ప్రముఖుల భద్రత ప్రశ్నార్థకం

దేశ, రాష్ట్ర, సినీ, రాజకీయ, వ్యాపార, ఇతర ప్రముఖుల రాకపోకలతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఎంతో రద్దీగా ఉంటుంది.

Updated : 05 Feb 2023 06:37 IST

తలనొప్పిగా మారిన పోలీసు విధులు
కమిషనరేట్‌లోకి విమానాశ్రయం!
న్యూస్‌టుడే, గన్నవరం గ్రామీణం

కేసరపల్లి కూడలి వద్ద సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్‌ (పాత చిత్రం)

దేశ, రాష్ట్ర, సినీ, రాజకీయ, వ్యాపార, ఇతర ప్రముఖుల రాకపోకలతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఎంతో రద్దీగా ఉంటుంది. ఇక్కడ నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో ప్రయాణించే వారి భద్రత ప్రశ్నార్థకంగా మారింది. గతంలో విమానాశ్రయం పూర్తిగా విజయవాడ నగర పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఉండేది. వీఐపీలు ఎవరైనా కమిషనరేట్‌ నుంచి వచ్చే భద్రతా ఆదేశాల మేరకు ఒకే ఎస్కార్ట్‌తో నగరానికి రాకపోకలు సాగించే వారు. జిల్లాల విభజనతో పోలీసు ఎస్కార్ట్‌ విధులు పెద్ద సవాల్‌గా మారిందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. విమానాశ్రయం కృష్ణా జిల్లా ఎస్పీ పరిధిలోకి చేరడంతో విజయవాడ నుంచి వచ్చే ప్రముఖులను కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల సరిహద్దులోని కేసరపల్లి-సావరగూడెం కూడలి వద్ద వరకు కమిషనరేట్‌ ఎస్కార్ట్‌ వాహనాలు చేరుకుంటాయి. అక్కడ ఎస్పీ పరిధిలోని పోలీసు సిబ్బందికి ఆ బాధ్యతలను అప్పగిస్తారు. మరోవైపు విమానాశ్రయం నుంచి విజయవాడకు వెళ్లే ప్రముఖులను గూడవల్లి వరకు జిల్లా ఎస్పీ పరిధి భద్రతా సిబ్బంది తీసుకెళ్లి కమిషనరేట్‌ వారికి అప్పగిస్తారు. భద్రతా సిబ్బంది మార్పు చేర్పులు పెద్ద తలనొప్పిగా మారడంతో క్షేత్రస్థాయి భద్రతా సిబ్బంది తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కమిషనరేట్‌కే మొగ్గు.. : విమానాశ్రయంలో భద్రత ఎస్పీ పరిధి కంటే విజయవాడ నగర కమిషనరేట్‌కు అప్పగించాలని ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ఓ రేంజ్‌స్థాయి అధికారిని నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరినట్లు తెలిసింది. స్థానికంగా ప్రముఖుల రాకపోకలను సదరు అధికారి బృందం క్షుణ్ణంగా పరిశీలించిందని సమాచారం. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిలో విమానాశ్రయానికి కేవలం 4 కిలోమీటర్లు మాత్రమే కృష్ణా జిల్లా పరిధిలో ఉండటంతో విమానాశ్రయ భద్రతను కమిషనరేట్‌కు అప్పగిస్తే మేలని అభిప్రాయ పడినట్లు తెలిసింది. గన్నవరంలో కేవలం ఒక పోలీస్‌ స్టేషన్‌ మాత్రమే ఉండటంతో దానిని టౌన్‌, రూరల్‌ స్టేషన్లగా విభజించి.. విమానాశ్రయం, కృష్ణా జిల్లా పరిధిలోని బుడమేరు వరకున్న చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి ప్రాంతాన్ని ఓ స్టేషన్‌గా రూపొందించి కమిషనరేట్‌లో కలపాలని నిర్ణయించినట్లు సమాచారం. ఫలితంగా విమానాశ్రయానికి చేరుకొనే ప్రముఖుల రాకపోకల భద్రత సమస్య పరిష్కారమవుతుందని పేర్కొన్నట్లు లోగుట్టు.

సిబ్బంది అవస్థలు తప్పినట్లే..: విజయవాడ నగర కమిషనరేట్‌ పోలీసులకు విమానాశ్రయం భద్రతపై పూర్తి స్థాయి అవగాహన ఉంది. తాజాగా విమానాశ్రయం జిల్లా ఎస్పీ పరిధిలోకి రావడంతో అవగాహన లేక నాగాయలంక, గుడివాడ, మచిలీపట్నం ఇతర స్టేషన్ల నుంచి లెక్కకు మించిన పోలీసులను భద్రతా విధులకు కేటాయిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అదే కమిషనరేట్‌లోనే ఉండటంతో నగర పరిసరాల్లో నాలుగైదు స్టేషన్ల నుంచి సిబ్బందితో విధులు నిర్వహించవచ్చు. ఫలితంగా సిబ్బందికి కూడా ఒకింత అవస్థలు తప్పనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని