logo

లక్ష్య సాధనకు కృషి చేయాలి

జిల్లాలో పేదలకు ఇచ్చిన లేఔట్లలో గృహ నిర్మాణాలు వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక అధికారులను కోరారు.

Published : 05 Feb 2023 05:33 IST

స్థాయీ సంఘ సమావేశాల్లో జడ్పీ ఛైర్‌పర్సన్‌

సమీక్ష నిర్వహిస్తున్న ఛైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: జిల్లాలో పేదలకు ఇచ్చిన లేఔట్లలో గృహ నిర్మాణాలు వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక అధికారులను కోరారు. జడ్పీ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన ప్లానింగ్‌, ఆర్థికం, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, పనులకు సంబంధించిన స్థాయీ సంఘాలకు అధ్యక్షత వహించిన ఆమె శాఖల వారీ పురోగతిని సమీక్షించారు. వచ్చే మూడు నెలలు నిర్మాణాలకు అనుకూలమని చెబుతూ లక్ష్య సాధన దిశగా కృషి చేయాలని కోరారు. వైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలకు చాలా మంది అర్హులున్నా తక్కువగా దరఖాస్తులు రావడాన్ని ప్రస్తావిస్తూ ఈ పథకం గురించి విస్తృత అవగాహన కల్పించాలన్నారు. పీఎం ఎంప్లాయిమెంట్‌ గ్యారంటీ పథకం ద్వారా పరిశ్రమల స్థాపనకు తయారీ రంగంలో రూ.50 లక్షలు, సేవారంగంలో రూ.20 లక్షల వరకూ సబ్సిడీ పొందవచ్చన్నారు. మొత్తం 167 దరఖాస్తులు అందగా బ్యాంకులు 66 యూనిట్లు మంజూరు చేశారని వాటిలో 37 యూనిట్లు గ్రౌండింగ్‌ అయ్యాయని తెలిపారు. గన్నవరంలో డంపింగ్‌ యార్డ్‌ లేకపోవడం వల్ల రహదారుల పక్కనే చెత్త వేస్తున్నారని కోఆప్షన్‌ సభ్యులు చెప్పడంతో జిందాల్‌ కంపెనీతో మాట్లాడామని త్వరలో గన్నవరం, కేసరపల్లి గ్రామాల్లో చెత్తను సేకరించి ఎరువుగా మార్చే ప్రక్రియ చేపడతారని అధికారులు సమాధానమిచ్చారు. స్థాయీ సంఘ సమావేశాలకు ఎన్టీఆర్‌, ఏలూరు జిల్లాకు చెందిన కొన్ని శాఖల అధికారులు గైర్హాజరు కావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన ఛైర్‌పర్సన్‌ ఈ అంశాన్ని సంబంధిత కలెక్టర్ల దృష్టికి తీసుకువెళ్లాలని సీఈవోకు సూచించారు. వ్యవసాయంపై నిర్వహించిన సమావేశానికి అధ్యక్షత వహించిన వైస్‌ ఛైర్‌పర్సన్‌ గరికపాటి శ్రీదేవి వ్యవసాయ, అనుబంధ అంశాలను సమీక్షించారు.  సాంఘిక సంక్షేమశాఖకు సంబంధించి స్థాయీ సంఘ సమావేశానికి అధ్యక్షత వహించిన వైస్‌ ఛైర్మన్‌ జి.కృష్ణంరాజు అజెండాలో ఇచ్చిన అంశాలను సమీక్షించారు. జడ్పీ సీఈవో జి.శ్రీనివాసరావు, కృష్ణా, ఎన్టీఆర్‌, ఏలూరు జిల్లాల అధికారులు, స్థాయీసంఘ సభ్యులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని