logo

ఇళ్ల తొలగింపులో ఉద్రిక్తత

గుడివాడ పట్టణం లింగవరం రోడ్డులోని కాల్వగట్టుపై పదేళ్లుగా నివాసముంటున్నవారి ఇళ్ల తొలగింపు సోమవారం ఉద్రిక్తతకు దారితీసింది.

Published : 07 Feb 2023 03:26 IST

సహాయ కమిషనరుకు రావికి మధ్య వాగ్వాదం

గుడివాడ(నెహ్రూచౌక్‌), న్యూస్‌టుడే: గుడివాడ పట్టణం లింగవరం రోడ్డులోని కాల్వగట్టుపై పదేళ్లుగా నివాసముంటున్నవారి ఇళ్ల తొలగింపు సోమవారం ఉద్రిక్తతకు దారితీసింది. పురపాలక సంఘం సహాయ కమిషనరు టీవీ రంగారావుతోపాటు ప్రణాళిక విభాగం అధికారులు పొక్లెయిన్‌తో ఇళ్లను తొలగించే ప్రయత్నం చేయగా, బాధిత మహిళలు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో వారికి, అధికారులకు మధ్య కొంతసేపు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తమ ఇళ్లు తొలగించొద్దని బాధితులు అధికారులకు మొరపెట్టుకున్నారు. అయినా వారు కనికరించకపోవటంతో తెదేపా నియోజకవర్గ బాధ్యుడు రావి వెంకటేశ్వరరావు అక్కడికి చేరుకున్నారు.

పొక్లెయిన్‌కు అడ్డంగా ఉన్న మహిళలను లాగుతున్న సిబ్బంది

ఇళ్ల తొలగింపు అన్యాయమని అడ్డు తగిలారు. దీనిపై సహాయ కమిషనరు రంగారావు ఆయనకు బదులిస్తూ కోర్టు ఉత్తర్వులను అమలు చేస్తున్నామన్నారు. నిరాశ్రయులకు ఆసరా కల్పించకుండా ఇళ్ల తొలగింపు సరికాదని రావి వాదనకు దిగారు. అనుమతులు లేకుండా, కోర్టు ఉత్తర్వులను సైతం పట్టించుకోకుండా మట్టి తవ్వకాలు చేస్తున్నవారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. పేద ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదన్నారు. దీంతో వారి మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రజలు, తెదేపా నాయకుల నుంచి త్రీవస్థాయిలో వ్యతిరేకత రావడంతో చేసేదిలేక అధికారులు వెనుదిరిగారు. తెదేపా నాయకులు దింట్యాల రాంబాబు, షేక్‌ జానీషరీఫ్‌, సాంబశివరావు, జబీన్‌, వాసు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని