logo

మహిళా సంక్షేమంపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్‌

మహిళా సంక్షేమం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ రంజిత్‌బాషా అధికారులకు సూచించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు

Published : 07 Feb 2023 03:26 IST

ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న రంజిత్‌బాషా, జేసీ, అధికారులు

కలెక్టరేట్‌ (మచిలీపట్నం), న్యూస్‌టుడే: మహిళా సంక్షేమం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ రంజిత్‌బాషా అధికారులకు సూచించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా రోజూ అనీమియా పరీక్షలు నిర్వహించాలన్నారు.  జేసీ అపరాజితసింగ్‌, ఇతర అధికారులతో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. చల్లపల్లి మండల పరిషత్‌కు చెందిన రాజీవ్‌గాంధీ షాపింగ్‌ కాంప్లెక్స్‌లోని 18 దుకాణాలకు 2011 నుంచి వేలం నిర్వహించడం లేదని విచారించి బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్‌ ఫిర్యాదు చేశారు. పోర్టుకు అనుసంధాన రహదారుల కోసం భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిందని మార్కెట్‌ విలువ ప్రకారం ఎకరాకు రూ.1.50 కోట్లు నష్టపరిహారం చెల్లిస్తే భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు పోతేపల్లికి చెందిన రైతులు వినతిపత్రం అందజేశారు.

ఆధార్‌ కేంద్రం ప్రారంభం: ఆధార్‌ నవీకరణ సేవల కోసం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఆధార్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. కేంద్రం ద్వారా అందించే సేవలపై సిబ్బందిని ఆరా తీశారు.

జాతీయ రహదారి పనులు సమన్వయంతో చేపట్టాలి: జాతీయ రహదారులకు సంబంధించిన పనులను సమన్వయంతో చేపట్టాలని కలెక్టర్‌ రంజిత్‌బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం విజయవాడ తూర్పు, పశ్చిమ బైపాస్‌ రహదారిపై వివిధ శాఖల అధికారులతో చర్చించారు. జాతీయ రహదారి -16కు సంబంధించి గన్నవరం నియోజకవర్గ పరిధిలోని పొట్టిపాడు నుంచి ఉయ్యూరు మీదగా గుంటూరు వైపు వెళ్లే పనులను ఆయా శాఖల అధికారులు చర్చించి చేపట్టాలన్నారు. జేసీ అపరాజితసింగ్‌, డీఆర్వో వెంకటేశ్వర్లు, వివిధ ఇంజినీరింగ్‌శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

జగనన్న లేఔట్‌ల్లో గృహ నిర్మాణాల లక్ష్యం పూర్తి చేసే విషయంలో అధికారులు అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్‌ రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. జడ్పీ సమావేశ మందిరంలో జేసీ అపరాజితసింగ్‌తో కలిసి  గృహనిర్మాణాల పురోగతి, ఇతర సమస్యలపై మండలాల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని