logo

సముద్ర స్నానాలకు పోటెత్తిన జనసందోహం

మాఘ పౌర్ణమి సందర్భంగా పాలకాయతిప్పవద్ద కృష్ణా సాగర సంగమ ప్రదేశంలో పవిత్ర స్నానాలు చేసేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు.

Published : 06 Feb 2023 05:37 IST

పాలకాయతిప్ప సముద్రం వద్ద జనసందోహం

కోడూరు (అవనిగడ్డ), న్యూస్‌టుడే: మాఘ పౌర్ణమి సందర్భంగా పాలకాయతిప్పవద్ద కృష్ణా సాగర సంగమ ప్రదేశంలో పవిత్ర స్నానాలు చేసేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. వేకువ జాము నుంచే యాత్రికులు హంసలదీవి నుంచి సాగరం వద్దకు ఆటోలు, ద్విచక్రవాహనాలు, చిన్న కార్లలో వెళ్లారు. రాత్రి వేణుగోపాలస్వామి కల్యాణం తిలకించిన భక్తులు అక్కడే కొంతసేపు సేదతీరి తెల్లవారుజామున సముద్రం వద్దకు చేరారు. సంగమ ప్రదేశంలో స్నానాలకు అనుమతించడం లేదని, జల్లు స్నానాలు ఏర్పాటుచేస్తామని ప్రకటించిన అధికారులు ఆదివారం ఉదయం వరకు అలసత్వం వహించారు. జనం కోరడంతో అప్పటికప్పుడు జల్లుస్నానాలు ఏర్పాటుచేసి మమ అనిపించారు. పాలకాయతిప్ప నుంచి సముద్రం వరకు ద్విచక్ర వాహనాలను కూడా అనుమతించకపోవడంతో ఇబ్బందులు పడ్డామని పలువురు భక్తులు వాపోతున్నారు.

రద్దీతో నిలిచిపోయిన ట్రాఫిక్‌

స్తంభించిన ట్రాఫిక్‌: మాఘ పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాలకు భక్తులు తరలి రావడంతో ట్రాఫిక్‌ కిలోమీటరు మేర నిలిచిపోయింది. వాహనాలు కదలలేని పరిస్థితితో యాత్రికులు అవస్థలు పడ్డారు. హంసలదీవి నుంచి పాలకాయతిప్ప వరకు అక్కడి నుంచి సముద్రం వరకు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. హంసలదీవి నుంచి పాలకాయతిప్ప వరకు కనీసం జంగిల్‌ క్లియరెన్స్‌ చేయించలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంగినపూడిలో స్నానాలు చేసేందుకు వచ్చిన ప్రజలు

మంగినపూడి(మచిలీపట్నంరూరల్‌), న్యూస్‌టుడే: మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం భక్తులు సముద్ర స్నానం చేశారు. వేకువజామునే మంగినపూడి చేరుకున్న భక్తులు సముద్రునికి పూజలు చేసి పుణ్య స్నానాలాచరించారు. అధికారులు రక్షణ చర్యల్లో భాగంగా భక్తులు సముద్రంలోకి వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. గజ ఈతగాళ్ళను సిద్ధం చేశారు. తీరం వెంబడే పోలీసులు హెచ్చరికలు చేస్తూ భక్తులను అప్రమత్తం చేశారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని