logo

ఇక్కట్ల ఇరుసుపై లారీ యజమానులు

కరోనాతో రవాణారంగం సంక్షోభంలోకి కూరుకుపోయింది. డీజిల్‌ ధరలు పెంపుతో మరింత కుదేలైంది. నామమాత్రంగానే ఉండే హరిత పన్నూ భారీగా  పెంచేశారు.

Published : 07 Feb 2023 03:26 IST

జిల్లాలో రూ.9 కోట్ల భారం
విజయవాడ సిటీ, న్యూస్‌టుడే

రోనాతో రవాణారంగం సంక్షోభంలోకి కూరుకుపోయింది. డీజిల్‌ ధరలు పెంపుతో మరింత కుదేలైంది. నామమాత్రంగానే ఉండే హరిత పన్నూ భారీగా  పెంచేశారు. పొరుగు రాష్ట్రాలు వివిధ రూపాల్లో పన్ను మినహాయింపులు ఇచ్చి వాహన యజమానులకు భరోసాగా నిలిస్తే ఇక్కడ మాత్రం ఎటువంటి ప్రోత్సాహకాలు అందకపోగా, ప్రస్తుతం సరకు రవాణా వాహనాలపై త్రైమాసిక పన్ను 25 నుంచి 30 శాతం పెంచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగా ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో వ్యవసాయ, అనుబంధ పరిశ్రమలు ఉన్నాయి. ధాన్యం, చెరకు, అరటి, కంద, సుబాబుల్‌, యూకలిప్టస్‌, మత్స్యసంపద, పౌల్ట్రీ, సిమెంట్‌, ఇతర కర్మాగారాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఉత్పత్తులు వివిధ ప్రాంతాలకు, వేరే రాష్ట్రాలకు రవాణా అవుతుంటాయి. జిల్లాలో సుమారు 40 వేల వరకు లారీలు ఉన్నాయి. వీటిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి వేల కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం త్రైమాసిక పన్ను విధిస్తే లారీ యజమానులపై సుమారు రూ.9 కోట్ల మేర ఆర్థిక భారం పడనుంది. దీంతో రవాణారంగం పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని కృష్ణా డిస్ట్రిక్ట్‌ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి గోపిశెట్టి వీర వెంకయ్య ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అన్నీ పెంపే.. :  వాహన ఫిట్‌నెస్‌ చలానా రూ.920 నుంచి రూ.13,500కు పెంచారు. కొత్తగా కొనుగోలు చేసే లారీలపై 14 శాతం పన్ను.. 18 శాతానికి పెరిగింది. డీజిల్‌ ధరను పోల్చుకుంటే సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు కంటే రూ.4 నుంచి రూ.5, కర్ణాటక కంటే రూ.11 ఎక్కువగా ఉంది. అపరాధ రుసుం రూ.1000 నుంచి రూ.20 వేల వరకు, రూ.200 ఉన్న హరిత పన్నురూ.20 వేల వరకు పెంచారు. ఇప్పుడు త్రైమాసిక పన్ను పెంచితే హరిత పన్ను పెరుగుతుంది. దీంతో లారీ యజమానులు, అసోసియేషన్‌ ప్రతినిధులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.


ఆత్మహత్యలే శరణ్యం

- తుమ్మల లక్ష్మణస్వామి, కృష్ణా డిస్ట్రిక్ట్‌ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

కరోనా అనంతరం లారీ రంగం తీవ్ర క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. పరిశ్రమలు, వ్యాపార సంస్థలు మూతపడడంతో వాహనాలు ఆగిపోయాయి.  తిరిగి కార్యకలాపాలు ప్రారంభమైనా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ నెట్టుకొస్తున్నాం. పక్క రాష్ట్రాల్లో లారీల యజమానులను ప్రోత్సహిస్తున్నారు. వివిధ రూపాల్లో పన్నులను ఉపసంహరించుకున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డీజిల్‌, హరిత పన్నులు పెంచింది. మళ్లీ త్రైమాసిక పన్ను పెంపునకు సిద్ధమవుతోంది. ప్రభుత్వం తన నిర్ణయం ఉపసంహరించుకోవాలి. లేకుంటే ఆత్మహత్యలే శరణ్యం.            


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు