logo

రూ.400 కోట్లతో క్యాన్సర్‌ వైద్య సౌకర్యాలు

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో రూ.400 కోట్లతో క్యాన్సర్‌ చికిత్సకు సంబంధించిన సదుపాయాలను మెరుగుపరిచామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు.

Updated : 05 Feb 2023 05:58 IST

జెండా ఊపి 5కె వాకథాన్‌ను ప్రారంభిస్తున్న కృష్ణబాబు, మల్లాది విష్ణు తదితరులు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో రూ.400 కోట్లతో క్యాన్సర్‌ చికిత్సకు సంబంధించిన సదుపాయాలను మెరుగుపరిచామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు. అంతర్జాతీయ క్యాన్సర్‌ నివారణ దినం సందర్భంగా శనివారం అమెరికన్‌ అంకాలజీ ఇనిస్టిట్యూట్‌ ఆధ్వర్యంలో బీఆర్‌టీఎస్‌ రోడ్డులో నిర్వహించిన 5కే వాకథాన్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కృష్ణబాబు మాట్లాడుతూ ప్రజలకు క్యాన్సర్‌ నివారణ, చికిత్స అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. 20 ఏళ్ల కిందట సాంక్రమిక వ్యాధులతో (సీడీ) ప్రజలు ఎక్కువగా మరణించే వారని, మారిన జీవనశైలి, పరిస్థితుల్లో ఇప్పుడు క్యాన్సర్‌, మధుమేహం, రక్తపోటు వంటి అసాంక్రమిక వ్యాధుల(ఏఎన్సీడీ)తో మృత్యువాత పడుతున్న విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు.  మన రాష్ట్రంలో ఏటా సుమారు 35 వేల మందికి పైగా క్యాన్సర్‌తో మరణిస్తున్నారని, మరో 70వేల మంది కొత్తగా వ్యాధి బారిన పడుతున్నారని వివరించారు. ప్రస్తుతం మన వద్ద ఉన్న చికిత్సా విధానాలు కేవలం జీవన కాలాన్ని పెంచడానికే తప్ప, వ్యాధి నివారణకు పనికిరావడం లేదని, భవిష్యత్తులో పూర్తి స్థాయి చికిత్స అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందరూ వ్యాయామం చేస్తూ, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, ఎయిమ్స్‌ (మంగళగిరి) అంకో ఎంట్రాలజీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.సుబ్బారావు, డీసీపీ మేరి ప్రశాంతి, వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ రాధికారెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎం.సుహాసిని, పలువురు వైద్యులు, వాకర్స్‌ సంఘం సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.  ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలకు చెందిన సుమారు 200 మంది ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రాధారమణశ్రీ ప్రోత్సాహంతో ఈ వాకథాన్‌లో పాల్గొన్నారు. పీవో (ప్రాజెక్ట్‌ అధికారి) కె.పద్మావతి, ఏపీవో వై.వరలక్ష్మి సమన్వయపరిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని