logo

గుట్కా.. పోలీసులు పట్టించుకోక..!

గుట్కా అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించినా క్షేత్రస్థాయిలో మాత్రం అది అమలు కావడం లేదు.  నగరంలో ఎక్కడ పడితే అక్కడ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

Published : 06 Feb 2023 05:52 IST

నగరానికి యథేచ్ఛగా సరఫరా
బహిరంగంగానే విక్రయాలు
విజయవాడ సిటీ, పటమట, న్యూస్‌టుడే

రామవరప్పాడులోని కిరాణా షాపులో
స్వాధీనం చేసుకున్న గుట్కా... (పాత చిత్రం)

గుట్కా అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించినా క్షేత్రస్థాయిలో మాత్రం అది అమలు కావడం లేదు.  నగరంలో ఎక్కడ పడితే అక్కడ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కొందరు అక్రమార్కులు మాఫియాను తలపించే విధంగా గుట్కా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారు. టీ స్టాళ్లు, కేఫ్‌లు, కిరాణా దుకాణాల్లో బహిరంగంగానే అమ్ముతున్నారు. గత ఏడాది రామవరప్పాడులో కిరాణా దుకాణంలో దాడులు చేసి రూ.లక్షన్నర విలువ చేసే సరకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగర వ్యాప్తంగా ఇలాంటి షాపులు చాలా ఉన్నా.. పోలీసులు మాత్రం తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

తనిఖీలకు వస్తున్నాం.. సర్దుకోండి

తమ స్టేషన్‌ పరిధిలో ఏ ప్రాంతాల్లో గుట్కా విక్రయిస్తున్నారో పోలీసుల దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది. నెలవారీ మామూళ్లకు అలవాటు పడిన సిబ్బంది అటువైపు కన్నెత్తి చూడట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2020లో సుమారు రూ.2 కోట్లు, 2021లో రూ.3 కోట్ల విలువ గల సరకు సీజ్‌ చేశారు. 2022లో ఆ మొత్తం ఏకంగా రూ.27,89,033కు తగ్గిపోయింది. ముందు ఏడాదితో పోలిస్తే అందులో 10 శాతం కూడా లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీన్ని బట్టి చూస్తే పోలీసులు వైఫల్యం స్పష్టంగా తెలుస్తోంది. కేసులు మాత్రం నమోదు చేసి ఊరుకుంటున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేసిన సందర్భంలో అడపా దడపా దాడులు చేస్తున్నారు. ఆ సమయాల్లోనూ స్టేషన్‌లో కింది స్థాయి సిబ్బంది సంబంధిత వ్యాపారులకు ముందుగానే సమాచారం అందిస్తున్నారు. దీంతో వారు అప్రమత్తమవుతున్నారు.

గుట్టు చప్పుడు కాకుండా

ప్రధాన వ్యాపారులు వెలుగులోకి రాకుండా అంతా ఫోన్ల ద్వారానే తమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. నగరంలోని ఆటోనగర్‌, భవానీపురం తదితర ప్రాంతాలను కేంద్రాలుగా చేసుకుని తమ గుట్కా సామ్రాజ్యాన్ని విస్తరింపజేశారు. ఇందుకోసం గోడౌన్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సరకు రప్పించి, ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ఎక్కువగా రాత్రివేళల్లో గోడౌన్ల నుంచి తమ ఏజెంట్ల ద్వారా ద్విచక్ర వాహనాలపై గుట్టు చప్పుడు కాకుండా దుకాణాలకు చేరవేస్తున్నారు. ఆ సమయంలో వాహనానికి నెంబర్‌ ప్లేట్‌ లేకుండా, ఉన్నా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గుట్కా విక్రయాలపై అధిక ఆదాయం ఉండడంతో ఎప్పుడైనా ఒకసారి పట్టుబడినా, చిన్న కేసులతో బయటకు వచ్చి మళ్లీ యథావిధిగా వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఇవన్నీ తెలిసినా పోలీసులు వాటిపై దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు