logo

ఆ భవనం మూడో అంతస్తును కూల్చేయండి

యథాతథ స్థితి (స్టేటస్‌ కో) ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ భవనం నిర్మించిన పిటిషనర్లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను ధిక్కరించినందుకు మూడో అంతస్తును కూల్చివేయాలని విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులను ఆదేశించింది.

Published : 07 Feb 2023 03:26 IST

విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు హైకోర్టు ఆదేశం
ఉత్తర్వులను ఉల్లంఘించిన నిర్మాణదారులపై ఆగ్రహం
చట్టబద్ధపాలనపై వారికి గౌరవం లేదని ఘాటు వ్యాఖ్య

ఈనాడు, అమరావతి: యథాతథ స్థితి (స్టేటస్‌ కో) ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ భవనం నిర్మించిన పిటిషనర్లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను ధిక్కరించినందుకు మూడో అంతస్తును కూల్చివేయాలని విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులను ఆదేశించింది. కూల్చివేత ఖర్చును భవన యజమానుల నుంచి వసూలు చేయాలని పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.
విజయవాడ ఇస్లాంపేట, సయ్యద్‌ గులాబ్‌ వీధిలో అనుమతులు ఉల్లంఘించి ఓ భవనాన్ని నిర్మించామనే కారణంతో విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు ఇచ్చిన కూల్చివేత నోటీసును సవాల్‌ చేస్తూ మీనాకుమారి జైన్‌, మరొకరు 2020లో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం 2020 సెప్టెంబరు 28న భవన నిర్మాణ విషయంలో యథాతథ స్థితి ఉత్తర్వులు జారీచేసింది. ఆ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ నిర్మాణం చేశారని, అధికారులు న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. దీంతో వాస్తవాన్ని తేల్చేందుకు న్యాయస్థానం అడ్వొకేట్‌ కమిషన్‌ను నియమించింది. పురపాలకశాఖ అధికారులు కౌంటర్‌ దాఖలు చేస్తూ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి మూడో అంతస్తు, దానిపై వాటర్‌ ట్యాంక్‌ను నిర్మించారన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. పిటిషనర్‌ తీరును తప్పుపట్టారు. చట్టబద్ధ పాలన అంటే వారికి గౌరవం లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. మూడో ఫ్లోర్‌, వాటర్‌ ట్యాంక్‌ను కూల్చివేయాలని పురపాలకశాఖ, విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులను ఆదేశించారు. అవసరమైతే పోలీసు రక్షణ తీసుకోవాలని సూచించారు. విచారణను ఈనెల 27కి వాయిదా వేశారు. అధికారులు మొట్టమొదటిసారి ఇచ్చిన నోటీసుపై పిటిషనర్లు దాఖలు చేసిన ప్రధాన వ్యాజ్యంపై తర్వాత విచారణ చేస్తామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని