విన్పిస్తూనే ఉన్నాయి. షాపింగ్‌ కాంప్లెక్సులు, ఫెర్రీల వంటివాటి ద్వారా సమకూరాల్సిన ఆదాయానికి కొన్ని చోట్ల రాజకీయ జోక్యాలతో గండి పడుతోంది.ప్రభుత్వాల పరంగా స్థానిక సంస్థలకు వచ్చే నిధులు క్రమేపీ తగ్గిపోతున్న నేపథ్యంలో ఆదాయ వనరులు పెంచుకునేలా దృష్టి సారించి మండలాల వారీ ఆస్తులు, ఆదాయ వనరుల వివరాలు సేకరించి వాటిని పటిష్ఠపరిచేలా గతంలో చర్యలు ప్రారంభించినా అవి మూన్నాళ్ల ముచ్చటే అయ్యాయి. అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని చల్లపల్లిలో ఉన్న మండల పరిషత్‌ కాంప్లెక్స్‌లోని 18 దుకాణాల్లో కొన్ని నెలలుగా ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా వ్యాపారాలు నిర్వహించుకుంటున్నా పట్టించుకునే వారే లేరు.

ఆది నుంచి అవకతవకలే

మండల కేంద్రమైన చల్లపల్లి నడిబొడ్డున అతి కీలకమైన ప్రాంతంలో పరిషత్‌ నిధులతో 1992 సంవత్సరంలో 18 దుకాణాలతో రాజీవ్‌గాంధీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించారు. ఇందులోని దుకాణాలను నిబంధనల మేరకు బహిరంగ టెండరు విధానంలో కేటాయించాల్సి ఉన్నా అప్పట్లోనే స్థానికంగా పట్టున్న పెద్దలు చక్రం తిప్పి తమ అనుయూయులకు తక్కువ అద్దెకు దుకాణాలు దక్కేలా చేశారనే విమర్శలున్నాయి. అనంతరం ఐదేళ్లకు ఒకసారి టెండర్లు నిర్వహించాల్సి ఉన్నా అందుకు భిన్నంగా పాతవారే సక్రమంగా అద్దెలు చెల్లించకుండా 2006 వరకూ దుకాణాలను స్వాధీనంలో ఉంచుకున్నారు. ఇది గమనించిన అప్పటి ఎంపీడీవో కోర్టు ఆదేశాల ద్వారా దుకాణదారులను ఖాళీ చేయించడంతో పాటు అద్దె బకాయిలు వసూలు చేయాలని ప్రయత్నం చేసినా పూర్తిగా సఫలీకృతం కాలేకపోయారు. నిబంధనల మేరకు ఐదేళ్ల కాలవ్యవధితో బహిరంగ వేలం నిర్వహించి దుకాణాలు కేటాయించారు. మళ్లీ 2011లో వేలం నిర్వహించాల్సి ఉన్నా ఇప్పటి వరకూ అతీగతీ లేదు. ప్రత్యేక పరిస్థితుల్లో పరిమిత కాలవ్యవధితో ఒక దఫాకు 33 శాతం అద్దె పెంపుతో పాతవారిని కొనసాగించవచ్చన్న అంశాన్ని ఆసరా చేసుకుని టెండర్ల అంశాన్ని అటకెక్కించేశారు. ఇటీవల అధికారం చేపట్టిన నూతన పాలకవర్గం నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అద్దెల వ్యవహారంపై దృష్టి సారించి తాజాగా టెండర్లు పిలివాలని నిర్ణయించింది. విషయం గ్రహించిన దుకాణాలను స్వాధీనంలో ఉంచుకున్న కొందరు తమకు తెలిసిన విద్యను ప్రదర్శిస్తూ పాలకవర్గంలోని కొందరు సభ్యులను ఆకట్టుకున్నారు. మెత్తపడిన వారు మళ్లీ 33 శాతం పెంపు ప్రతిపాదన తీసుకురావడంతో మండల పరిషత్‌ అధికారి వాస్తవాలను వారికి వివరించి టెండర్లు నిర్వహించాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు. దీంతో వారు నియోజకవర్గానికి చెందిన ఓ కీలక వ్యక్తిని ఆశ్రయించి ఆయన అభయం పొందడంతో టెండర్ల ప్రతిపాదన మరుగునపడే స్థితికి చేరుకుంది.

కదలిక వచ్చేనా...?

గతంలో దుకాణాలు పాడుకున్న వారిలో కొందరు ఇతరులకు సబ్‌లీజ్‌కు ఇచ్చారు. పరిషత్‌ అనుమతి లేకుండా కొన్ని నెలల క్రితం ఒక షెడ్‌ నిర్మించి వినియోగించుకుంటున్నారు. వాణిజ్య పరంగా కేంద్రబిందువుగా ఉండే ప్రాంతంలో మార్కెట్‌ ధర ప్రకారం 18 దుకాణాలకు నెలకు రూ.లక్షల్లో అద్దె వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సగటున ఒక్కో దుకాణానికి సగటున నెలకు రూ.2,000 కూడా రావడం లేదు. ఏటా రూ. లక్షల్లో పరిషత్‌ ఆదాయం కోల్పోవడంపై స్థానికుడైన మోహనకృష్ణ హైకోర్టును ఆశ్రయించడంతో నాలుగు నెలల వ్యవధిలో టెండర్లు నిర్వహించి తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలంటూ గత నెలలో కోర్టు ఆదేశించింది. ఏ మేరకు ఆ ఆదేశాలను అమలు చేస్తారో వేచిచూడాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని