logo

గుడ్డు ధర నిర్ణయం తీరుపై అభ్యంతరం

ధర చెప్పకుండా ఉత్పత్తిదారుల వద్ద గుడ్లు తరలిస్తూ, కొన్ని రోజుల తరువాత తక్కువ సొమ్ము ముట్టజెప్పడంపై కోళ్లఫారాల నిర్వాహకులు తీవ్ర అభ్యంతరం తెలిపారు.

Published : 07 Feb 2023 03:26 IST

దేవరపల్లిలో ఆందోళన చేస్తున్న కోళ్ల ఫారాల రైతులు

దేవరపల్లి, న్యూస్‌టుడే: ధర చెప్పకుండా ఉత్పత్తిదారుల వద్ద గుడ్లు తరలిస్తూ, కొన్ని రోజుల తరువాత తక్కువ సొమ్ము ముట్టజెప్పడంపై కోళ్లఫారాల నిర్వాహకులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. దళారుల తీరు కారణంగా సుమారు 50 కోళ్లఫారాలు మూతపడ్డాయని ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్‌ రాష్ట్ర ఛైర్మన్‌ కేవీ ముకుందరెడ్డి అన్నారు. తమకు జరుగుతున్న అన్యాయంపై తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో సోమవారం తూర్పు, పశ్చిమ, కృష్ణా ఉమ్మడి జిల్లాల కోళ్ల రైతులు ఆందోళన చేపట్టారు. అంతకుముందు ఆదివారం రాత్రి దేవరపల్లిలో ఉత్పత్తిదారుల నుంచి కొందరు నాలుగు లారీల్లో గుడ్లు రహస్యంగా తరలించబోగా కోళ్లఫారాల నిర్వాహకులకు విషయం తెలిసి అడ్డుకున్నారు. గుడ్లకు సోమవారం నాటి ధర వర్తింపజేయాలన్న షరతుతో లారీలను విడిచిపెట్టారు. ఏ రోజు ధర ఆ రోజే ఖరారు చేసి గుడ్లు తీసుకెళ్లాలని కోళ్లఫారాల నిర్వాహకులు డిమాండ్‌ చేశారు.  ఇతర రాష్ట్రాల్లో కోళ్లఫారాలు ఏర్పాటు చేస్తున్న వారి వద్ద గుడ్లు కొంటామని బెదిరిస్తూ వర్తకులు గిట్టుబాటు ధర రైతులకు ఇవ్వకుండా దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. కేంద్రం ఎగ్‌ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. రేషన్‌ దుకాణాల్లో గుడ్లు కూడా విక్రయించాలన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి కోళ్లపరిశ్రమ ఇబ్బందులు తీసుకెళ్లగా ఓ విధానాన్ని రూపొందించి ఆదుకుంటామని ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని ముకుందరెడ్డి కోరారు. ఆందోళనలో సంఘం కార్యదర్శి పడాల సుబ్బారెడ్డి, ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల జోనల్‌ ఇన్‌చార్జులు గంగాధరరావు, కుటుంబరావు, గన్నమని హరికృష్ణ, రైతులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని